4, జులై 2018, బుధవారం

నా కనులలో
ఇంకా తడి ఉన్నది
మాసిపోని మమతల సడి ఉన్నది
నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది
ఏనాటిదో మరి
ఈ శోకం నా వాకిట పడి ఉన్నది
ఇన్ని యుగాలుగా
నలిగిన నా హృదయం
నీ సన్నిధి చేరాలని తహ తహ పడ్తున్నది
కన్నీటి ప్రవాహంలో కాలం కొట్టుకు పోయినా
కత్తుల వంతెనపై నడిచి నట్లున్నది
నువ్వు లేని ఈ లోకం
నిప్పుల సుడిగుండం వలె ఉన్నది
ఎంతకు చల్లారని ఈ శోకం
ఉప్పెనలా ఎగిసి పడ్తున్నది
ఎందుకో ఎద లోపల ఈ వేళ
చితి మంటల చిట పట వినిపిస్తున్నది
ఏనాటిదో ఈ ఓటి పడవ
తిరిగి రాని లోకాలకు పయనిస్తున్నట్లున్నది
-----------------------------నేను సగం దేహంగా మిగిలిపోయిన సందర్భం ---నా మనసు గుర్తు చేసుకున్న వేళ---

29, జూన్ 2018, శుక్రవారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది
నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన గళమెత్తి గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది
ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది
లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది
ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన
అధర ప్రాంగణ మొకటి నన్ను కరుణిస్తూనే ఉంటుంది
నిన్ను చూచి ఆకాశం.
తన నుదుట తిలకం దిద్దుకున్నది
నిన్ను మెచ్చి మధుమాసం
తన నడకను నీ దిశగా మార్చుకున్నది
నిండు పున్నమి దరహాసం
నీ ఆధరాన చేరి
ఆనంద తాండవం చేస్తున్నది
గాలికి ఎగిరిన
నీ కురులను చూచి
నీలి నింగి వంగి వంగి
వందనాలు చెబుతున్నది
నీ సౌందర్యదీప్తిని గని
మల్లె ముందారం సన్నజాజి
మూతి ముడుచుకుంది
ఇన్నిన్ని వన్నెల చిన్నెల
సోయగాల చెలువములు తిలకించి
ప్రకృతి నీకు ప్రణామం చేస్తున్నది
ఒక వాన పాట..
----//------
ఒక చినుకు
పలికింది ఓంకారం
ఒక చినుకు
అలదింది సిందూరం
ఒక చినుకు
చుట్టింది శ్రీకారం
ఒక చినుకు
మీటింది సింగారం //
పెదవిపైన
పడిన వాన గానమాయెను
అది గుండెపైన
జారగనే జాతరాయెను
నడుము పైన
పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన
మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి
తనువంతా బృంద గానమై
కనుల ముందు
బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి
తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి
పరుగిడగా వనము నవ్వెను
తనువంతా
తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి
మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే
గాలివాన ఆగిపోయెను
ఆదమరచి
మనసు వీణ మూగవోయెను //
తెలుగుకు
వందనం
తెలుగు
భాషామతల్లికి
అభివందనం
తెలుగు సుమములు
విరబూసిన ఈ నేల
పూల మందిరం
తెలుగు తేజం
వెల్లివిరిసిన
ప్రతి హృదయం
నవనందనం
తెలుగుకు వందనం..
తెలుగు జాతికి వందనం..
తెలుగు మహస్సుకు వందనం
తెలుగు వచస్సుకు వందనం
తెలుగు యశస్సుకు వందనం
ఎన్ని చిలిపిదనాలో
ఆ నవ్వులలో ఉన్నాయి
ఎన్ని పూలవనాలో
ఆ పెదవులపై ఉన్నాయి
ఎన్ని మౌనగీతాలో ఎన్నిపారిజాతాలో
ఎన్ని మూగరాగాలో అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి
నడకలు బరువైనాయి
మల్లెలు మరులైనాయి
మాటలు కరువైనాయి
అగరు పొగలు అత్తరులు వందిమాగధులైనాయి
అన్ని -వంగి వంగి వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి ,
మంగళ వాద్యాలున్నాయి
ఊపిరిలో మందార మకరంద
పోతన పద్యాలున్నాయి
ఒంగిన ఆ కనుదోయి ఆ ఓరచూపు లెవరికోసమోయి
అది అరవిరిసిన మరుమల్లెల మందహాసమేనోయి //
ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప !!?
కొన్ని కుసుమాలు కొన్ని భ్రమరాలు
ఇంకొన్ని వెన్నెల కిరణాలు మలయపవనాలు
ఒక రోజు నా లోగిలిలోకి బిరబిర నడిచి వచ్చ్చాయి
ప్రణయ కవిని కలుసుకోవాలని నాతో అన్నాయి
లోనికి రారమ్మని సాదరంగా ఆహ్వానించాను
మీరు వెదికే ఆ కవిని నేనే నన్నాను
ఆశ్చర్యంగా అవి నాకు అంజలి ఘటించాయి ఎంతో ఋణపడి ఉన్నామన్నాయి
ఎవరు పట్టించుకోని తమని అనునిత్యం పలకరించడం, కావ్యగానం చెయ్యడం
అరుదన్నాయి,, అపురూపమన్నాయి
సుమదళాల పరిమళాలు నాపై చల్లి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాయి
ఇలా నన్ను నేను మరిచిపోతుంటే -
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప
అర్ధం చేసుకొరూ !!!!!!!!!
నాదేమో గుప్పెడు గుండె ....నిండి పోయింది తాను 
ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎదలో వూపిరాడనీయకుండా 
ఇంక ఎలా మిన్నకుండగలను ఏమి రాయకుండా 
పోనీ తనను పంపిద్దామంటే ఆమే కదా నాకు అండదండ 
మీతో ఈ విషయం అంటున్నానని, నా బాధ చెప్పుకున్నానని 
తలనిండా పూలు ధరించడమే కాకుండా, పట్టుకొచ్చింది ఒక పూలదండ 
పూలదండతో పాటు రెండు బాహువులు సాచి అల్లుకున్నది మెడనిండా 
ఇంకెలా మనగలను జీవించగలను ఒక నిముసమైనా ఆమె లేకుండా -------
‘చెప్పాలని ఉంది 
దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కధ 
మట్టిని మణిగా చేసిన మరపురాని దేవత కధ ‘’
మీరే చెప్పండి ఎలా మిన్నకుండ గలను ఇలా రాయకుండా, హాయిగా పాడకుండా 
ఇన్ని ‘డాం ‘ లతో -డాండ డడాండ డాండవం - చేసిన నన్ను ఏం చేయాలని అనుకొంటున్నారా 
అమ్మయ్య గండం గడిచిందని హాయిగా వూపిరి పీల్చుకొంటున్నారా 
అంత సులభం కాదు మిత్రమా! రాస్తూనే ఉంటాను వూపిరాడ నీయకుండా 
మీరు మాత్రం దూరంగా నెట్టేయకండి దీనిని చదవకుండా 
అర్ధం చేసుకోరూ .......................
