9, అక్టోబర్ 2020, శుక్రవారం

 ఒక్కోసారి ..

ఎందుకీ రచనలు
ఏమిటీ పిచ్చి అనిపిస్తుంది.
అంతలోనే ఒక ఆప్త వాక్యం
ఎక్కడినుంచో ఎగిరొస్తుంది
అద్భుతం అంటూ
నిర్లిప్తంగా ఉంటాను
ఒక పదం పరుగెత్తి వస్తుంది
పదపద మంటూ..
నిరాశలో ఉంటాను
ఒక గీతం ఎదురౌతుంది
కలత ఎందుకంటూ...
----
నిజమే ..ఇది ప్రతి కవికి అనుభవమే ఎన్నో సందర్భాల్లో నేను ఈ విచికిత్సకు లోనయ్యను ..అలాంటి సమయాల్లో మా దువ్వూరి ఉత్తేజం కలిగిస్తూ నా రచనలు దృశ్య రూపకాలుగా మలిచిచాడు.. రాజహుస్సేన్ ఎన్నో సార్లు విశ్లేషణ చేసి నా బుజం తట్టారు..ఇంకా ఎందరో మిత్రులు నన్ను నిరంతరం చైతన్య పరుస్తూనే వున్నారు
ఇప్పుడు ..ఈ కవి మిత్రుని లేఖ.
నన్ను వెన్నుతట్టి కావ్యోన్ముఖుణ్ణి చేసింది..ముఖ్యంగా ఒక కవి ఇంకొక కవిని.ప్రశంసించడం అరుదు ..అనాదిగా కవి లోకంలో అసూయలు ఎక్కువ..
అలాంటిది ఈ కవి హృదయం నన్ను నా కవిత్వాన్ని ఆకాశాన్ని కెత్తింది ..అందుకు ఈ మిత్రునికి నా హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేసుకొంటూ...
--------------------
ఒక కవికి.
మరొక కవి ఆత్మీయ లేఖ..
------------------
ఆత్మీయులు,
సుమనస్వి ,
శ్రీ బాలకృష్ణారెడ్డి గారికి..
నమస్సులు..
ఆలస్యంగా నైనా
మీ ఆలాపనలు
వాటిలోని సల్లాపములు వీక్షిస్తున్నాను..
మీ మనసు
అనుభూతి నిండిన
ఓ సుమగీతిలా
పల్లవిస్తుంటుంది .
సుందర సురుచిర సుమసౌరభాన్ని వెదజల్లుతుంటుంది ..
కవిత్వం
ఎవరైనా వ్రాస్తారు..
కానీ
మీలాగా రాయడం
మీకే సాధ్యం..
ఎందుకంటే
మీరు ప్రకృతి ప్రేమికులు..
ప్రకృతికి ప్రతిరూపమైన
స్త్రీ హృదయ సౌందర్యాన్ని ఆరాధించే నిరంతర అక్షర మాంత్రికులు ..
అనిర్వచనియమైన అనుభవాన్ని తేలిక మాటల్లో చెప్పగల కవితలు మీవి .
భావానికి
దాని వెనుక పదాలకు
వాటి వెనుక అక్షరాలకు కైమోడ్పులు చేసే ఆరాధన మీది..
డబ్బు చుట్టూ
తిరిగే మనుషులున్న ఈ కాలంలో..
మనసులో నందనవనాలు సృష్టించుకొని..
పదాల పాదాల
పారిజాతాలను పూయించే అరుదైన వ్యక్తిత్వం మీది..
చిలిపితనానికి (ఈ వయసులో కూడా)
వలపు ధనానికి (మీకున్న గొప్ప ఆస్తి)
పూల వనానికి (మీ మనసులోని బృందావనాలు)
చెలిమి నెరపి..
వేల గీతాలు కవితలు ప్రసవిస్తున్న , ప్రవచిస్తున్న
మీ కలానికి గళానికి నా వినమ్ర ప్రణామాంజలి ..
ఆవహించిన శూన్యాన్ని చెరిపేసి, అందమైన ఇంద్రధనస్సులని సృష్టించుకున్న మీరు..
