15, ఆగస్టు 2013, గురువారం

"మనసు పలికే వేళ" పాటల తోటలోకి ఆహ్వానం

      నేను రాసిన పాటల సిడి ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభప్రాంగణంలో ఈ సోమవారం 19/8/13 సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సిడిని ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకులు డాక్టర్ స్ పి బాలు, సునీత, రమణ, కారుణ్య గానం చేసిన ఈ పాటల తోటలోకి మీకందరకూ సాదర ఆహ్వానం.


2, మే 2013, గురువారం

చిటపట చినుకులు,

                  1
జగతి నడచి పోతున్నది యుగాలుగా
నడుస్తున్నాము నువ్వు నేను చెరిసగాలుగా
మన సంస్కృతీ సాంప్రదాయాలు ఏమయ్యాయో
మనుషులు మారి పోతున్నారు మృగాలుగా
                2
మనసు బండరాయి
బ్రతుకు ఎండమావి
ఎదరంతా నిసిరేయి
ఈ నడక ఎవరి కోసమోయి
               3
అన్నం తినడానికి నీకు దొరకదు సమయం
అందరిని పలకరించడానికి లేదు సమయం
నీకోసం మిగిలి లేదా ఒక్క టైనా ఒక నిముషం
అసలు నువ్వు ఎందుకు పుట్టావో నాకు సంశయం
                 4
ఎన్ని చెప్పినా ఈ లోకం మారదు  
ఎంత  తిన్నా ఈ ఆకలి తీరదు
ఏ మత్తుమందు ఈ రాత్రి  అరగించిందో
రేయి తెల్లవారదు  ఈ దాహం చల్లారదు
                5
వయసు పెరిగిన కొద్ది చూపు మందగిస్తుంది
ఎడము పెరిగిన కొద్ది రూపు అందగిస్తుంది
ఏ గమ్యం లేకుంటే బ్రతుకు బద్ధకిస్తుంది
నిలిచి పోరాడావా విజయం వద్ద కొస్తుంది

28, ఏప్రిల్ 2013, ఆదివారం

కవి సమ్మేళనం

కవి సమ్మేళనం
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
 పేజీల కొద్ది కవితలు చదవాలని పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి అదే పోతగా పయనాలు

 వేదిక పైన ఉన్న వారు మాత్రం దాతల పొగడ్తల్లో
వారు,  వారి కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ   కీర్తిని కవులంతా  గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న సభా మందిర మది
 కవులు కవితలు కాదని పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని విషయాలు వల్లించారు

 ఫోటోలు వీడియోలు జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని కళామతల్లి పెదవి విరిచింది
ఆహుతులైన శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది

చినుకులు

తిన్నది అరగక పొతే
దేహానికి తప్పదు రుగ్మత
అనుకున్నది జరగక పొతే   
గుండెకు ఉండదు భద్రత

ఇంకా కావాలని దేహానికి దాహం
ఎన్నాళ్ళీ ఒత్తిళ్ళని హృదయానికి సందేహం
ఎందుకు ఎవరికీ ఎప్పుడు ఏలని
గుండెకు మనసుకు నిత్యం సంవాదం

ధనం ధనం ధనం
జగతిని నడిపే ఇంధనం   
మనం మనం మనం
ఆ మత్తులో గమ్మత్తుగా మనమందరం

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఉగాది అంటే ఉల్లాసం

ఉగాది  అంటే ఉల్లాసం
ఉగాది అంటే ఉత్సాహం  
ఉర్వి నలు చెరగులా నడిచే నవనవో న్మేషం
అనంత కాల గమనం లో
ప్రతి ఏటా ప్రకృతి పాడుకొనే ఉజ్వల గీతం

ఈ ఆనందం ఈ అద్భుతం ఎవరికీ!!!
ప్రకృతికి , పచ్చదనం పరచుకున్నలోగిళ్ళకి
కొమ్మలకి, కోయిలమ్మకి, కొత్త చిగుళ్ళకి
విరబూసిన వేప చెట్టుకి
విరగకాసిన మామిడి కొమ్మకి
చండ  ప్రచండంగా ప్రకాశించే భానుడికి
వస్తున్నామని హెచ్చరించే వడగాలులకి
 ఉగాది అంటే ఉల్లాసం  ఉత్సాహం

మరి నీకు నాకు ఈ మనిషికి
ఏమున్నది కొత్తదనం...
వచ్చిందా నవోదయం
ఇది నిన్నటి ఉదయమే
నిన్నటి హృదయమే
నిరంతరం ఎగిసిపడే కల్లోల కడలి తరంగమే
నిన్నటి దాహమే  నిబిడాంధకారమె
నూతనత్వం చేతనత్వం  ఏనాడు  
కనీ విని ఎరుగని కూపస్త మండూకం లా
స్వేచ్చా స్వాతంత్ర్యాలు విడనాడి
ఒకే గాడిలో తిరుగాడే గానుగెద్దు  నడకలా
నిరాశలో నిర్వేదంలో నిస్తేజం లో 
ఏమిటి జీవితం !!
ప్రకృతికి లాగే మనిషికి
ఆరు ఋతువులు ఉంటే ఎంత  బాగుండును
ఈ వసంత మాసం ఈ కోయిల గీతం ఈ పచ్చదనం పరవశం
మన జీవితాలలోకి అనునిత్యం తరలి వస్తే ఎంత బాగుండును