ఇప్పుడు ఒక చెట్టు
ఈ నేలపైన నాటుతున్నావంటే
రేపు నువ్వు దానికింద
సేద దీర్చుకుంటావని కాదు
అప్పటిదాకా చిరంజీవిలా
జీవించి ఉంటావని కాదు
అది ఎందరికో నీడ నివ్వాలని
నీ జీవితము అంతే
నువ్వు అవనిపై మొలకెత్తావంటే
నీ ఆనందం కోసమే కాదు
నీ ముద్దుముచ్చట మురిపాలు
తీర్చుకోవడం కోసమే కాదు
మహోన్నత వటవృక్ష మై
నలుగురికి ఆదర్శంగా నిలుస్తావని
నీ నీడలో ఎందరికో ఆశ్రయ మిస్తావని
ఈ జగతికి మార్గదర్శివి ఔతావని
ఔనన్నా కాదన్నా ఇది జీవిత సత్యం
అందుకు ప్రత్యక్షసాక్ష్యం ఆ వటవృక్షం
పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు
ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు
ఆర్ద్రత ఇగిరి పోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని
నీలాకాశం లో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు
అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు
ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు
ఈ నేను నేను కాదు
ఈ మేను నాది కాదు
ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఏమో
ఎవరో ఒకరు ఇందులోకి వచ్చి వెళుతుంటారు
ఉన్నన్నాళ్ళు అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంటారు
ఈ రూపం నాది కాదు
ఈ పాపం నాది కాదు
ఇది పూర్వ జన్మ కర్మ పరిపాకం
మళ్ళి మనిషిగా పుట్టి అతడు చేసుకున్న నిర్వాకం
ఈ సిరులు నావి కావి
ఈ సంపద నాది కాదు
ఇవి మిన్నాగులు నివసించే సంపెంగ పొదలు
నన్ను నాలోంచి విసిరేసిన కన్నీటి కధలు
నేనిక్కడ కొన్నాళ్ళు న్నానన్నది నిజం
జననం మరణం ప్రతి ప్రాణికి సహజాతి సహజం //
41
నా కలమే నాకు నేస్తం
సమ్మోహనాస్త్రం - సకల శాస్త్రం ,,కాలమే నాకు సమస్తం
42ఎంత హాయిగా ఉంది ఈ విశ్రాంత జీవనం ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రశాంత భావనం
ప్రతి క్షణం ఆలోచనలకి అక్షరాకృతి కల్పిస్తూ ఈ స్వీయ కావ్య రచన ఎంత సమ్మోహనం
43
పొలాలు స్థలాల మిద అజాగళ స్థనాల మిద పిచ్చి లేదు
సంపదల మీద ఆసక్తి లేదు కారణం అవి సృష్టించే విలయాన్ని భరించే శక్తి లేదు.
44
ఆగ్రహం ఆవేశం అక్షరీక రిస్తున్నప్పుడు నేనొక అగ్ని గీతాన్ని
అందరి ఆనందం కోసం ఒక ప్రేమ కావ్యం రాస్తున్నప్పుడు నేను సాహిత్యాన్ని సంగీతాన్ని
45
ఎప్పుడు చిరు నవ్వులు ఎదురైతే ఎంత బావుంటుంది
మనసు అప్పుడే కదా విరిసిన మరుమల్లె తోటలా ఉంటుంది
46
ఎదిరించాను ఒకనాడు ఎదురైన మృత్యువును
సృష్టించు కోలేదు ఏనాడు ఒకరైనా శత్రువును , కనుకనే నేను అజాత శత్రువును
47
నేనిప్పుడు స్వేచ్చా విహంగాన్ని
ఏ అటు పోటులు లేని కడలి తరంగాన్ని
వేల వేల కుసుమదళాల పరిమళాలు దాచుకున్న అంతరంగాన్ని
48
ఒక పున్నమి నన్ను వరించింది
చిరునవ్వుతొ పలకరించింది
చల్లని వెన్నెల నాపై చల్లి పరసించింది
49
ఎక్కడికి నేను వెళ్ళను , నా మనసే వనాల వెంట తిరిగి వస్తుంది
ఎన్నో పరిమళాలు మోసుకొస్తుంది, అన్నిటిని నా మ్రోల కుమ్మరిస్తుంది
అంతే - నాలోంచి మందార మకరంద మాధురీ సమ్మిళితమైన ఓ కవిత కదిలి వస్తుంది
50
ఎందుకో అప్పుడప్పుడు మనిషిని చూడాలని ఉంటుంది
అందరిలో 'పుప్పొడి రాలిన చప్పుడు' వినాలని ఆశగా ఉంటుంది
నాదంతా పిచ్చి వెర్రి దురాశ అత్యాస గాక పొతే మరేమిటి
యంత్రమై తిరుగాడే వాడిలో మనిషితనం ఎలా ఉంటుంది
ఏటి ఒడ్డున నడిచి వెళ్తుంటే -ఒక కెరటం కదిలొచ్చి
తన గురించి ఒక కవిత రాయమని కాళ్ళ వేళ్ళా పడుతుంది
పండు వెన్నెలలో తడుస్తుంటానా -ఒక కిరణం ముద్దిచ్చి
తన సోయగం ఒక గీతంగా రాయమని ప్రాధేయపడుతుంది
అంతలో ఎక్కడినుంచి వస్తుందో ఏమో
ఆమె చిలిపి నవ్వొకటి, ఎదురొచ్చి
ఇంకెందుకు ఆలస్యం . కలం పట్టుకొమ్మని భుజం తట్టుతుంది

21, ఏప్రిల్ 2018, శనివారం

రామచంద్రుడితడు .రఘువీరుడు'
-------------------------------------------
బాలకృష్ణు డితడు భవదీయుడు
లలిత లలిత భావకవిత
సుతి మెత్తగ రాయగలిగే భావుకుడు //
అవని పైకి అరుదెంచిన ఆమని యితడు
అందరి మదిలో వికసించిన బృందావని యితడు
పదపదమున వినిపించే బృందగానము
ఇట్టె ఆకట్టుకొనే రచనా సంవిధానము //
అనవరతము వినిపించే వేణుగాన మితడు
అరవిరిసిన పువ్వులకు ప్రాణనాథు డితడు
అడుగడుగున మంజుల మృదు మధుర భావము //
ఆ చిన్నారి చిలిపి కృష్ణుని నామధేయ మితడు
అలరించిన అలనాటి కృష్ణ శాస్త్రి యితడు
ప్రణయమై ప్రభవించిన కవితామూర్తి యితడు //
(నిలువెత్తు రాముని ఎదుట నేను ఉన్న చిత్రం చూచాక..ఈ గీతం నేనైతే ఎలా వుంటుందో అన్న భావనతో
నేను చేసిన చిన్న ప్రయత్నం ..)
ఆ శ్రీరామచంద్రునికి భక్తీ ప్రపత్తులతో ప్రణమిల్లు తూ ------
మొగ్గ
పువ్వుగా మారుతున్న
దృశ్యం చూస్తున్నాను
సుమ దళాలలోకి
పరిమళాలు 
బిరబిరా చొరబడిన
సవ్వడి వింటున్నాను
సంరంభంతో
ఆ సౌరభాలను మోసుకెళ్తున్న
చిరుగాలి కెరటాల
కేరింతలు గమనిస్తున్నాను
వనమంతా వసంత శోభ
సంతరించు కొంటున్న ఆనందం
పువ్వు పువ్వులో
యవ్వనం చిందు లేస్తున్న
లాస్యం తిలకిస్తున్నాను
ఔను
నాకు ఆశ్చర్యం
ఆ పువ్వుల పరిమళం
నీ నవ్వుకి ఎలా వచ్చింది
ఆ మల్లియ తెల్లదనం
నీ పెదవి పైకి ఎప్పుడు చేరింది
ఆ మకరంద మాధుర్యం
అచ్చట ఎవ్వరు దాచింది
ఇన్ని
సోయగాలు
సరాగాలు
సౌభాగ్యాలు
ఏ పువ్వు నోచింది!
ఒక ధనికుని మరణ భయం... =================
కనులు వాలి పోతున్నవి
దిగులుగా ఉంది
సిరులు ఎదురుగా
గుట్టలుగా పడిఉన్నవి 
బాధగా ఉంది
గుండె ఆగి ఆగి కొట్టుకొంటున్నది
భయంగా ఉంది
ఏమౌతాయి ఈ కలిమి గుట్టలు నిరామయంగా ఉంది
ఎన్ని ఆశలు ..ఎన్ని బాసలు
బ్రతుకు ముగిసి పోతుందా!
నిజం ఎంత చేదుగా ఉంది
అప్పుడే మరణమా
చివరి చరణమా
ఆవేదనగా ఉంది
ఎంత జీవితాన్ని విస్మరించానో,
కొరత వేశానో ఎగతాళిగా ఉంది
జాబిల్లి అందాలు ఇన్నాళ్ళు గుర్తు రాకపోవడం వింతగా ఉంది
ఏమి సాధించానో ఎంత వాదించానో
నన్ను చూస్తే నాకే జాలిగా ఉంది
నేను మనిషినన్న విషయం
మరణం ఉంటుందన్న నిజం కొత్తగా ఉంది
కళ్ళు మూతలు పడుతున్నవి
మత్తుగా వుంది
నాకు మరణమా
వినడానికి గమ్మత్తుగా ఉంది
సందేహం లేదు
మరణం ఆసన్నమౌతోంది
శ్వాస వేగం తగ్గింది
చూపు మందగించింది
ఇంకెన్ని క్షణాలో..
అనుమానంగా ఉంది
అరే .! ఇదేమిటి..
