5, జనవరి 2025, ఆదివారం

 న్యాయస్థానాలలో తెలుగు అమలు….సుసాధ్యమే

మనం తెలుగు వాళ్ళం. మన భాష తెలుగు .

తెలుగులో మాట్లాడడం మన విధి, హక్కు, బాధ్యత.

అయితే తరతరాలుగా, ఆంగ్ల పరిష్వంగంలో నలిగి నలిగి

కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మరిచిపోయాం విస్మరించాం

ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ ఇద్దరు ఎదురైనా ఈ

ఆంగ్లంలో మాటాడుకునే దౌర్భాగ్యం .వీళ్ళే సుమా తెలుగు

వాళ్ళు- అని పరాచికమాడే, వింత విచిత్ర పరిస్థితికి

దిగజారింది .

ఇప్పుడు మనం న్యాయస్థానాలలో తెలుగు అనే

విషయం గురించి ముచ్చటించుకుందాం . న్యాయస్థానాలలో

వుండే వారు న్యాయమూర్తులు, న్యాయవాదులు,

కక్షిదారులు, నేరస్తులు, ముద్దాయిలు, వగైరా.. నిత్యం

అక్కడ వాదోపవాదాలు జరుగుతుంటాయి .కొన్ని వందల

వేల తీర్పులు వెలువడుతుంటాయి


న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులకు ఎక్కువమందికి

ఆంగ్లం తెలియదు . చట్టాలు తెలియవు. అయినా నిత్యం

అక్కడ వాదనలు ప్రతి వాదనలు వాగ్యుద్దాలు, ఆంగ్లంలోనే

హోరాహోరిగా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏమి

జరుగుతున్నదో తెలియక , కక్షిదారులు ఇంగ్లిషు సినిమా

చూస్తున్నట్టు బిక్కమొహాలు వేసుకొని బిడియంగా చోద్యం

చూస్తుంటారు. ఈ గందరగోళంలో తన జీవితం భవితవ్యం

ఏమి కానున్నదో వారికీ బోధపడదు. ప్రభుత్వ న్యాయవాది

తన న్యాయవాది, ఇద్దరు తనను తెలుగులోనే ఏదో గుచ్చి

గుచ్చి అడుగుతారు. న్యాయమూర్తి దానిని ఆంగ్లలోకి

అనువదించి నమోదు చేసుకుంటారు . అక్కడ ఏం వ్రాశారో

తనకు తెలియదు . తన బ్రదుకు ఎలా తెల్లవారనున్నదో

అర్ధం కాదు . ఆ తర్వాత వాదోపవాదాలు పోట్టేళ్ళలా పోట్లాడు

కొంటు చిత్ర విచిత్ర విన్యాసాలు ..కక్షిదారులు అనుకుంటారు

‘’తమకు తెలిసిన భాషలో పోట్లడుకొంటే ఎంత బాగుండేది’’

అని ..ఇలా తన ముందే తన గురించే , తన భవిష్యత్తు


నిర్ణయించే తీర్పు దాకా ఆంగ్లంలో పరాయిభాషలో అక్కడ

మొత్తం కధ చిత్రంగా నడిచి పోతుంది .. ఒక దారుణమైన

కుట్ర జరిగి పోతుంది

పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమాయక రైతు ఇంకా

అమాయకంగా ఇలా అడుగుతాడు ‘’అయ్యా !న్యాయం

పరాయి భాషలోనే వుందా మన భాషలో లేదా ‘’ అతని

ధర్మ సందేహం వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది

నేను నా ఉద్యోగ నిర్వహణలో , ఈ వింత

దయనీయమైన పరిస్థితిని గమనించాను . అమాయకంగా

ఎదుట నిలబడ్డ ముద్దాయిని, అరకొర విజ్ఞానంతో నా

ముందు విన్యాసాలు చేస్తూ ఆంగ్లంరాక, వచ్చినా సరిగా

విడమరిచి చెప్ప లేక, తొట్రుపడుతున్న న్యాయవాదిని,

పోలీసు అధికారిని చూచి జాలిపడ్డాను

1 9 7 4 లోనే మన ప్రభుత్వం ఇందుకు

సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది ..తెలుగులో తీర్పులు


ఇవ్వాలని తెలుగు టైపు యంత్రాలు సమకూర్చింది..

