28, ఏప్రిల్ 2013, ఆదివారం

కవి సమ్మేళనం

కవి సమ్మేళనం
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
 పేజీల కొద్ది కవితలు చదవాలని పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి అదే పోతగా పయనాలు

 వేదిక పైన ఉన్న వారు మాత్రం దాతల పొగడ్తల్లో
వారు,  వారి కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ   కీర్తిని కవులంతా  గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న సభా మందిర మది
 కవులు కవితలు కాదని పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని విషయాలు వల్లించారు

 ఫోటోలు వీడియోలు జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని కళామతల్లి పెదవి విరిచింది
ఆహుతులైన శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది

చినుకులు

తిన్నది అరగక పొతే
దేహానికి తప్పదు రుగ్మత
అనుకున్నది జరగక పొతే   
గుండెకు ఉండదు భద్రత

ఇంకా కావాలని దేహానికి దాహం
ఎన్నాళ్ళీ ఒత్తిళ్ళని హృదయానికి సందేహం
ఎందుకు ఎవరికీ ఎప్పుడు ఏలని
గుండెకు మనసుకు నిత్యం సంవాదం

ధనం ధనం ధనం
జగతిని నడిపే ఇంధనం   
మనం మనం మనం
ఆ మత్తులో గమ్మత్తుగా మనమందరం

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఉగాది అంటే ఉల్లాసం

ఉగాది  అంటే ఉల్లాసం
ఉగాది అంటే ఉత్సాహం  
ఉర్వి నలు చెరగులా నడిచే నవనవో న్మేషం
అనంత కాల గమనం లో
ప్రతి ఏటా ప్రకృతి పాడుకొనే ఉజ్వల గీతం

ఈ ఆనందం ఈ అద్భుతం ఎవరికీ!!!
ప్రకృతికి , పచ్చదనం పరచుకున్నలోగిళ్ళకి
కొమ్మలకి, కోయిలమ్మకి, కొత్త చిగుళ్ళకి
విరబూసిన వేప చెట్టుకి
విరగకాసిన మామిడి కొమ్మకి
చండ  ప్రచండంగా ప్రకాశించే భానుడికి
వస్తున్నామని హెచ్చరించే వడగాలులకి
 ఉగాది అంటే ఉల్లాసం  ఉత్సాహం

మరి నీకు నాకు ఈ మనిషికి
ఏమున్నది కొత్తదనం...
వచ్చిందా నవోదయం
ఇది నిన్నటి ఉదయమే
నిన్నటి హృదయమే
నిరంతరం ఎగిసిపడే కల్లోల కడలి తరంగమే
నిన్నటి దాహమే  నిబిడాంధకారమె
నూతనత్వం చేతనత్వం  ఏనాడు  
కనీ విని ఎరుగని కూపస్త మండూకం లా
స్వేచ్చా స్వాతంత్ర్యాలు విడనాడి
ఒకే గాడిలో తిరుగాడే గానుగెద్దు  నడకలా
నిరాశలో నిర్వేదంలో నిస్తేజం లో 
ఏమిటి జీవితం !!
ప్రకృతికి లాగే మనిషికి
ఆరు ఋతువులు ఉంటే ఎంత  బాగుండును
ఈ వసంత మాసం ఈ కోయిల గీతం ఈ పచ్చదనం పరవశం
మన జీవితాలలోకి అనునిత్యం తరలి వస్తే ఎంత బాగుండును

అదేమి  చిత్రమో  
అవనికి ఆరు ఋతువులు అయితే
ఈనాటి మనిషికి ఒకే ఒక ఋతువు
దాని పేరే ధన ఋతువు
 జీవించి నన్నాళ్ళు
ఆనందం సుఖము శాంతి అన్ని కరువు
దాని పర్యాయపదమే అవినితి అక్రమార్జన
దాని పర్యవసానమే మద్యపానం మనోవేదన
జీవిత పర్యంతం ఎంత ఉన్నా ఎంత తిన్నా
ఇంకా కావాలని రోదన
ఆరని తీరని వేదన ఆవేదన
 ఈ రుతువులోనే తెల్లారి పోతుంది మనిషి జీవితం
ఈ క్రతువు తోనే మసక బారి పోతుంది కల్లోల భారతం

 ఏ ఉగాది వినిపిస్తుంది అసలైన జీవన సత్యాన్ని
ఏ ఉగాది విశదీకరిస్తుంది  మానవ జీవన తత్వాన్ని
ఏ ఉగాది కొని తెస్తుంది ఇలపైకి స్వర్గాన్ని

అందుకే నేను కోయిలనై
కొమ్మ కొమ్మకు ఎగురుతున్నాను
కొత్త పాటలు కట్టి
మనిషి మనిషికి వినిపిస్తున్నాను
ఈ గాలి విరాళి ఈ నేల ఈ పచ్చదనం
ఈ ఆనందం ఈ అభినివేశం
 ఈ గీతం ఈ గానం  మీ కోసం
అని దీవిస్తున్నది అరుదెంచిన ఈ మధుమాసం
హాయిగా ఆలకించండి ఈ 'విజయ' దరహాసం