ఎవరూ..వెక్కి వెక్కి ఏడవడం లేదు ఆశ్చర్యంగా ఉంది
ఆర్జించిన అనంత సంపద
ఎదురుగా దిగులుగా ఉంది
అనురాగం అనుబంధం
ఎప్పుడెప్పుడా అన్న ఆనందంలో ఉంది
ఎందుకొచ్చానో ఈ భూమి మీదకి
అని ఇప్పుడనిపిస్తోంది
ఎప్పుడూ లేనిది,ఎందుకో మరి
లేమి మరింత అందంగా కనిపిస్తోంది
గుండె ఆగిపోతున్న చప్పుడు
ఆగిఆగి వినిపిస్తోంది
యముని మహిషపు
లోహపు గంటల మోత
భయ పెడుతోంది
అరె - ఏమయింది
ఎందుకు ఈ పగలు
నిసిరేయిలా ఉంది
కమ్ముకొస్తున్న హాయిలా వుంది
అ ర్ధ మ యిం ది...............
నేను మరణించి కొంతసేపయింది
ఒక చిరునవ్వు
చెంతకు రా రమ్మని పిలిచింది
అల్లన వొంగిన నయనం
సుస్వాగతమని హారతులిచ్చిది
అధర బింబాననం
చిరుచుంబనానికి చోటిచ్చింది
మధురాలింగనం
మన బంధం శాశ్వతమని మాటిచ్చింది
సిరి చందనం
కెమ్మోవిని సమ్మోహనం చేసింది
సిగలోని సిరి మల్లె
వల్లెయని తలయూచింది
ఏనాటి అనుబంధమో
ఎన్ని జన్మల సంబంధమో
ఈ మధురాభినివేశం
ఇన్ని వరాలిచ్చి ..
కరుణించిన ఆమె కోసం
మనసు మందిరమై వెలిసింది
చిరుగాలి
పరుగెత్తుకొంటూ వచ్చింది
ఏమిటి హడావుడి అన్నాను
అయ్యో !
చూడనే లేదా
ఆ తోటలో ఎన్నో
అరవిరిసిన సుమదళాలు
అవి వెదజల్లిన పరిమళాలు
అన్నీ జగతికి పంచాలి
జాగ్రత్తగా అందించాలి
'పరోపకార మిదం శరీరం'
అన్నారు కదా..
వచ్చినంత వేగంగా
నన్ను దాటుకుని వెళ్లిపోయింది
మనిషిని ...
స్వార్ధం దుర్మార్గం
కరడు కట్టిన మనిషిని
సిగ్గుపడుతున్నాను
మలయానిల భావనలు విని..
ఓ అందమైన ఉషోదయన
నవవికసిత కుసుమాలు
అత్యవసర సమావేశమైనాయి.
తమ ఒకరోజు జీవితానికి 
అర్ధం పరమార్ధం కల్పించే
అవకాశాల కోసం
తర్జనభర్జన జరిపాయి
ముఖ్య అతిధిగా
విచ్చేసిన ఆమె
ఆత్మీయ అతిధిగా
నన్ను ఆహ్వానించమని
ఒక ఉచిత సలహా ఇచ్చింది
అప్పుడు అక్కడ
నాకు జరిగిన సన్మానం
పూలతో పరిమళాలతో
నన్ను అభిషేకించిన విధానం
అనర్ఘళంగా కావ్య గానం చేసాను
అదే "ఈ కుసుమవిలాసం.."
అబ్బురపడిన సుమబాలలు
ఆనందంతో చప్పట్లు చరిచాయి
ఈ కావ్యంతో పాటు
తమ ఙివితం అజరామరమైనదని
నాకు జేజేలు పలికాయి
ఇవ్వు ....ఇవ్వు ...ఇవ్వు
ఎదుటివారికి, లేనివారికి
ఇవ్వడంలోనే ఉన్నది ఎంతో హాయి
అనాదిగా పశువులు పక్షులు 
నదులు చెట్లు మేఘాలు సైతం
అవనికి అన్ని ఇస్తూనే ఉన్నాయి
మానవజాతి మనుగడకు దోహదపడుతున్నాయి
మధురిమలు పంచుతూనే ఉన్నాయి
సృష్టిధర్మానికి విరుద్ద్ధంగా
కేవలం తీసు (దోచు) కోవడం తప్ప
ఎక్కడెక్కడో రహస్యంగా దాచుకోవడం తప్ప
ఇచ్చే గుణం మరచిన... ఓ మనిషీ !
ఏ ప్రాణికోటిలో లేని
ఈ స్వార్ధం దుర్మార్గం
దుర్వినీతి వంటి దుర్గుణాలు
నీ కేల అలవడినాయి
నీలో దయ కరుణ ఏల కొరవడినాయి
పదే పదే
నా మనసులో ఎవరిదో గుసగుస వినిపిస్తున్నది
విసవిస నడిచే
సుతి మెత్తని పాదాల సవ్వడి వినబడుతున్నది
ముసిముసి నవ్వులతో 
చెలరేగిన మిసిమి వయసు అల్లరి పెడుతున్నది
ఎదలోగిలిలో
సోయగాల గలగలలు సందడి చేస్తున్నాయి
సంగీత సరిగమలు, గజ్జెల రవళులు
గంధర్వ గానాలు గారడి చేస్తున్నాయి
ఏమిటి !!
నా ఎద ఎప్పుడు సంగీత వేదికగా మారినది
ఎవరు నా హృదయాన్ని
ఒక నిరుపమాన రమణీయ సభాస్థలిగా మలచినది
‘అందాల బొమ్మతో ఆటాడవా ..
పసందైన ఈ రేయి నీదోయి స్వామి ‘
ఒక అద్భుత సౌందర్యరాసి
నవరస భరితంగా నాట్యం చేస్తూ
నా ముందుకు నడచి వచ్చినది
‘’ఎంత హాయి ఈ రేయి
ఎంత మధుర మీ హాయి’’
పరవశ గానంతో , ప్రణవ నాదంతో
ఒక ప్రణయ గీతమై నా ఒడిలో చేరినది
నన్నల్లుకొని, హత్తుకొని, ముద్దులతో...
... ........................... .......
......... ........ ......... .......
ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నారా !
ఈ ......చుక్కల చక్కిలిగిలి ఏమిటంటున్నారా
నునుసిగ్గు
తన బుగ్గలపై చిందులు వేయగా
సిగ్గు బరువుకు
కంటిరెప్పలు అల్లన వాలిపోగా
ఆమె అన్నది....
భలే భలే వారండి మీరు
ఎవరైనా ఆ వివరాలు సవివరంగా చెప్పగలరా
అయ్యోరామ !..ఎలాగండి మీతో ,,
అర్ధం చేసుకో .....రూ ..........
ఎవరి గుండెను మీటినా ఒకటే రాగం వినిపిస్తోంది
ఎవరి ఎదను కదిపినా ఒకటే శోకం కనిపిస్తోంది
నడక దారిలో ఎందరు మనుషులు ఎదురయ్యారో
అందరిలో ఒకటే దావానల దాహం అగుపిస్తోంది
ఎంత చదివినా ఎన్ని నేర్చినా ఏమున్నది ఘనత
ఎక్కడ చూచినా దానవ సమూహం అనిపిస్తోంది
ప్రేమానురాగాలు మమతానుబంధాలు కరువై
లోకం అంతటా ఆటవిక రాజ్యం తలపిస్తోంది
ఇన్ని దారుణాలు మారణాలు మోయలేక
మరో దారి కానరాక ధరణి భోరున విలపిస్తోంది
ఎన్ని చెప్పినా ఎంత వగచినా ఏమున్నది కృష్ణా
ప్రతి మనిషిని లోభం స్వార్ధం తెగ బులిపిస్తోంది
చిలిపిగా నవ్వితే
చిందులేసింది హృదయం
చిత్తరువుగ మారితే
ఆగి చూచింది నయనం
ఎన్ని కిరణ కాంతులో
ఆ నగుమోములో
ఎన్ని మలయానిల లాలనలో
ఆ చూపులో
ఎన్ని మందహాస మధురిమలో
ఆ అరుణాధరంలో
ఎన్ని సన్నజాజి మెలికలో
ఆ నడుములో
ఎన్ని చరణ కింకిణీ రవాలో
ఆ నడకలో
ఎన్ని సౌందర్య రహస్యాలో
తనువులో..అణువణువులో
ఓ.. భగవాన్ !
ఇదే నా ప్రార్ధన
ఒకే ఒక అభ్యర్ధన ....