తెలుగు నేర్చిన సిబ్బందిని నియమించింది . కాని

అనతికాలం లోనే అన్ని వృధా ఐ పోయాయి ..కాలగర్భంలో

కలిసిపోయాయి .

అనువాదం అనేది ఎంత దుర్భరంగా దుస్సహంగా

వుంటుందో ఒక చిన్న ఉదాహరణ ..ఆంగ్ల పరిభాషలో

వాంగ్మూలం నమోదు చేసే వేళ ‘blood stained earth ‘

అనే పదానికి ‘యుద్ధభూమి’ అని పలికిన అనువాదకుని

చూచి, జిల్లా న్యాయమూర్తి కోపంగా ..నీ బొంద, అది

‘’నెత్తురు తడిసిన మట్టి’’ అని విసుక్కోవడం చూశాను.

ఇలాంటి తికమక సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ..ఎందుకీ

వృధా ప్రయాస, తెలుగు భాషలో నమోదు చేసుకోవడం

తేలిక కదా అనిపించింది

ఇప్పటిదాకా రాష్ట్రంలో అక్కడక్కడా న్యాయమూర్తులు

తెలుగులో తీర్పులు వెలువరిస్తూనే ఉన్నారు. కాని అది

వేళ్ళ మీద లెక్క పెట్టదగిన సంఖ్య మాత్రమే . న్యాయపాలన


మాతృభాషలో ఉంటేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుంది,.

నిజమైన న్యాయం జరుగుతుంది . చిత్రమేమిటంటే

ఆంగ్లేయుల పాలనలో వాదోపవాదాలు తెలుగులో జరిగాయి

అప్పటి న్యాయ స్థానాలు తెలుగులో తీర్పులు ఇచ్చాయి.

ఇంకా ఆశ్చర్యమేమిటంటే స్వాతంత్ర్యం అనంతరం,

తెలుగులో తీర్పులు ఆగిపోవడం, న్యాయమూర్తులు ఆంగ్లం

బాట పట్టడం శోచనీయం

ఈ విషయమై, మాన్యులు ఏ బి కే ప్రసాద్ గారు

అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నపుడు, ఆయన

చేసిన కృషి అభినందనీయం .అక్కడక్కడా

న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఇచ్చిన విషయం

తెలుసుకొని, వాటిని సేకరించి ‘’న్యాయస్థానాలలో తెలుగులో

తీర్పులు ‘’ అనే ఒక గ్రంధం ప్రచురించి అన్ని

న్యాయస్థానాలకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు .

అందులోని పదిమంది న్యాయమూర్తుల సరసన ఈ

వ్యాసకర్త రెండు తీర్పులు సైతం చోటు చేసుకున్నాయి


నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో తెలుగులో

కార్యకలాపాలు, రిజిస్టర్లు అన్ని తెలుగులోనే ఉండడం

చూశాను. కాలక్రమేణా అవి కాలగర్భలో కలిసిపోయాయి .

అప్పుడపుడు ప్రభుత్వం ఈ విషయమై ప్రకటనలు చేస్తూనే

ఉన్నా, అవి కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోతున్నాయి

కారణం ..ఈనాటి న్యాయమూర్తులు ఎక్కువగా ఆంగ్లంలో

చదివినవారు కావడం .. వారికీ తెలుగులో రాయడం అనేది

సహజంగా అసాధ్యం ..పైగా న్యాయపరమైన ఉత్తర్వులు

సంబంధ పత్రికలు అన్ని అంగ్లలోనే ..వున్నాయి .. వాటిని

అధిగమించి , తెలుగులో కార్యకలాపాలు కొనసాగించడం

వీరికి ఇబ్బంది కరమైన విషయమే

నిజానికి మనమందరం తెలుగులోనే ఆలోచిస్తాం..

