29, జూన్ 2018, శుక్రవారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది
నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన గళమెత్తి గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది
ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది
లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది
ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన
అధర ప్రాంగణ మొకటి నన్ను కరుణిస్తూనే ఉంటుంది
నిన్ను చూచి ఆకాశం.
తన నుదుట తిలకం దిద్దుకున్నది
నిన్ను మెచ్చి మధుమాసం
తన నడకను నీ దిశగా మార్చుకున్నది
నిండు పున్నమి దరహాసం
నీ ఆధరాన చేరి
ఆనంద తాండవం చేస్తున్నది
గాలికి ఎగిరిన
నీ కురులను చూచి
నీలి నింగి వంగి వంగి
వందనాలు చెబుతున్నది
నీ సౌందర్యదీప్తిని గని
మల్లె ముందారం సన్నజాజి
మూతి ముడుచుకుంది
ఇన్నిన్ని వన్నెల చిన్నెల
సోయగాల చెలువములు తిలకించి
ప్రకృతి నీకు ప్రణామం చేస్తున్నది
ఒక వాన పాట..
----//------
ఒక చినుకు
పలికింది ఓంకారం
ఒక చినుకు
అలదింది సిందూరం
ఒక చినుకు
చుట్టింది శ్రీకారం
ఒక చినుకు
మీటింది సింగారం //
పెదవిపైన
పడిన వాన గానమాయెను
అది గుండెపైన
జారగనే జాతరాయెను
నడుము పైన
పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన
మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి
తనువంతా బృంద గానమై
కనుల ముందు
బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి
తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి
పరుగిడగా వనము నవ్వెను
తనువంతా
తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి
మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే
గాలివాన ఆగిపోయెను
ఆదమరచి
మనసు వీణ మూగవోయెను //
తెలుగుకు
వందనం
తెలుగు
భాషామతల్లికి
అభివందనం
తెలుగు సుమములు
విరబూసిన ఈ నేల
పూల మందిరం
తెలుగు తేజం
వెల్లివిరిసిన
ప్రతి హృదయం
నవనందనం
తెలుగుకు వందనం..
తెలుగు జాతికి వందనం..
తెలుగు మహస్సుకు వందనం
తెలుగు వచస్సుకు వందనం
తెలుగు యశస్సుకు వందనం
ఎన్ని చిలిపిదనాలో
ఆ నవ్వులలో ఉన్నాయి
ఎన్ని పూలవనాలో
ఆ పెదవులపై ఉన్నాయి
ఎన్ని మౌనగీతాలో ఎన్నిపారిజాతాలో
ఎన్ని మూగరాగాలో అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి
నడకలు బరువైనాయి
మల్లెలు మరులైనాయి
మాటలు కరువైనాయి
అగరు పొగలు అత్తరులు వందిమాగధులైనాయి
అన్ని -వంగి వంగి వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి ,
మంగళ వాద్యాలున్నాయి
ఊపిరిలో మందార మకరంద
పోతన పద్యాలున్నాయి
ఒంగిన ఆ కనుదోయి ఆ ఓరచూపు లెవరికోసమోయి
అది అరవిరిసిన మరుమల్లెల మందహాసమేనోయి //
ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప !!?
కొన్ని కుసుమాలు కొన్ని భ్రమరాలు
ఇంకొన్ని వెన్నెల కిరణాలు మలయపవనాలు
ఒక రోజు నా లోగిలిలోకి బిరబిర నడిచి వచ్చ్చాయి
ప్రణయ కవిని కలుసుకోవాలని నాతో అన్నాయి
లోనికి రారమ్మని సాదరంగా ఆహ్వానించాను
మీరు వెదికే ఆ కవిని నేనే నన్నాను
ఆశ్చర్యంగా అవి నాకు అంజలి ఘటించాయి ఎంతో ఋణపడి ఉన్నామన్నాయి
ఎవరు పట్టించుకోని తమని అనునిత్యం పలకరించడం, కావ్యగానం చెయ్యడం
అరుదన్నాయి,, అపురూపమన్నాయి
సుమదళాల పరిమళాలు నాపై చల్లి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాయి
ఇలా నన్ను నేను మరిచిపోతుంటే -
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప
అర్ధం చేసుకొరూ !!!!!!!!!
నాదేమో గుప్పెడు గుండె ....నిండి పోయింది తాను 
ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎదలో వూపిరాడనీయకుండా 
ఇంక ఎలా మిన్నకుండగలను ఏమి రాయకుండా 
పోనీ తనను పంపిద్దామంటే ఆమే కదా నాకు అండదండ 
మీతో ఈ విషయం అంటున్నానని, నా బాధ చెప్పుకున్నానని 
తలనిండా పూలు ధరించడమే కాకుండా, పట్టుకొచ్చింది ఒక పూలదండ 
పూలదండతో పాటు రెండు బాహువులు సాచి అల్లుకున్నది మెడనిండా 
ఇంకెలా మనగలను జీవించగలను ఒక నిముసమైనా ఆమె లేకుండా -------
‘చెప్పాలని ఉంది 
దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కధ 
మట్టిని మణిగా చేసిన మరపురాని దేవత కధ ‘’
మీరే చెప్పండి ఎలా మిన్నకుండ గలను ఇలా రాయకుండా, హాయిగా పాడకుండా 
ఇన్ని ‘డాం ‘ లతో -డాండ డడాండ డాండవం - చేసిన నన్ను ఏం చేయాలని అనుకొంటున్నారా 
అమ్మయ్య గండం గడిచిందని హాయిగా వూపిరి పీల్చుకొంటున్నారా 
అంత సులభం కాదు మిత్రమా! రాస్తూనే ఉంటాను వూపిరాడ నీయకుండా 
మీరు మాత్రం దూరంగా నెట్టేయకండి దీనిని చదవకుండా 
అర్ధం చేసుకోరూ .......................