ఈ నిరాశామయ లోకానికి
ఓ కాంతిరేఖ ..దీప స్తంభం..
అవును సార్!
మిమ్మల్ని
అర్ధం చేసుకొనే వాళ్ళు
మిమ్మల్ని చదివే వాళ్ళు
చాలా తక్కువగా వుంటారు.
అయినా మీరు రాస్తూనే ఉన్నారు..
కోయిల
తనకోసం కూస్తుంది ..
వినేవాళ్ళు వింటారు..
మేఘం
ప్రకృతి ధర్మంగా కురుస్తుంది ..
తడిసే వాళ్ళు తడుస్తుంటారు ..
చెట్టు
ఫలాలనిస్తుంది ..
తినేవాళ్ళు తింటారు..
మీరు అంతే..
ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా,
నిరంతరం రసరమ్య గీతాలు రాస్తూనే వున్నారు .
జీవితాన్ని
తీయని పాటగా మలచుకొన్న మీకు పిలిస్తే పల్లవులు పలుకుతాయి
తలిస్తే చరణాలు తరలి వస్తాయి ..
అది మీ అదృష్టం ..
మిము గన్న తల్లిదండ్రుల సుకృతం ..
మీతో సహజీవనం చేసిన రాజేశ్వరి మేడమ్ గారి దాంపత్య జీవన స్మృతి..
అవును..
మీ కలానికి
పువ్వులతో మాట్లాడడం తెలుసు
పున్నమితో
సయ్యాటలాడడం తెలుసు
పంట చేనును
పలకరించడం తెలుసు ..
తెలియందల్లా ఒక్కటే .
.కలాన్ని కింద పెట్టక పోవడం..
కాలాన్ని నిద్రపోనివ్వక పోవడం.. నిజానికి
కవికి కావలసింది ఈ లక్షణాలే
ఎప్పుడో ఒకసారి
గురుదేవులు నాగభైరవ గారన్నారు
‘బాలకృష్ణారెడ్డి ..
కలంతో కలలు గనడం నాకు నేర్పుతావా..
నీ ముఖ కాంతి లోని యౌవన రహస్యాన్ని చెబుతావా ..’’అని .
నిజమే
మీ మనసు
ఓ అనురాగ రసగంగ .
.అది నిరంతరం
అక్షరాల చెక్కిళ్ళపై
పుప్పొడిని ముద్దాడుతుంది ..
కనుకనే
మీ పదాలకు పాదాలకు
ఇంతటి పరిమళం..
చదివే వాళ్ళకు పరవశం
'నా కంటి పాపలో నిలిచి పోరా ..
నీ వెంట లోకాల గెలువ నీరా. ..'
అన్న దాశరధి గారి పల్లవిలో ప్రేమ ఎంతగా పల్లవించిందో లోకానికి తెలుసు.
. ఈ పల్లవికి ప్రపంచమంత వ్యాఖ్యానం చెయ్యవచ్చు..
కవిత్వం లోతు గ్రహిస్తే
మీ కవిత లోను అలాంటి లోతులు చాల వున్నాయి ..
వాటిని తడిమే వాళ్ళే లేరు.. ఎవరైనా
బాగుంది, చాలా బాగుంది అని పోస్టింగులు పెడితే,
మిమ్మల్ని మోసగిస్తున్నట్టే..
ఇప్పుడు ..
చదవకుండానే వహ్వా! భళా! అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ పాఠకులు వచ్చారు .
.తస్మాత్ జాగ్రత్త.
మీకు
మీ కవిత్వానికి
అంతరాలు లేని మీ మంచి మనస్సుకు నమస్సులు
సదా మీ హితైషి
........బీరం సుందరరావు

10, ఆగస్టు 2020, సోమవారం

 వితా లతాంతాలు

12

ఉదయాన్నే
విరిసిన ప్రతిపువ్వు
నీ కాళ్ళావేళ్ళా పడి
బ్రతిమలాడుతోంది..