నన్ను నా నుంచి రక్షించు
అనవసరపు ఆలోచనల నుంచి
అర్ధం పర్ధం లేని ఆకలి నుంచి
ఆవేశ కావేషాల నుంచి దూరంగా ఉంచు
నాలోని రాక్షస ప్రవృత్తిని సంహరించు
ఓ దైవమా !
నాలోని అవలక్షణాలను శిక్షించు
అరిషడ్వర్గాలనుంచి
అందరు కోరుకొంటున్న స్వర్గాల నుంచి
అధిక భోగాభాగ్యలనుంచి
సిరిసంపదల నుంచి దారి మరలించి
నాలో జీవించు
నన్ను లాలించు
పరిపాలించు
నా మొర ఆలకించు ..
నేను .....
ఈ లోకం నుంచి విడిపోయాను
అసలేం జరిగినదో నాకు తెలియకుండానే
ఒక అమృత కాసారంలో పడిపోయాను
నా అక్షరాలు
నిర్మించుకున్న రమ్య హర్మ్యంలో
అప్సరాంగనలు
విహరించే అంతఃపురంలో
ఆ మూల గదిలో చిక్కుబడి పోయాను
ఒక అతిలోక సౌందర్య దివ్యధామంలో
సుమబాలలు అరవిరిసిన ప్రమదావనంలో
అపురూపమైన అతిధిగా వుండి పోయాను ,
బాధలు భయాలనుంచి,
చింతలు చిడిముడులనుంచి
ఆకలి దప్పుల నుంచి
ఆవేదనలు ఆక్రందనల నుంచి
ఆశ్చర్యంగా విముక్తుడి నయ్యాను
ప్రబంధ పరమేశ్వరుని ఇంట జన్మించి
భావకవితా ప్రతిభా మూర్తి నయ్యాను
ఆమె అందచందాలు అద్భుతంగా కీర్తించి
నవ యువ ప్రణయ కవి చక్రవర్తి నయ్యాను
అలా .....
ఒక సుముహూర్తంలో
ఈ మామూలు జనసమూహం నుంచి
మాయా మర్మం, మాధ్వి రసం
వెల్లువెత్తుతున్న కవన ప్రవాహం నుంచి
అల్లంత దూరంగా జరిగి పోయి
హాయి వెల్లువలో పగలూ రేయి కరిగిపోయి
ఒక సౌందర్యాప్సరో భామిని సాంత్వనలో...
ఆమె వెచ్చని ఒడిలో ఒదిగి వున్నాను

2, ఏప్రిల్ 2018, సోమవారం

అమ్మా !
తెలుగు తల్లీ !!
15 కోట్ల జనావళి
నాలుకపై నర్తించే కల్పవల్లీ
ఎవరికి నీవు కావాలి ?
ఎవరికి నీమీద జాలి ??
ఏ ప్రభుత పాడేను జోల
ఏ యువత వూపేను డోల..
అమ్మా
తెలుగు తల్లీ
నీకు వందనం ..
నీవున్న లోగిలి
నవనందనం....
నిన్ను విస్మరిస్తే ..
ఈ విశాల విశ్వం లో
తెలుగు వాడి ప్రగతి
తెలుగు జాతి ఖ్యాతి
అంధకారం బంధురం
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా..)
ఆ నలుగురు
---------------
ఈనాటి మనిషి
తన కోసం తాను బ్రతకడం లేదు
అసలు తన బ్రతుకు 
తన చేతిలో లేనే లేదు
పని పాట లేని
నలుగురు శాసిస్తున్నారు
పని కట్టుకొని
ఇరుగు పొరుగున వున్న నలుగురు
నిన్ను రెచ్చ గొడుతున్నారు
జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు
ఆశ్చర్యం ...
ఆ నలుగురి కోసం
వారిని మెప్పించడం కోసం
నిరంతరం నీ తపన
వారేమనుకుంటారోనని
అనుక్షణం నీలో సంఘర్షణ
అట్టహాసంగా వివాహాలు
వైభవంగా కర్మ కాండలు
ఆ నలుగురు
మెచ్చుకోవాలని రెచ్చగొట్టారని
ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు
ఈ నలుగురి కారణంగా
స్పర్ధలు కొని తెచ్చు కొంటున్నారు
నరక యాతనని
ముంగిలిలోకి ఆహ్వానిస్తున్నారు
ఆ నలుగురు అన్నారని
కోపోద్రేకం తనవారితో విరోధం
తగాదాలు పోలీసులు
న్యాయస్థానాలు ప్లీ డ ర్లు
చెప్పే వాడికేం .....
ఎగదోసే వాడికి ఇదో సరదా దురద
విన్న వాడే .
.వాడి చావు వాడు చస్తున్నాడు
చెప్పుడు మాటలు విని
చెడి పోతున్నాడు
ఈ నలుగురు
ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు
వీరి పాత్ర సమాజంలో అతి కీలకం
కల్లోలాలు సృష్టిస్తారు
కలహం దాకా నడిపిస్తారు
చాటుగా నవ్వుకుంటారు
ఆపై తప్పుకుంటారు
ఆ నలుగురు
మీ చుట్టూ ఉన్నారు
వుండే ఉంటారు
మిమ్మల్ని
అశాంతి గహ్వరాలలోకి
నడిపిస్తుంటారు
తస్మాత్ జాగ్రత్త .......
నువ్వు లేని నేను....
------------------------
ఇది ...విషాద వియోగాల సమ్మేళనం
ఇది నిశీధి నిరామయాల సహజీవనం
నీ చిరునవ్వులు కనిపించక
చిన్నబోయిన ఉదయాలు
నీ కనుసన్నలు కనిపించక
నివ్వెరపోయిన కుసుమాలు
సుతిమెత్తని నీ చేతి వేళ్ళలో
ఊపిరి పోసుకున్న పారిజాతాలు
సుమకోమలమౌ నీ గళ సీమలో
శృతి చేసుకున్న మౌనగీతాలు
నీ చల్లని మమతల పందిళ్లలో
అల్లుకున్న రాగబంధాలు
నన్ను నిలదీస్తున్నవి ..
నీ రూపం.. కనబడదేమని ప్రశ్నిస్తున్నవి
నీ మందహాసం కోసం ..పరితపిస్తున్నవి
నీ ఆత్మీయ స్పర్శకోసం అలమటిస్తున్నవి
ఎన్ని మమతలు...
మూటకట్టుకొనిపోయావో
ఎన్ని మలయానిలాల్ని
వెంటగొని పోయావో
ఎన్ని మానసాల్ని
దోచుకొని వెళ్ళావో
ఎంత రాజసాన్ని
మోసుకొని వెళ్లావో
ప్రకృతి దీనంగా విలపిస్తున్నది
పరిసరం వెక్కివెక్కి రోదిస్తున్నది
ప్రత్యూషం ఎంతకీ తరలి రాకున్నది
ప్రసూనం మొగ్గలోనే దాగున్నది
నీ సమక్షంలో ..ఎన్ని నిముసాలు
మధుమాసాలై కుసుమించాయని
నీ సన్నిధిలో ..ఎన్ని రోజులు
సన్నజాజులై వికసించాయని
నీ సాహచర్యంలో.. ఎన్ని ఊసులు
నెలవంకలై హసియించాయని
నీ సన్నిధానంలో ఎన్ని సంక్రాంతులు
నేల దిగి నడిచాయని....
(ఆమె ..అర్ధాంతరంగా
అంతర్ధాన మైన వేళ...
నాతో పాటు ప్రకృతి సైతం ..
ఎంతగా విలపించిందో ..
నేను వ్రాసిన దీర్ఘకవిత
"నువ్వు లేని నేను"..
స్మృతి కావ్యం నుంచి..)
సిగ్గు మొగ్గ లౌతున్న ఒక అమ్మాయిని
అమ్మలక్కలు ఆటపట్టించే- ఒక చిలిపి గీతం
-----------------------------------------------
చెప్పు చెప్పు చెప్పు ...
