24, జనవరి 2012, మంగళవారం

ఒక్కరూ విలపించరేమి

పుష్ప ఫల భరితమైన
పచ్చని తరువొక్కటి
ఫెళ ఫెలార్భటులతో
నేల కూలితే
ప్రకృతి
వికృతంగా విలపించింది!

సమ్మోహనంగా నవ్వుతున్న
అరుణాధర మొక్కటి
సన్నని వేదనతో విల విల్లాడితే
వెన్నెల సైతం వెక్కి ఏడ్చింది!

మరి..........
పురుషుడి గుండెల్లో
నిరంతరం పసిడి కాంతులు చిందిస్తూ
తోడూ నీడగా నడయాడే
స్త్రీ బ్రతుకు
ముక్కలు ముక్కలై పోతుంటే
ఒక్కరు ఒక్కరు
విలపించరేమి
వెక్కి వెక్కి ఏడ్వరేమి?


చెక్కిళ్ళపై సెలయేళ్ళు

పచ్చని కొమ్మ
పక పక నవ్వితె
వికసించాయి కుసుమాలు....
కోయిలమ్మ
గళం విప్పితే
పరుగు తీశాయి సెలయేళ్ళు......
చిలకమ్మ
గొంతులో చిప్పిలినవి
పలుకుల రతనాలు

మరి...
ఈ చెల్లెమ్మ నవ్వుకు
ఏరి ....
ఎదురు చూడరే ఎవరూ
ఎదను తెరిచి
ఆహ్వానించరేం ఒకరూ

అందుకే
ఆమె చెక్కిళ్ళపై సెలయేళ్ళు
చుట్టూ పలుకుల ములుకులు
ఆకలి గొన్న తోడేళ్ళు

ఆత్మను వెలిగించు కోవాలని

నీలో ఒక అమ్మ ఉన్నది
ఆమెకు నా నమోవాకాలు
నీలో ఒక చెల్లి ఉన్నది
ఆమెకు నా ఆశీర్వచనాలు
నీలో ఒక ఆర్తి ఉన్నది
దానికి నా అభినందనలు

నీలో ఒక అగ్ని ఉన్నది
దానికి నా ఆహ్వానాలు

అడగాలని ఉంది
ఈ సహనం ఎన్నాళ్ళు
ఈ దహనం ఎన్నాళ్ళు
నిలదీయాలని ఉంది
ఈ నిర్లిప్తత ఎన్నాళ్ళు
ఈ నిర్వేదం ఎన్నాళ్ళు
బ్రద్దలు కొట్టాలని ఉంది
భస్మం చేయాలనీ ఉంది
అర్ధం లేని నియమాలు
నిద్దుర లేపాలని ఉంది
సిద్ధం చేయాలని ఉంది
నీకోసం సరికొత్త ఉదయాలు
బ్రతికించు కోవాలని ఉంది
నా అమ్మను నీలో
వెలిగించు కోవాలని ఉంది
నీ ఆత్మను నాలో

ఓ స్త్రీ

ప్రతి అక్షరాన్ని
ప్రయోగించాలని ఉంది
ప్రతి పదాన్ని
ఆయుధంగా సంధించా లని ఉంది!

ఓ స్త్రీ .......
నువ్వు నా అమ్మవు
నువ్వు నా చెల్లివి
నిన్ను కబళించే
కఠోర నియమాల నుంచి
నిన్ను భక్షించే
నర రూప రాక్షసుల నుంచి ......
నిను రక్షించు కోవాలని ఉంది!

అమ్మా !
నన్ను మనసారా దీవించు
నే తలపెట్టిన దీక్షకు
నీ దీవెన లందించు
ఈ అలుపెరుగని సాధనలో
నాకు విజయాన్ని ప్రసాదించు!

19, జనవరి 2012, గురువారం

ఒక గీతం

గుండె గుండెలో ఒక గీతం
ఉండే ఉంటుంది
వెండి వీణలా జీవనరాగం
మీటుతు ఉంటుంది
మదిలో ఎదలో పదనిస రాగం
పాటై ఉంటుంది
మనసు సొగసు మల్లెల గుస గుస
వింటూ ఉంటుంది //

కంటి పాపలో నీలాకాశం
నెలవై ఉంటుంది
కంటి చూపులో వెన్నెల మాసం
కొలువై ఉంటుంది
పెదవి మీటితే ఒక మధుమాసం
వధువై వస్తుంది
పదము పాడితే ఒక దరహాసం
వరమే ఇస్తుంది //

సందె గాలిలో జావళి పాట
తోడుగా వస్తుంది
కాలి అందెలో జాబిలి గీతం
వేడుక చేస్తుంది
కుసుమ శయ్యపై కుంకుమ రాగం
కోవెల కడుతుంది
కుసుమించిన జీవనరాగం
కోయిల ఔతుంది//

నా నడక

అందరు దీపాలు వెలిగిం చుకొనే వేళ
నేను నీ రూపాన్ని వెలిగిం చుకొంటాను
అందరూ మనుష రూపాలు ధరించి
స్వార్ధం మోసం దుర్మార్గం
తదితర మార్గాల వైపు తరలి పోయే వేళ
నేనోకడినే ఏటికి ఎదురిదే వానిలా
నీ దివ్య సౌందర్యం వైపు నడక సాగిస్తాను
అందరికి నేను వెర్రి వాడిలా కనిపించినా
ఎర్రని పెదవి వైపుగా నా నడక
ఓ దివ్య పధం చేరుకోవాలని
అద్భుత నిధిని చేకొనాలని

పుప్పొడి రాలిన చప్పుడు

గుప్పెడు అక్షరాల్ని
నీ అందాల పైన చల్లితే
ఆశ్చర్యం అవి
కవితలయ్యాయి
గొప్పగా ఆ కవితల్ని
గుండె గుండెకు
వినిపించాలని బయలుదేరితే
ఆశ్చర్యం ఆశ్చర్యం
అందరి హస్తాలలో
నా కవితా గుచ్చాలే