ఇప్పుడు ఒక చెట్టు
ఈ నేలపైన నాటుతున్నావంటే
రేపు నువ్వు దానికింద
సేద దీర్చుకుంటావని కాదు
అప్పటిదాకా చిరంజీవిలా
జీవించి ఉంటావని కాదు
అది ఎందరికో నీడ నివ్వాలని
నీ జీవితము అంతే
నువ్వు అవనిపై మొలకెత్తావంటే
నీ ఆనందం కోసమే కాదు
నీ ముద్దుముచ్చట మురిపాలు
తీర్చుకోవడం కోసమే కాదు
మహోన్నత వటవృక్ష మై
నలుగురికి ఆదర్శంగా నిలుస్తావని
నీ నీడలో ఎందరికో ఆశ్రయ మిస్తావని
ఈ జగతికి మార్గదర్శివి ఔతావని
ఔనన్నా కాదన్నా ఇది జీవిత సత్యం
అందుకు ప్రత్యక్షసాక్ష్యం ఆ వటవృక్షం
పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు
ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు
ఆర్ద్రత ఇగిరి పోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని
నీలాకాశం లో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు
అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు
ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు
ఈ నేను నేను కాదు
ఈ మేను నాది కాదు
ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఏమో
ఎవరో ఒకరు ఇందులోకి వచ్చి వెళుతుంటారు
ఉన్నన్నాళ్ళు అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంటారు
ఈ రూపం నాది కాదు
ఈ పాపం నాది కాదు
ఇది పూర్వ జన్మ కర్మ పరిపాకం
మళ్ళి మనిషిగా పుట్టి అతడు చేసుకున్న నిర్వాకం
ఈ సిరులు నావి కావి
ఈ సంపద నాది కాదు
ఇవి మిన్నాగులు నివసించే సంపెంగ పొదలు
నన్ను నాలోంచి విసిరేసిన కన్నీటి కధలు
నేనిక్కడ కొన్నాళ్ళు న్నానన్నది నిజం
జననం మరణం ప్రతి ప్రాణికి సహజాతి సహజం //
41
నా కలమే నాకు నేస్తం
సమ్మోహనాస్త్రం - సకల శాస్త్రం ,,కాలమే నాకు సమస్తం
42ఎంత హాయిగా ఉంది ఈ విశ్రాంత జీవనం ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రశాంత భావనం
ప్రతి క్షణం ఆలోచనలకి అక్షరాకృతి కల్పిస్తూ ఈ స్వీయ కావ్య రచన ఎంత సమ్మోహనం
43
పొలాలు స్థలాల మిద అజాగళ స్థనాల మిద పిచ్చి లేదు
సంపదల మీద ఆసక్తి లేదు కారణం అవి సృష్టించే విలయాన్ని భరించే శక్తి లేదు.
44
ఆగ్రహం ఆవేశం అక్షరీక రిస్తున్నప్పుడు నేనొక అగ్ని గీతాన్ని
అందరి ఆనందం కోసం ఒక ప్రేమ కావ్యం రాస్తున్నప్పుడు నేను సాహిత్యాన్ని సంగీతాన్ని
45
ఎప్పుడు చిరు నవ్వులు ఎదురైతే ఎంత బావుంటుంది
మనసు అప్పుడే కదా విరిసిన మరుమల్లె తోటలా ఉంటుంది
46
ఎదిరించాను ఒకనాడు ఎదురైన మృత్యువును
సృష్టించు కోలేదు ఏనాడు ఒకరైనా శత్రువును , కనుకనే నేను అజాత శత్రువును
47
నేనిప్పుడు స్వేచ్చా విహంగాన్ని
ఏ అటు పోటులు లేని కడలి తరంగాన్ని
వేల వేల కుసుమదళాల పరిమళాలు దాచుకున్న అంతరంగాన్ని
48
ఒక పున్నమి నన్ను వరించింది
చిరునవ్వుతొ పలకరించింది
చల్లని వెన్నెల నాపై చల్లి పరసించింది
49
ఎక్కడికి నేను వెళ్ళను , నా మనసే వనాల వెంట తిరిగి వస్తుంది
ఎన్నో పరిమళాలు మోసుకొస్తుంది, అన్నిటిని నా మ్రోల కుమ్మరిస్తుంది
అంతే - నాలోంచి మందార మకరంద మాధురీ సమ్మిళితమైన ఓ కవిత కదిలి వస్తుంది
50
ఎందుకో అప్పుడప్పుడు మనిషిని చూడాలని ఉంటుంది
అందరిలో 'పుప్పొడి రాలిన చప్పుడు' వినాలని ఆశగా ఉంటుంది
నాదంతా పిచ్చి వెర్రి దురాశ అత్యాస గాక పొతే మరేమిటి
యంత్రమై తిరుగాడే వాడిలో మనిషితనం ఎలా ఉంటుంది
ఏటి ఒడ్డున నడిచి వెళ్తుంటే -ఒక కెరటం కదిలొచ్చి
తన గురించి ఒక కవిత రాయమని కాళ్ళ వేళ్ళా పడుతుంది
పండు వెన్నెలలో తడుస్తుంటానా -ఒక కిరణం ముద్దిచ్చి
తన సోయగం ఒక గీతంగా రాయమని ప్రాధేయపడుతుంది
అంతలో ఎక్కడినుంచి వస్తుందో ఏమో
ఆమె చిలిపి నవ్వొకటి, ఎదురొచ్చి
ఇంకెందుకు ఆలస్యం . కలం పట్టుకొమ్మని భుజం తట్టుతుంది