కంటి రెప్ప కప్పుకున్న
ఆ దుప్పటిలో -అతడెవరో
అచ్చట దాగున్నఆ వరుడెవరో
అంతగా నిన్ను ఆకట్టు కున్న
ఆ అపర మన్మదు డెవరో //
అందగాడా
నెలరేడా
వగకాడా
ఆరడుగులవాడా
అందమంతా అడిగి నాడా
అదే పనిగా పొగిడి నాడా
అదిరే పెదవిని మూసినాడా
ఎదలో కెప్పుడు వచ్చాడో
ఎన్నాళ్లుగ అక్కడ ఉన్నాడో //
అంత సిగ్గా
అబ్బో కందె బుగ్గా
అది వలపా
చిలిపి తలపా
అతడి పిలుపా
అంత గడుసు వాడా
అంత సొగసు కాడా
ఎలాఎలా ఉంటాడో
ఏకాంత వేళ
ఎలా పోదువుకున్నాడో //
అప్పుడప్పుడు
నిన్ను నీవు ప్రశ్నించుకో
నిన్ను నువ్వు
గెలుచుకున్నావో లేదో 
అసలు నిన్ను నువ్వు
తెలుసుకున్నావో లేదో-
లేక... అమాయకంగా..అర్భకునిలా
భారంగా వయసు మోసుకొంటూ
తిరుగుతున్నావో ఏమో
అడపాదడపా ఆగి తర్కించుకో
ఒకసారి నింపాదిగా ఆగి
నిశితంగా విమర్శించుకో
నీ నడక
మహోదయాల వైపు సాగుతున్నదో
మరణం వైపుగా
చివరి క్షణాల కేసి దూసుకు పోతున్నదో
నిన్ను నువ్వు
తీర్చి దిద్దుకో మనిషిలా ...
ఎందుకు వృధాగా పుట్టి గిట్టే చెదలులా
పాట
--------
ఆనాటి పాట ఒక ప్రభంజనం
అది జనం గుండెల్లో మ్రోగిన ఢమరుకం
ఆ పాట
జన గీతం ..జ్ఞాన సంకేతం
అలనాటి ప్రతి పాట ఒక ఆణిముత్యం
ప్రతి గీతం ...జీవనగీతం
తనని అల్లుకొని అద్భుతమైన సంగీతం
మనం ఏ విధంగా ఆలోచించాలో
ఎంత ఆనందంగా జీవించాలో
సాటి మనిషిని ఎలా ప్రేమించాలో
సమభావం ఎలా సాధించాలో ..
మనిషికి నేర్పిన మౌన పాఠం
మన గుండెల్లోకి దూకిన జలపాతం
ఆ పాట
ఎన్ని హృదయాలను సేద దీర్చిందో
ఎందరిని అక్కున చేర్చుకొని ఓదార్చిందో
ఆమని అందాలు ...
ఎన్ని భువిపైన కుమ్మరించిందో
కాంతి తరంగాలు కొల్లలుగా వెదజల్లిందో
ఎన్ని ఆశల అంతరంగాల బుగ్గ గిల్లిందో
అది ఎన్నటికి వసివాడనిది
ఏనాటికి వన్నె తగ్గనిది
నాలో అల్లిబిల్లిగా
అల్లుకున్న పాటలెన్నో
నన్ను ఆలింగనం చేసుకున్న
సుమధుర గీతాలు ఇంకెన్నో
పాటలాధరాలై
ప్రణయ పరిమళాలై
గంధర్వ గానాలై
మధుర గాదా లహరులై
ఆ పాటవైపే
ఎల్లప్పుడూ నా ప్రయాణం
నన్ను అలరిస్తున్న ఆనాటి పాటకు సాష్టాంగ ప్రణామం
నేను మనిషిని అనేందుకు
ఇదే ఇదే అసలైన ప్రమాణం
నీకు తెలుసో లేదో
నువ్వుండేది ఇక్కడ కొద్ది కాలమే
కడదాకా ఈ ఉర్విపై
నీ ఉనికి అనుమానమే
ఇతరుల జీవితాలలో
అనవసరంగా చొరబడి
నీ విలువైన కాలం వృధా చేసుకోకు
ఉన్నన్నాళ్ళు
హాయిగా జీవించడం మాని
పరుల విషయాలలో జోక్యం చేసుకోకు
ఎవరి బ్రతుకు వారిని బ్రతకనీ
నీ ప్రమేయం ఎందుకు
క్షణ భంగురమైన జీవితానికి
ఇన్ని ఆపసోపాలెందుకు
అనవసర రాద్ధాంతం మెందుకు
నీ బ్రతుకు నువ్వు బ్రతుకు
వృధా చేసుకోకు ఎవరి కొరకు
నిన్న మీరు
పంపిన కావ్యం అందింది
పేజి తిప్పగానే
పరిమళం గుప్పుమంది
ప్రతి అక్షరానికి
సౌరభం అద్దినట్టున్నారు
ప్రతి పాదానికి
పరిమళం పొదిగి నట్టున్నారు
వేయేల ప్రతి కవిత
నానా సూన వితాన
వాసనల కదంబంలా ఉంది
అసలు విషయం చెప్పనా
మీ గుండెలో నాలాంటి వారెందరో
ఒకచోట గుమిగూడి గుసగుస లాడినట్టుంది
ఆ కృష్ణ శాస్త్రిలా
అని పిస్తున్నారు అచ్చం
అందుకోండి ఈ సుమగుచ్చం
నీలో ఒక అమ్మ ఉన్నది
ఆమెకు నా నమోవాకాలు
నీలో ఒక చెల్లి ఉన్నది
ఆమెకు నా ఆశీర్వచనాలు
నీలో ఒక ఆర్తి ఉన్నది
దానికి నా అభినందనలు
నీలో ఒక అగ్ని ఉన్నది
దానికి నా ఆహ్వానాలు
అడగాలని ఉంది
ఈ సహనం ఎన్నాళ్ళు
ఈ దహనం ఎన్నాళ్ళు
నిలదీయాలని ఉంది
ఈ నిర్లిప్తత ఎన్నాళ్ళు
ఈ నిర్వేదం ఎన్నాళ్ళు
బ్రద్దలు కొట్టాలని ఉంది
భస్మం చేయాలని ఉంది
అర్ధం లేని నియమాలు
నిద్దుర లేపాలని ఉంది
సిద్ధం చేయాలని ఉంది
నీకోసం సరికొత్త ఉదయాలు
బ్రతికించు కోవాలని ఉంది
నా అమ్మను నీలో..........
వెలిగించు కోవాలని ఉంది
నీ ఆత్మను నాలో.......
(ముఖపుస్తకంలో, స్నేహ హస్తం అందించిన వందలాది సోదరీమణులకు... అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ......)
ఎగిరి పోతున్న కాలమా
తరిగి పోతున్న ధర్మమా
మనిషిలోని మంచిని కాపాడవేమి.
మధురమైన పాటగా ...పాడవేమి
మానవతను మరలా..
మా నడుమకు తరలించవేమి //
చీకటిలో దాక్కున్నవి సిరిసంపదలు
ఆకలి చేస్తున్నది ఆక్రందన లు
గుక్కపట్టి రోదిస్తున్నవి పూరిగుడిసెలు
ఇంత దయలేని వాళ్ళా ఈ మనుషులు//
పాముల కిరవైనవి చీమల పుట్టలు
పాపం అనకున్నవి దాచిన పొట్టలు
ఎలా తీరాలని ..ఈ ఆకలి శోకం
తలా పిడికెడు ఈ తిలా పాపం//
ఎప్పుడు
ఏ జన్మలో
ఏ పుణ్యం చేసుకున్నానో ..
ఇప్పుడు 
అక్షరం ఒడిలో వున్నాను
ఆమె గుండె గుడిలో వున్నాను ..
నా చుట్టూ ఎందరో
జఠరాగ్నితో కాలి బూడిదౌతుంటే
ఎవరు వెలిగించుకున్న నెగళ్లలో
వారు పిట్టల్లా రాలిపోతుంటే ...
నేను మధుమాసాల లోగిలిలో
నివాస మేర్పరచు కున్నాను
ఆమె మందహాసాల పల్లకిలో
హాయిగా ఊరేగు తున్నాను.
ఉగాది అంటే ఉల్లాసం
ఉగాది అంటే ఉత్సాహం
ఉర్వి పైకి నవవసంతం
నడిచి వస్తున్నదన్న సంకేతం
అనంత కాల గమనంలో
ఈ విశాల విశ్వంలో ప్రతి ఏటా
ప్రకృతి పాడుకొనే ఉజ్వల గీతం
ఈ ఆనందం ఈ అద్భుతం ఎవరికీ!!!