తెలుగులోనే కలలు కంటాం .. మన ఆలోచనలు కలలు

ఆంగ్లంలో వుండవు . ఆవేదన ఆగ్రహం పెల్లు బికినప్పుడు

మాత్రమే -తెలుగు వాడు తెలుగును వాడుతాడు -అని


నానుడి .. తన అసలు భాష, హృదయభాష ఆగ్రహావేశాలు

పెల్లుబికినపుడు మాత్రమే బయటపడుతుంది

నాకు తెలిసి, విషయం ఏదైనా కానీ ..ముందుగా

తెలుగులో అనుకొని, విశ్లేషించు కొని అప్పుడు దానిని

ఆంగ్లంలోకి తర్జుమా చేస్తాం ..ఒక తీర్పును

అర్ధంచేసుకోవాలంటే, ముందుగా భాషా పరిజ్ఞానం ఉండాలి,

అది తెలుగు కానీ ఆంగ్లం కానీ .. కనుక , తెలుగులోనే

మొత్తం వ్యవహారం ఉండొచ్చు కదా .. ఎందుకో నాకు ఇది

చాటుమాటు వ్యవహారం అనిపించింది . కష్టపడి ఆంగ్లంలో

తడబడుతు వాంగ్మూలం ఇస్తున్న పొలీసు అధికారులను

ఆంగ్ల భాష రాని ,సాక్షులను చూచి జాలిపడి , వారి

భాషలోనే , అంటే తెలుగులోనే చెప్పమన్నాను, వారు

చెప్పినదే తుచ తప్పక నమోదు చేశాను అంతేకాదు

అప్పటిదాకా ఆంగ్లంలో ఉన్న సమన్లు వారంట్లు వగైరా అన్ని

పత్రాలను తెలుగులోకి మార్చాను . కార్యాలయంలో జరిగే

అన్ని వ్యవహారాలు తెలుగులోకి మళ్ళించాను. కడకు


హాజరు పట్టిలు కూడా ..నాకున్న ఒకింత కవితా పరిజ్ఞానం

ఇందుకు ఎంతో దోహదం చేసింది

నేను నా తీ ర్పుల్ని తెలుగులో నా లాప్ టాప్ మీద

టైపు చేసాను జిల్లా న్యాయమూర్తులు నా తీర్పు ప్రతులు

అందుకొని అభినందించారు . అలా ఒకటి రెండు రాశాక ఆ

తర్వాత ఎంతో సులభం అనిపించింది. అక్షరం పొల్లు

పోకుండా కక్షిదారుని మాటలు యధాతధంగా నమోదు

చేసినప్పుడే నిజమైన తీర్పు వస్తుంది . ఆంగ్లంలో ఒక చిన్న

పదం తారు మారై అర్ధం మారి తీర్పులు తారుమారైన

సందర్భాలు ఎన్నో ఉన్నాయి

న్యాయ పదజాలం అంత కఠినమైన దేమి కాదు

కాకుంటే చిత్తశు ద్ధి ఉండాలి . కొన్ని పారిభాషిక పదాలు ఆం

గ్లం ఉర్దూ భాషనుంచి మన మధ్యకు వచ్చి చేరాయి . రైలు

బస్సు వంటి పదాలు మన దైనందిన జీవితంలో చొరబడి

అలవాటుగా మారిపోయాయి .. నిజమే అంతగా అనువాదం

సులభసాధ్యం కానప్పుడు, తెలుగు పదం ఇంకా కఠినం


అనిపింఛినప్పుడు, అదే ఆంగ్ల లేక ఉర్దూ పదాన్ని తెలుగు

లిపిలో వ్రాయవచ్చు అవి జనబాహుళ్యం లోకి వాడుక

పదాలుగా వచ్చాయి కాబట్టి

ఉదాహరణకు కొన్ని......

