6, ఏప్రిల్ 2014, ఆదివారం

పాపం సేవ చేస్తారట !!

పాపం సేవ చేస్తారట ! ?

ప్రజా సేవ చేస్తాం
మీ సేవలో తరిస్తాం అని  చెప్పడం కోసం
ఎవరైనా ఇంతగా ప్రాధేయ పడాలా
రేయింబవళ్ళు ఇలా ప్రాకులాడాలా
కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా
కల్లు  సారాయి పోయించాలా
మద్యం మత్తులో జనాన్ని ముంచెత్తాలా
డబ్బు మంచి నీళ్ళలా వెదజల్లాలా
ఒకరికి సేవ చెయ్యడానికి ఇన్ని పాట్లు పడాలా
పాదాభి వందనాలు తాగి తందనాలు
ఎందుకు పాపం వీళ్ళకి ఇంత  దురవస్థ
సామాన్యుడికి అర్ధంకాని ప్రశ్న ఇది
కాలానుకూలంగా ఈ దశాబ్దంలో
ప్రతి నాయకునికి పట్టిన దుర్గతి ఇది

ఆశ్చర్యంగా ఉంది అసహ్యంగా ఉంది
పక్కవాడిని పట్టించుకోని వాళ్ళు
అయినవాళ్ళని విసిరి కొట్టిన వాళ్ళు
ఇరుగు పొరుగును ఈసడించుకున్న వాళ్ళు
సంపద గుట్టలుగా పోగు చేసుకున్న వాళ్ళు
చీకటిలో పూడ్చి పెట్టిన వాళ్ళు
రహస్యంగా పాతి పెట్టిన వాళ్ళు
నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు
నిర్లజ్జగా యాచిస్తున్నారు
సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని
కాళ్ళవేళ్ళా పడి  దీనంగా వేడుకొంటున్నారు
దయయుంచండని ప్రాదేయపడుతున్నారు
పాపం ఎంత కష్టం ఒచ్చి పడింది  వీళ్ళకి
సిగ్గు లేదేమో ఇలా అడుక్కోవడానికి
మళ్ళి అడుగుతున్నా !
ఇంత యాతన అవసరమా
ఇంకొకరికి సేవ చెయ్యడానికి

కాలమా ఎంత పని చేసావు
చిత్ర విచిత్రంగా అడిస్తున్నావు
ధరిత్రి ఏనాడు ఎరుగని
వింత చరిత్ర రాస్తున్నావు