ప్రకృతికి , పచ్చదనం పరచుకున్నలోగిళ్ళకి
కొమ్మకొమ్మకి, కోయిలమ్మకి, కొత్త చిగుళ్ళకి
విరబూసిన వేప చెట్టుకి
విరగకాసిన మామిడి కొమ్మకి
చండ ప్రచండంగా ప్రకాసించే భానుడికి
వస్తున్నామని హెచ్చరించే వడగాలులకి
ఉగాది అంటే ఉల్లాసం ఉత్సాహం
ఉగాది ఆగమించిన వేళ..
జగమంతా ఎల్లెడలా నవనవోన్మేషం
మరి నీకు నాకు ఈ మనిషికి
ఏమున్నది కొత్తదనం...
అసలు మనకు వచ్చిందా నవోదయం
ఇది నిన్నటి ఉదయమే
నిన్నటి హృదయమే
నిరంతరం ఎగిసిపడే
కల్లోల కడలి తరంగమే
నిన్నటి దాహమే
నిశ్చల నిబిడాంధకారమె
నూతనత్వం చేతనత్వం
ఏనాడు కనీ విని ఎరుగని
కూపస్త మండూకం లా
స్వేచ్చా స్వాతంత్ర్యాలు విడనాడి
ఒకే గాడిలో తిరుగాడే గానుగెద్దులా
నిరాశలో నిర్వేదంలో నిస్తేజంలో
ఏమిటి ఈ దుర్భర దుస్సహ జీవితం
ప్రకృతికి లాగే మనిషికి
ఆరు ఋతువులు ఉంటే ఎంత బాగుండును
ఈ వసంత మాసం ఈ కోయిల గీతం
ఈ పచ్చదనం పరవశం
మన జీవితాలలోకి అనునిత్యం
తరలి వస్తే ఎంత బాగుండును
అదేమి చిత్రమో
అవనికి ఆరు ఋతువులు అయితే
ఈనాటి మనిషికి ఒకే ఒక ఋతువు
దాని పేరే ధన ఋతువు
ఎంత వున్నా ఇంకా ఇంకా
కావాలనే ఆకలి ఋతువు
ఇదేమి కర్మమో
ఇతడికి జీవించి నన్నాళ్ళు
ఆనందం సుఖము శాంతి అన్ని కరువు
దాని పర్యాయపదమే అవినితి అక్రమార్జన
దాని పర్యవసానమే మద్యపానం మనోవేదన
జీవిత పర్యంతం ఎంత ఉన్నా ఎంత తిన్నా
ఇంకా కావాలని రోదన
ఆరని తీరని వేదన ఆవేదన
ఈ రుతువులోనే
తెల్లారి పోతుంది మనిషి జీవితం
ఈ క్రతువు తోనే
మసక బారి పోతుంది కల్లోల భారతం
మానవత మటుమాయమై పోతున్న
ఈ సంధి కాలంలో..
ఏ ఉగాది వినిపిస్తుంది
అసలైన జీవన సత్యాన్ని
ఏ ఉగాది విశదీకరిస్తుంది
మానవ జీవన తత్వాన్ని
ఏ ఉగాది కొని తెస్తుంది
ఇలపైకి భూతల స్వర్గాన్ని
అందుకే నేను కోయిలనై
కొమ్మ కొమ్మకు ఎగురుతున్నాను
కొత్త పాటలు కట్టి
మనిషి మనిషికి వినిపిస్తున్నాను
ఈ గాలి విరాళి ఈ నేల ఈ పచ్చదనం
ఈ ఆనందం ఈ గీతం ఈ గానం మీ కోసం
అని దీవిస్తున్నది
అరుదెంచిన ఈ మధుమాసం ..
హాయిగా ఆలకించండి ఈ విజయ దరహాసం
బండెడు కట్టెలు
ఒక మట్టి కుండ
మూడు చిల్లులు
శవం కాలుతున్న వాసన
చెట్టంత మనిషి
తృటిలో అదృశ్యమౌతున్న దృశ్యం
మరుక్షణంలో ఆ పరిసరం లో
ఒక్కరూ కనిపించని నిర్మానుష్యం
ఒక జననం
ఒక మరణం
రెంటి నడుమ
ఆకలి కేకల హాహాకారం
దావానల కీలల బీభత్సం
ఇంతేనా మనిషి జీవితం!
అర్ధం కానిది ఈ జనన మరణ రహస్యం
నేనే ఒక మహా కావ్యం
--------------------------
నేను కవిని
కాని కవిత లల్లను
ఏ కావ్యాలు రాయను
నేను కవినే
జీవితాన్ని కవిత్వంగా రాస్తుంటాను
ప్రతి నిముసాన్ని అందంగా చెక్కుతుంటాను
ప్రతి ఆనందాన్ని కావ్యంగా మలుస్తుంటాను
ప్రతి ఉదయం -నాకు పరవశ గీతం
ప్రతి గీతం- నవరస భరితం
నాకు జీవితమే కవిత్వం
నా జీవనమే అద్భుతమైన గ్రంధం
నిన్న నాకు గతం -ఈ రోజు నిజం
రేపు ఏమో, ఏమౌతుందో తెలియని అయోమయం
అందుకే జీవితాన్ని
సుందర ప్రబంధంగా వ్రాస్తుంటాను
ప్రతి రోజు పేజిని
మధు మాధుర్యంతో నింపుతుంటాను
ప్రతి దినాన్ని పరిమళ భరితంగా
మకరంద మాధురీ సహితంగా రసరమ్యంగా రవళిస్తుంటాను
కవిత్వం రాయక పోతేనేం !
కావ్యాలు వెలువరించక పోతేనేం
నేను కవినే .......
జనరంజకంగా జీవన కావ్యం రాస్తున్నాను గదా
ఎందఱో పాఠకుల హృదయాల్ని
రంజింప జేస్తున్నాను గదా
అనునిత్యం ఎందఱో నన్ను చదువుతుంటారు
నా జీవితాన్ని ఒక గీతంగా పాడుతుంటారు
ప్రతి కవితని ఎదురైన వారికీ
అద్భుతంగా వినిపిస్తుంటారు
ఎంత గొప్ప కవిత్వమో అని
అందరు ప్రశంసిస్తుంటారు
నా దైనందిన జీవనం
గంధర్వ గానమని పరవశిస్తుంటారు
నా జీవితం నిండా
ఆమని నడచి వచ్చిన ఆనవాళ్ళు
దారి పొడవునా
అరవిరిసిన నవ వికసిత కుసుమాలు
నా జీవన కావ్యమంతా
కోమల సుమ దళముల పరిమళాలు
ఎలకోయిల కుహూరవాలు,
చల్లని వెన్నెల విహారాలు
మృదు మందహాసాలు,
నులి వెచ్చని పరిష్వంగాలు
నా జీవన ప్రాంగణంలో
ముళ్లుండవు రాళ్లుండవు
కంటకాలుండవు
కారు చీకటి దారులుండవు
కాలకూట విషాలు విషాదాలు
అసలే ఉండవు
అంతటా పచ్చని మైదానాలే
పంట పొలాలే
హాయి గొలుపు సమీరాలే
హరి విల్లుల ద్వారాలే
సువిశాల ప్రాంగణంలో
సుందర నందన వనాలే
సిరి మల్లెల అల్లరులే,
చిరు నవ్వుల సందడులే
నా జీవన సుక్షేత్రం లో
అలరించే తరువులే సుమదుర ఫలాలే
హరిత భరిత వృక్షాలే కమనీయ రమణీయ దృశ్యాలే
నా రచనలన్నీ అమలిన భావాలే అమృత రావాలే
నా కలం పలికించినవి భావ గీతాలే
మధుర మనోహర మంజుల రాగాలే
చెరిగి పోని శిలాక్షరాలతో
నా జీవన కావ్యం రచిస్తున్నాను
ఒక్కొక్క రోజుని
ఒక్కొక్క గీతంగా రవళిస్తున్నాను
ఎదురైన ప్రతి మనిషి
ఒక చరణం గా లిఖిస్తున్నాను
ఎన్ని వందల గీతాలు రాసానో లెక్కలేదు
ప్రతి సన్నివేశం ప్రతి సందర్భం
ఒక కావ్యం గా
ఎన్ని కావ్యాలు రచించానో గుర్తు లేదు
నేను కవిని
నేను వ్రాసేది జీవితం
నా జీవితమే కవిత్వం
నేనే... ఒక మహా కావ్యం ..
అర్ధరాత్రి ..
ఒక అక్షరం నన్ను తట్టి లేపింది
ఏమైంది అన్నాను
నాకు నిద్ర పట్టడం లేదు
నన్నేం చెయ్య మంటావు 
ఏదైనా ఒక మంచి కథ చెప్పు
ఇప్పుడా !