క్రిమినల్ ప్రోసిజర్ కోడ్,/ గేమింగ్ ఆక్ట్, / ప్రాసిక్యూషన్

వారు/ లాప్ టాప్/ అరెస్టు/ టెలిఫోన్/ స్టేషన్/ స్టేట్మెంట్/

అలాగే కొన్ని పదాలు, పదేపదే వచ్చేవి ....

జామీను దార్లు/ వాది /ప్రతివాది/ ఫిర్యాది/ న్యాయవాది/

ఉభయుల వాదనలు/ విచారణ/ అభియోగాలు/

సాక్షులు/ మధ్యవర్తి/ చట్ట ప్రకారం.......

ప్రతి వాంగ్మూలం ఆంగ్లంలో నమోదు చేసుకొని , దానిపై

సదరు సాక్షి సంతకం తీసుకొనడం రివాజు .. వాం గ్మూలం

చివర సదరు వ్యక్తికి ‘తెలుగులో వినిపించి’ అని ఉంటుంది

కానీ , అంత ఓపిక తీరిక న్యాయస్థానానికి ఉండదు ..

అమాయక కక్షిదారులు అందులో ఏముందో అర్ధం


కాకపోయినా వేలు ముద్ర వేస్తారు ,సంతకం చేస్తారు. ఇలా

అందులో ఏముందో తెలియకుండా సంతకం చేయడం ఏ

మాత్రం న్యాయసమ్మతం కాదు

తెలుగులో తీర్పులు ఇవ్వడం అనేది బ్రహ్మవిద్యకాదు

బ్రహ్మ పదార్ధం అంతకన్నా కాదు అని నా ఉద్దేశం.

..నాలుగైదు తీర్పులు వెలువరించాక, తెలుగు ఎంతో

సులభం అనిపిస్తుంది.. తేలికగా సునాయాసంగా అవలీలగా

తీర్పును వెలువరించే పరిజ్ఞానం దానంతట అదే

అలవడుతుంది . అలా తెలుగులో వచ్చిన తీర్పుని పల్లెటూరి

చదువురాని రైతు సైతం, హాయిగా చదివించుకొని

తెలుసుకోగలడు . తన తీర్పు తనే వినగలడు , అర్ధం

చేసుకోగలడు .. అలా అర్ధం కాకపోతే అతడికి అన్యాయం

అనర్ధం జరిగే అవకాశముంది . గతంలో ఆంగ్లంలో అర్ధం కాని

పదాలతో తీర్పులు ఇచ్చిన వారున్నారు . అందులో

ఏముందో తెలుసుకోలేక బుర్రలు బద్దలు కొట్టుకున్న వాళ్ళు

ఉన్నారు . అందుకే తెలుగులో తేలిక భాషలో చదవగానే


సులువుగా బోధపడేలా తెలుగు లో తీర్పులు ఉన్నపుడే

అది సాధ్యం

అందుకే న్యాయమూర్తులకు విన్నపం ....మీరు

తెలుగులోనే ఆలోచిస్తారు కదా ..తెలుగులోనే మొత్తం

వింటారు కదా.. ఆ తెలుగులోనే కార్యకలాపాలు నడపండి..