అదేమి  చిత్రమో  
అవనికి ఆరు ఋతువులు అయితే
ఈనాటి మనిషికి ఒకే ఒక ఋతువు
దాని పేరే ధన ఋతువు
 జీవించి నన్నాళ్ళు
ఆనందం సుఖము శాంతి అన్ని కరువు
దాని పర్యాయపదమే అవినితి అక్రమార్జన
దాని పర్యవసానమే మద్యపానం మనోవేదన
జీవిత పర్యంతం ఎంత ఉన్నా ఎంత తిన్నా
ఇంకా కావాలని రోదన
ఆరని తీరని వేదన ఆవేదన
 ఈ రుతువులోనే తెల్లారి పోతుంది మనిషి జీవితం
ఈ క్రతువు తోనే మసక బారి పోతుంది కల్లోల భారతం

 ఏ ఉగాది వినిపిస్తుంది అసలైన జీవన సత్యాన్ని
ఏ ఉగాది విశదీకరిస్తుంది  మానవ జీవన తత్వాన్ని
ఏ ఉగాది కొని తెస్తుంది ఇలపైకి స్వర్గాన్ని

అందుకే నేను కోయిలనై
కొమ్మ కొమ్మకు ఎగురుతున్నాను
కొత్త పాటలు కట్టి
మనిషి మనిషికి వినిపిస్తున్నాను
ఈ గాలి విరాళి ఈ నేల ఈ పచ్చదనం
ఈ ఆనందం ఈ అభినివేశం
 ఈ గీతం ఈ గానం  మీ కోసం
అని దీవిస్తున్నది అరుదెంచిన ఈ మధుమాసం
హాయిగా ఆలకించండి ఈ 'విజయ' దరహాసం

31, జనవరి 2013, గురువారం

ఏం చేస్తుంటావు ?



ఏం చేస్తుంటావు ?
కవిత్వం వ్రాస్తుంటాను
ఏమిటీ !
కవిత్వం ....
దేన్ని గురించి
మనిషి గురించి
మనిషా ?!
మనిషి లోని మనసు గురించి
ఇంకా ఏం  చేస్తుంటావు
పాటలు రాస్తుంటాను
పాడుకొంటూ ఉంటాను 
ఆహా ఏమి పాటలో అవి
మధువులు కురిపించే పాటలు
 ఎదలను మురిపించే పాటలు
ఇంకా....
నన్ను నేను ప్రేమిస్తుంటాను
ఆహా ......
 లోకాన్ని ప్రేమిస్తుంటాను
అబ్బో అది గొప్పే

నీతి  నిజాయితీ మరచి
నిస్సిగ్గుగా
నిప్పుల్లో నడిచే
నీ లాంటి వాళ్ళను
నిరసిస్తుంటాను
.....................
అవినీతి అక్రమార్జన
అధికార దుర్మదాంధకారాన్ని 
అవి మోసుకు తిరిగే వారిని
 భస్మం చేస్తుంటాను

నువ్వు మామూలు మనిషివి కాదు

ఔను కాను
నేను కవిని
లోకాన్ని వెలిగించే రవిని
నీవంటి వారి దుర్మార్గాన్ని 
అహంకారాన్ని  ఖండించే భార్గవిని

( ఒకసారి నా కావ్యం ''ఆరడుగుల నే ల ....''
పైన ప్రచురణలు లో ఉన్నది -తొంగి చూడాలని కొరుకొంటూ ...)

ఉదయానికి వందనం

నన్ను ప్రాణాలతో
సజీవంగా నిన్నటి నుంచి
నేటికి నడిపించు కొని వచ్చిన
ప్రభాతానికి వందనం
గాఢ  నిద్రను
దీర్ఘనిద్రగా మలచకుండా
తెల్ల వారే దాకా నన్ను కాపాడిన
చల్లని రాత్రికి అభివందనం
కలత నిదురన్నది 
నన్ను దరిజేర నీయకుండా
మధుర స్వప్నాల డోల లూగించిన
కలలకు అభినందనం
ఆప్యాయంగా పలకరించిన
తొలి కిరణానికి
అపురూపంగా నను తాకిన
మలయ పవనానికి
చిరు నవ్వుతో ఎదురైన
నవ వికసిత కుసుమానికి
నడక దారిలో నన్ను
మురిపించిన
మందహాసానికి
తెల తెలవారిందని చాటి చెప్పే
పక్షుల కిలకిలరావానికి
నా రాకను గమనించి
తన్మయంగా తలలూచిన
తరు శాఖలకు
  అలజడి లేకుండా
ఈ కవనపు తోట లోనికి
ప్రవేశించేందుకు
అవకాశం  కల్పించిన
నా మానసానికి
మనసా నమామి !
శిరసా నమామి!