తప్పదు మరి
ఒక కవిత వినిపిస్తాను
పోనీ ఒక పాట పాడు
ఈ నిసి రాతిరి వేళ నన్నిలా ..
యాగీ పెట్టడం అన్యాయం అన్నాను
ఏం చెయ్యమంటావు
నువ్వే కదా నాకు ఒక రూపం కల్పించి ..లాలించే విరించివి..
సరే..సరే..
తక్షణం
ఒక ఊహని రమ్మని పిలిచి
తనని ఒక కవితగా మలిచి
ముత్యాల ముఖ పుస్తకం
పల్లకి నధిరోహింపజేసి
ఇక లోకంలో ఊరేగమన్నా ను
నన్ను చూచి చిలిపిగా కన్ను గీటి
ఇక తెల్లరేదాకా నిద్రపో అన్నది
ఏమో ...
వేకువనే ఎన్ని గుండెలు తట్టి
ఎందరి హృదయాలలో దూరి
ఎంత మంచి నిదురను కాజేసిందో
ఈ కవితా మహాతల్లి...
ఉదయాన్నే అందరిని అడగాలి...

క్రింగ్ క్రింగ్.....
అర్ధరాత్రి నన్ను తట్టి లేపిన అక్షరాన్ని, ఒక కవితగా మలిచి ,ముఖపుస్తకం పల్లకి ఎక్కించి ,లోకంలోకి వెళ్ళమని టాటా చెప్పానో లేదో.. అది ఏకంగా కానీ ఖర్చు లేకుండా, ఏ passport ,visa, విమానం అవసరం లేకుండా నే అమెరికా వెళ్లి ,అక్కడ న్యూజెర్సీలో, మనుమరాలితో ముచ్చట లాడుతున్న ఒక తాతయ్య ని కితకితలు పెట్టినట్టు ఆ మిత్రుడు ఇప్పుడే ఆనందంగా చెప్పాడు
ఔరా అక్షరమా!
పాదలేపనం తో ప్రవరుడు తృటిలో హిమాలయాలకు వెళ్లినట్టు., కానీ ఖర్చు లేకుండా అమెరికా వెళ్ళావా ..అని ఆశ్చర్య పోతుండగా
క్రింగ్ క్రింగ్.... ఫోన్
ఎవరూ
నేను నీ అక్షరాన్ని
అదేమిటి అమెరికా వెళ్ళావు
అక్కడ ఇండియాలో అందరూ నిద్రపోతుంటారుగా
ఏమి తెలివి తేటలు
అన్నీ తమరి దయ, కరుణా కటాక్షమే కదా కవివర్యా..
అంతగా పొగడకు
ఔను మీ అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉన్నారన్నావు వెళ్ళి పలకరించి వచ్చేదా..
అంత పని చెయ్యకు.. వాళ్ళు వారి కార్యాలయాలలో busy గా వుంటారు
అయితే మిగతా మన తెలుగు మిత్రులను కలుస్తాను
సరే.
sorry..
నిద్రపో మళ్ళీ లేపినట్టున్నాను
ఉదయాన్నే కలుస్తాను
ఫోన్ పెట్టేసింది ..గడుగ్గాయి
-----అర్ధరాత్రి అక్షరానికి.ఆకృతి కల్పించిన వైనం..ముందు post లో చూడండి..
మనిషి....
డబ్బుకోసం
అహర్నిశలు
ఆయాసపడి సంపాదించి
ఆరోగ్యం పోగొట్టుకుంటాడు
అదే ఆరోగ్యంకోసం
ఎంతో శ్రమపడి సంపాదించిన
ఆ డబ్బు పోగొట్టుకుంటాడు
రేపటి మీద తాపత్రయంతొ
ఈ రోజును అనుభవించ లేడు
అలా అని రేపటిని ఎల్లుండిని కూడా..
అతడు మరణించాడని
అనుకోవడమే గాని
నిజంగా బతికిందెప్పుడు
అన్న సందేహం,అందరిలో మిగిలి పోతుంది
---నా కావ్యం ‘’ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ’’’ నుండి....
రామచంద్రుడితడు .రఘువీరుడు'
-------------------------------------------
బాలకృష్ణు డితడు భవదీయుడు
లలిత లలిత భావకవిత
సుతి మెత్తగ రాయగలిగే భావుకుడు //
అవని పైకి అరుదెంచిన ఆమని యితడు
అందరి మదిలో వికసించిన బృందావని యితడు
పదపదమున వినిపించే బృందగానము
ఇట్టె ఆకట్టుకొనే రచనా సంవిధానము //
అనవరతము వినిపించే వేణుగాన మితడు
అరవిరిసిన పువ్వులకు ప్రాణనాథు డితడు
అడుగడుగున మంజుల మృదు మధుర భావము //
ఆ చిన్నారి చిలిపి కృష్ణుని నామధేయ మితడు
అలరించిన అలనాటి కృష్ణ శాస్త్రి యితడు
ప్రణయమై ప్రభవించిన కవితామూర్తి యితడు //
(నిలువెత్తు రాముని ఎదుట నేను ఉన్న చిత్రం చూచాక..ఈ గీతం నేనైతే ఎలా వుంటుందో అన్న భావనతో
నేను చేసిన చిన్న ప్రయత్నం ..)
ఆ శ్రీరామచంద్రునికి భక్తీ ప్రపత్తులతో ప్రణమిల్లు తూ ------
ఒక చిరునవ్వు
చెంతకు రా రమ్మని పిలిచింది
అల్లన వొంగిన నయనం
సుస్వాగతమని హారతులిచ్చిది
అధర బింబాననం
చిరుచుంబనానికి చోటిచ్చింది
మధురాలింగనం
మన బంధం శాశ్వతమని మాటిచ్చింది
సిరి చందనం
కెమ్మోవిని సమ్మోహనం చేసింది
సిగలోని సిరి మల్లె
వల్లెయని తలయూచింది
ఏనాటి అనుబంధమో
ఎన్ని జన్మల సంబంధమో
ఈ మధురాభినివేశం
ఇన్ని వరాలిచ్చి ..
కరుణించిన ఆమె కోసం
మనసు మందిరమై వెలిసింది
మొగ్గ
పువ్వుగా మారుతున్న
దృశ్యం చూస్తున్నాను
సుమ దళాలలోకి
పరిమళాలు 
బిరబిరా చొరబడిన
సవ్వడి వింటున్నాను
సంరంభంతో
ఆ సౌరభాలను మోసుకెళ్తున్న
చిరుగాలి కెరటాల
కేరింతలు గమనిస్తున్నాను
వనమంతా వసంత శోభ
సంతరించు కొంటున్న ఆనందం
పువ్వు పువ్వులో
యవ్వనం చిందు లేస్తున్న
లాస్యం తిలకిస్తున్నాను
ఔను
నాకు ఆశ్చర్యం
ఆ పువ్వుల పరిమళం
నీ నవ్వుకి ఎలా వచ్చింది
ఆ మల్లియ తెల్లదనం
నీ పెదవి పైకి ఎప్పుడు చేరింది
ఆ మకరంద మాధుర్యం
అచ్చట ఎవ్వరు దాచింది
ఇన్ని
సోయగాలు
సరాగాలు
సౌభాగ్యాలు
ఏ పువ్వు నోచింది!

30, జనవరి 2018, మంగళవారం

అందరూ
దీపాలు వెలిగించుకొనే వేళ
నేను
నీ రూపాన్ని వెలిగించుకుంటాను
అందరూ
మనుష రూపాలు ధరించి
స్వార్ధం మోసం దుర్మార్గం
తదితర మార్గాల వైపు
తరలి పోయే వేళ
నేనొక్కడినే
ఏటి కెదురీదే వానిలా
నీ దివ్య సౌందర్యం వైపు
నడక సాగిస్తాను
అందరికీ నేను
వెఱ్ఱివాడిలా కనిపించినా
ఎర్రని పెదవి వైపుగా నా నడక
ఓ దివ్యపథం చేరుకొనాలని
అద్భుత నిధిని చేకొనాలని
నాడు పేరెన్నిక గన్న కళాశాల,
కావలి జవహర్ భారతి
సాటిలేని మేటి అధ్యాపకుల
ధీనిధితో నిర్మించిన వారధి
వారి సన్నిధిలో ఎన్ని ప్రహసనాలో 
ఎన్ని సన్నివేశాలో ..