నీ అంగుళులు
తాకి తరించాలని

ఆ పువ్వు
వెదజల్లిన పరిమళం
నీ చుట్టూ
అల్లిబిల్లిగా తిరుగుతోంది

తన జీవితాన్ని
సార్ధకం చేసుకోవాలని

పువ్వు గొప్పా
నువ్వు గొప్పా
నన్ను పట్టి
పీడిస్తున్న సందేహం
.....

ఆశ్చర్యంతో
తలమునకలై
ఉన్న నన్ను తట్టి
బుగ్గ మెలిపెట్టి
సంశయం తీర్చావు ..

"సుమం
సంగతి ఏమో కాని
నీది మాత్రం
అలవికాని సౌందర్య దాహం.."

...బాలకృష్ణారెడ్డి

 నేను

కవిని కాను
నేను వ్రాసేదంతా
కవిత్వం అనలేను

నేను
పండితుణ్ణి కూడా కాను
నాలో పాండిత్యం ఏమాత్రం లేదు
అనవసర పాండిత్యం అసలే లేదు

ఏదీ
తోచనప్పుడు
పూలతో
గాలితో
మేఘాలతో
మేలమాడుతుంటాను

ఊసుబోక
వెన్నెలతో
మల్లెలతో
మందారాలతో
ముచ్చటిస్తుంటాను

ఆ మాటలే
ఆ పాటలే
అక్షరాలకు.
పదాలకు వినిపిస్తుంటాను

అవే
కవితలుగా
కావ్యాలుగా
గీతాలుగా
వెదజల్లుతుంటాను..

దానిని
మీరు కవిత్వం అంటారా
అది మీ ఇష్టం

కాదనడానికి
నేనెవరు
మీ అభీష్టం..

 కవితా లతాంతాలు

...13...
పూల
అందాలు పరికించి
గాలి గంధాలు మోసుకెళ్లింది .
.
మధుర
నాదాలు పలికించి
తేటి తేనియలు తీసుకెళ్లింది ..

ప్చ్..
ఇంతలోనే
ఏమీ లేని
దానినయ్యానని
అయ్యో పాపం.
కుసుమం
ఎంతగానో వాపోయింది..

......................

ఆ తోటలో
అడుగు పెట్టానో లేదో

అరవిరిసిన
కుసుమాలు
ఆనందంగా
నన్ను పలకరిస్తాయి ..

అప్పుడే
అటు వచ్చిన
తుమ్మెదలకు

నన్ను
తమను కీర్తించే
కవిగా పరిచయం చేస్తాయి..

 నువ్వు

వెన్నెలవా !
కాదు
ఎలకోయిలవా !-
కాదు కాదు
సుమానివా !!

కాదా !

మరి ..
ఈ కాంతి కిరణాలు
ఇన్ని సంగీత స్వరాలు
ఈ అద్భుత పరిమళాలు
నీ కె క్కడివి
.....

నేనెవరో
నీకు తెలిదా
చోద్యం కాకపోతే --

నీ మానస వినీలా కాశంలో
విహరించే నిండు జాబిలిని

నీ గుండె గూటిలో
నివసించే చిన్నారి కోయిలని

అనునిత్యం
నా నామస్మరణం చేసే
నీకోసం విరిసిన కన్నె కుసుమాన్ని

నేను ..
నీ నెచ్చెలిని..