తెలుగులోనే తీర్పులు వ్రాయండి ..ఒకటికి రెండు.. పదిసార్లు

రాశాక ప్రావీ ణ్యం దానంతట అదే వస్తుంది ..అది అలవాటై

పోతుంది నేను అలాగే వ్రాయగలిగాను అప్పుడే

న్యాయస్థానం తలుపు తట్టిన అమాయక కక్షిదారునికి తగిన

న్యాయం జరుగుతుంది మరో ముఖ్యమైన అంశం

..ఆంగ్లంలో అక్షరాలు తక్కువ . అందువలన అన్ని

భావాలను అవి మొయ్యలేవు . అదే తెలుగు భాష 5 6

అక్షరాలు గలిగి, భావాన్ని సూటిగా ధాటిగా వ్యక్తపరిచే

గుణమున్న భాష ఆంగ్లంలో మాదిరి ఒకే పదానికి రెండు

మూడు అర్ధాలు వచ్చే పరిస్థితి ఉండదు తికమక అసలే

ఉండదు


ఇలా ఎన్నో కారణాల వలన మన తెలుగు నేలపైన

తెలుగు భాష ఆవశ్యకత ఎంతో ఉన్నది ..ముఖ్యంగా జాతికి

నీతి నియమాలు నిర్దేశించే న్యాయస్థానాలలో తెలుగును

ప్రవేశ పెట్టవలసిన అగత్యం అత్యవసరమై ఉన్నది ..

అందుకే తేట తెలుగుతో న్యాయస్థానాలను నింపేద్దాం..

తెలుగు నేలపై తెలుగు వెలుగులు పూయిద్దాం .. మన

తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం .. అట్టడుగున ఉన్న

వారికీ అమాయక తెలుగు ప్రజానీకానికి, అసలైన

న్యాయాన్ని అందిద్దాం ..

కోరిసెపాటి బాలకృష్ణారెడ్డి .బియస్సీ బి ఎల్

విశ్రాంత న్యాయమూర్తి –ఒంగోలు

94402 42 495

************

9, అక్టోబర్ 2020, శుక్రవారం

 ఒక్కోసారి ..