నాలోని కళాభినివేశానికి అక్కడే అందుకున్నా వెన్నెల హారతి
కావలి కళాశాలలో విద్యాభ్యాసం నా అదృష్టం . నేను అక్కడ చేరిన సంవత్సరమే కళాశాల పేరు జవహర్ భారతి గా మారింది .
ఆ నిలువెత్తు భవనం- టి ఆర్ ఆర్ బిల్డింగ్స్ లో 4 ఏళ్ళు అభ్యాసం ఒక అద్భుతం -
ఎదురుగా ‘రుతురంగ్’ బొటనికల్ గార్డెన్, పక్కనే టాంపో లైబ్రరీ -అక్కడే చలం శరత్ ఇలా ఎందఱో కవుల పరిచయం, ఎన్నెన్నో సదస్సుల ప్రాంగణం ఎం ఎం హాల్ ఇంకా దక్షిణాన విశ్వోదయ కళా ప్రాంగణం ఎన్నిమధురమైన జ్ఞాపకాలో ...
జవహర్ భారతిలో నన్ను నేను మనిషిగా కవిగా తీర్చి దిద్దుకున్న విధానం ..ఒక అపురూప జ్ఞాపకం . కళాశాల స్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఆ విద్యాలయాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్డారో
అక్కడి ఆనాటి అధ్యాపకులు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు భుజంగరాయ శర్మ గారు ,D R ,GGK, NSR మాణిక్యాల రావు, మాధవరావు, రామచంద్రారెడ్డి గారు ... ఇలా ఇంకా ఎందఱో
ఎందుకో ఈ గతాన్ని ,అద్భుతాన్ని ప్రాంగణాన్ని పరిసరాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపించింది
ఔను నేను మారి పోతున్నాను--------
రోజులు వారాలుగా ..
వారాలు నెలలుగా ...
నెలలు సంవత్సరాలుగా మారిపోతుంటే ....
నేను మాత్రం ఎందుకు మారిపోకూడదు..
నాలో ఒక ఆలోచన ..నాలో ఒక సంచలనం
ఔను నేను మారి పోతున్నాను ..........
నా తల్లి దండ్రుల్ని భార్యాబిడ్డల్ని స్నేహితులని ఇరుగు పొరుగుని అందరిని ప్రేమించడం మొదలు పెట్టాను ఆ తర్వాతనే నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను తద్వారా ..హాయిగా జీవించడం అలవాటు చేసుకున్నాను
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది నేనేమి ఈ మొత్తం విశ్వాన్ని మోసే వ్యక్తిని గానని ఆ అవసరం ఆ శక్తి నాకు లేదని అంతేకాదు అసలు ఈ ప్రపంచం భారం మొత్తం నా బుజాల మీద లేదుకదా
ఔను నేను మారి పోతున్నాను
కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళుతో బేరం ఆడడం వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం ఆగి చేయి చాచడం మానేసాను ..బహుశా నేను వదిలిన ఆ చిల్లర మొత్తం నాజేబుకు చిల్లి పెట్టదు సరికదా అ పేదవానికి తన చిన్ని పాపాయికి పాఠశాల పైకం కట్టడానికి కొంత ఉపయోగపడవచ్చు నేమో
ఔను నేను మారి పోతున్నాను
ఆటో కాబ్ లాంటి వాళ్ళకి నోటు ఇచ్చి మిగిలిన చిల్లరకోసం వేచి ఉండకుండా తిరిగి చూడకుండా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను ..నేను వదిలిన ఆ చిల్లర పైకం అతని వదనంలో ఒక చిరునవ్వును వెలిగించ వచ్చు నిజానికి అతడు నాకంటే ఎక్కువ జీవనపోరాటం సాగిస్తున్నాడు కదా
ఔను నేను మారి పోతున్నాను
పదేపదే మనకి ఏదో చెప్పాలని తహతహలాడే పెద్దవాళ్ళని వారించడం వారితో విబేదింఛి వాదించి గాయపరచడం తప్పు అని తెలుసుకున్నాను నిజానికి అలా తమ అనుభవసారం అందరికి పంచడం వలన వాళ్లకి ఎంత ఆనందం సంతోషం కలుగుతుందో.కదా . అంతేకాదు వారి గత జీవిత భారాన్ని కొంతైనా తగ్గిస్తుంది కూడా
ఔను నేను మారి పోతున్నాను
అందరికి నీతులు బోధించడం జీవన విధానం ఇలా ఉండాలని విడమరచి చెప్పడం తప్పు అని తెలుసుకొని చెప్పడం మానేసాను .. వాళ్ల తప్పు వారికి తెలియకనా.. అందరిని అతి పవిత్రులుగా మానవతా మూర్తులుగా మార్చడం నా ఒక్కరి పనేమి కాదు కదా ..అంతేకాదు నాకు సైతం శాంతి విశ్రాంతి ప్రశాంతత కావాలికదా
ఔను నేను మారి పోతున్నాను
ఎదురైన అందరిని పనిగట్టుకొని హాయిగా పలకరిం చడం ఉదారంగా అభినందించడం అలవాటు చేసుకున్నాను అది వాళ్ళకి ఉత్తేజం కలిగించడం మాత్రమే కాదు నాకు కూడా కూడా కొంత ఉల్లాసం కలిగించి నన్ను ఉత్సాహవంతునిగా చేస్తుంది
ఔను నేను మారి పోతున్నాను
నా చొక్కా మీద పడిన బురద మరక గురించి లేదా ఆ మచ్చ గురించి నేను అసలు లెక్కచేయను నా వ్యక్తిత్వం శీలం ఒక్కటే నా ఔన్నత్యాన్ని నిర్దేశిస్తుందని నాకు గట్టి నమ్మకం ...
ఔను నేను మారి పోతున్నాను
నన్ను నన్నుగా చూడని వాళ్లకి నాకు విలువ ఇవ్వని వాళ్ళ కి దూరంగా వుంటాను.. బహుశా వాళ్ళకి నా విలువ తెలియకపోవచ్చు నన్ను గురించి విని ఉండక పోవచ్చు కాని నన్ను గురించి నాకు తెలుసుకదా
ఔను నేను మారి పోతున్నాను
నన్ను కించ పరచాలని నామీద క్రూరమైన జోకులు విసిరే వాళ్ళ గురించి అసలు పట్టించుకోను ..నన్ను అలా ఇబ్బంది పెట్టె వాళ్ళ గురించి ఒక క్షణమైనా ఆలోచించను నాకు వేరే వ్యాపకం జీవితం వున్నది కదా
ఔను నేను మారి పోతున్నాను
నేను ఎటువంటి నా ఆవేశకావేషాలకు ఎగిరిపడ కూడదని నిర్ణయించు కున్నాను.. నిజానికి నా ఆలోచనలు నా అభినివేశాలే కదా నన్ను మనిషిగా తీర్చి దిద్దుతాయి
ఔను నేను మారి పోతున్నాను
నేనే అందరి కంటే గొప్ప మేధావిని అనే అభిప్రాయాన్ని తుడిచి వేసాను నిజానికి అది స్నేహ బంధాల్ని నాశనం చేస్తుంది ,..నన్ను వారికీ దూరం చేస్తుంది బంధాలు అనుబంధాలు దూరమై ఒంటరిగా నేను ఉండలేను కదా
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఏది అవసరమో న్యాయబద్ధంగా ఏది కావాలో ఏది రావాలో దానిని నేను సొంతం చేసుకొని తీరతాను అన్యాయాన్ని ఒప్పుకోవడంకూడా అన్యాయం చెయ్యడమే మరి
ఔను నేను మారి పోతున్నాను
ప్రతి రోజు ఇదే ఆఖరి రోజు అని అనుకోవడం అలవాటు చేసుకున్నాను ఏమో, ఈ రోజే చివరి రోజు కావచ్చు కదా
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఏది సంతోషమో ఏది ఆనందదాయకమో అదే చేయడం అలవాటు చేసుకున్నాను నా సంతోషానికి నా అనందానికి నేనే కారకుణ్ని మరి ..దానిని నాకు నేను అందించవలసిన అగత్యం అవవసరం నాదే కదా
ఔను నేను మారి పోయాను
//జనవరి 9 న నేను అనువదించి నా మిత్రులకు వాట్స్ అప్ లో పం పి న ఈ మంచి మాటలు దాదాపు అలాగే ఈ ఆదివారం ''సాక్షి''లో రావడం విశేషం //