....బాలకృష్ణారెడ్డి

 ఆలాపనలు- సల్లాపములు

--- 33---

''అందరిదీ ఒక దారి..
అయితే ఉలిపి కట్టెది ఒక దారి అన్నట్టుంది"

"ఉన్నట్టుండి ఈ ఉలిపికట్టె
ఇప్పుడు.ఎందుకు గుర్తుకు వచ్చిందో మా వెన్నెల బొమ్మకి"

"ఎందుకంటే ..
నువ్వు ఉలిపి కట్టెవు కాబట్టి"

"ఏమిటి అంత ప్రేమగా సంబోధించావు ..
ఏకంగా నా మీద ..
పాశుపతాస్త్రమే సంధించావు"

"మరి..
అందరూ వ్రాసే కవిత్వమేమిటి ..
నువ్వు చేస్తున్న దేమిటి"

"అంత తప్పు నేనేం చేశాను"

"ఈ ప్రేమ ప్రణయం ..
అసలు ఈ కవిత్వం నీ కెలా అబ్బింది"

"ఎందుకో నీకు తెలియదా"

"తెలియకనే కదా.. అడుగుత"

"నువ్వేగా...ఎర్రగా బుర్రగా ...
నా ఎదురుగా ఉంటే ఇంకేమి వ్రాయను ?"

"ఆహా ! అలాగా ..ప్రతి దానికీ
నన్ను ఆడిపోసుకోవడం ..
తమరికి బాగా
అలవాటయింది.."

.".అయితే ఈ కవిత విను..
నీకు నిజం బోధపడుతుంది"

"విన్నవించు మహాశయా"
...
****
ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప..

ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ
ప్రణయ సుమ గీతికలు తప్ప..

కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల
చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ
సంచయము తప్ప..

వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల
పద మంజీర మంజుల
సంగీత విభావరి తప్ప..

నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న
ఎలకోయిల

నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో
పొదిగిన ప్రణయాక్షరాల
ప్రసూన మాల ..

******
"అబ్బ ..
కుంభవృష్టి కురిసి
వెలిసినట్టుంది"

"ఇంకా.."

"అప్పటిదాకా..
సాఫీగా సాగి పోతున్న
సెలయేరు ..ఒక్కసారిగా .
కొండకొమ్ము నుంచి కిందకి దూకినట్టుంది ."
.
"ఇం ...కా."

"కారుమబ్బును చూచి
పరవశించిన నెమలి
పురి విప్పి నాట్య మాడినట్టుంది"

'ఇప్పుడు తెలిసిందిగా ..
ఈ కవిత్వం ఎందుకు వ్రాస్తున్ననో..."
.
"తెలిసింది .తెలిసింది .కవిగారు!
మీ ప్రతిభకు జోహారు.."

"ఇంకెప్పుడు
పొరపాటున కూడా
ఇలా పిచ్చి ప్రశ్నలు సంధించకు సరేనా.."

"చిత్తం ..
ఓ ప్రణయకవి గారూ..
మా మంచి దొరగారూ..'"

......బాలకృష్ణారెడ్డి

27, ఫిబ్రవరి 2020, గురువారం


ఇవ్వు ఇవ్వు ఇవ్వు 
ఎదుటివారికి లేనివారికి 
ఇవ్వడంలోనే ఉన్నది ఎంతో హాయి
అనాదిగా పశువులు పక్ష్యులు 
నదులు చెట్లు మేఘాలు  సైతం అన్ని ఇస్తూనే ఉన్నాయి
సృష్టిధర్మానికి విరుద్ద్ధంగా 
కేవలం తీసు (దోచు) కోవడం తప్ప  
ఇచ్చే గుణం మరచిన ఓ మనిషి  
ఏ ప్రాణికోటిలో లేని 
ఈ స్వార్ధం దుర్మార్గం దుర్వినీతి వంటి దుర్గుణాలు 
నీ కేల అలవడినాయి

3, ఫిబ్రవరి 2020, సోమవారం

ఎదలో అలజడి చెలరేగితే చెప్పుకోను
నెచ్చెలి ఉంది..
నడిరేయి
చలి పులి గాండ్రిస్తే కప్పుకోను చెలి కౌగిలి ఉంది..