ఎందుకీ రచనలు
ఏమిటీ పిచ్చి అనిపిస్తుంది.
అంతలోనే ఒక ఆప్త వాక్యం
ఎక్కడినుంచో ఎగిరొస్తుంది
అద్భుతం అంటూ
నిర్లిప్తంగా ఉంటాను
ఒక పదం పరుగెత్తి వస్తుంది
పదపద మంటూ..
నిరాశలో ఉంటాను
ఒక గీతం ఎదురౌతుంది
కలత ఎందుకంటూ...
----
నిజమే ..ఇది ప్రతి కవికి అనుభవమే ఎన్నో సందర్భాల్లో నేను ఈ విచికిత్సకు లోనయ్యను ..అలాంటి సమయాల్లో మా దువ్వూరి ఉత్తేజం కలిగిస్తూ నా రచనలు దృశ్య రూపకాలుగా మలిచిచాడు.. రాజహుస్సేన్ ఎన్నో సార్లు విశ్లేషణ చేసి నా బుజం తట్టారు..ఇంకా ఎందరో మిత్రులు నన్ను నిరంతరం చైతన్య పరుస్తూనే వున్నారు
ఇప్పుడు ..ఈ కవి మిత్రుని లేఖ.
నన్ను వెన్నుతట్టి కావ్యోన్ముఖుణ్ణి చేసింది..ముఖ్యంగా ఒక కవి ఇంకొక కవిని.ప్రశంసించడం అరుదు ..అనాదిగా కవి లోకంలో అసూయలు ఎక్కువ..
అలాంటిది ఈ కవి హృదయం నన్ను నా కవిత్వాన్ని ఆకాశాన్ని కెత్తింది ..అందుకు ఈ మిత్రునికి నా హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేసుకొంటూ...
--------------------
ఒక కవికి.
మరొక కవి ఆత్మీయ లేఖ..
------------------
ఆత్మీయులు,
సుమనస్వి ,
శ్రీ బాలకృష్ణారెడ్డి గారికి..
నమస్సులు..
ఆలస్యంగా నైనా
మీ ఆలాపనలు
వాటిలోని సల్లాపములు వీక్షిస్తున్నాను..
మీ మనసు
అనుభూతి నిండిన
ఓ సుమగీతిలా
పల్లవిస్తుంటుంది .
సుందర సురుచిర సుమసౌరభాన్ని వెదజల్లుతుంటుంది ..
కవిత్వం
ఎవరైనా వ్రాస్తారు..
కానీ
మీలాగా రాయడం
మీకే సాధ్యం..
ఎందుకంటే
మీరు ప్రకృతి ప్రేమికులు..
ప్రకృతికి ప్రతిరూపమైన
స్త్రీ హృదయ సౌందర్యాన్ని ఆరాధించే నిరంతర అక్షర మాంత్రికులు ..
అనిర్వచనియమైన అనుభవాన్ని తేలిక మాటల్లో చెప్పగల కవితలు మీవి .
భావానికి
దాని వెనుక పదాలకు
వాటి వెనుక అక్షరాలకు కైమోడ్పులు చేసే ఆరాధన మీది..
డబ్బు చుట్టూ
తిరిగే మనుషులున్న ఈ కాలంలో..
మనసులో నందనవనాలు సృష్టించుకొని..
పదాల పాదాల
పారిజాతాలను పూయించే అరుదైన వ్యక్తిత్వం మీది..
చిలిపితనానికి (ఈ వయసులో కూడా)
వలపు ధనానికి (మీకున్న గొప్ప ఆస్తి)
పూల వనానికి (మీ మనసులోని బృందావనాలు)
చెలిమి నెరపి..
వేల గీతాలు కవితలు ప్రసవిస్తున్న , ప్రవచిస్తున్న
మీ కలానికి గళానికి నా వినమ్ర ప్రణామాంజలి ..
ఆవహించిన శూన్యాన్ని చెరిపేసి, అందమైన ఇంద్రధనస్సులని సృష్టించుకున్న మీరు..
ఈ నిరాశామయ లోకానికి
ఓ కాంతిరేఖ ..దీప స్తంభం..
అవును సార్!
మిమ్మల్ని
అర్ధం చేసుకొనే వాళ్ళు
మిమ్మల్ని చదివే వాళ్ళు
చాలా తక్కువగా వుంటారు.
అయినా మీరు రాస్తూనే ఉన్నారు..
కోయిల
తనకోసం కూస్తుంది ..
వినేవాళ్ళు వింటారు..
మేఘం
ప్రకృతి ధర్మంగా కురుస్తుంది ..
తడిసే వాళ్ళు తడుస్తుంటారు ..
చెట్టు
ఫలాలనిస్తుంది ..
తినేవాళ్ళు తింటారు..
మీరు అంతే..
ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా,
నిరంతరం రసరమ్య గీతాలు రాస్తూనే వున్నారు .
జీవితాన్ని
తీయని పాటగా మలచుకొన్న మీకు పిలిస్తే పల్లవులు పలుకుతాయి
తలిస్తే చరణాలు తరలి వస్తాయి ..
అది మీ అదృష్టం ..
మిము గన్న తల్లిదండ్రుల సుకృతం ..
మీతో సహజీవనం చేసిన రాజేశ్వరి మేడమ్ గారి దాంపత్య జీవన స్మృతి..
అవును..
మీ కలానికి
పువ్వులతో మాట్లాడడం తెలుసు
పున్నమితో
సయ్యాటలాడడం తెలుసు
పంట చేనును
పలకరించడం తెలుసు ..
తెలియందల్లా ఒక్కటే .
.కలాన్ని కింద పెట్టక పోవడం..
కాలాన్ని నిద్రపోనివ్వక పోవడం.. నిజానికి
కవికి కావలసింది ఈ లక్షణాలే
ఎప్పుడో ఒకసారి
గురుదేవులు నాగభైరవ గారన్నారు
‘బాలకృష్ణారెడ్డి ..
కలంతో కలలు గనడం నాకు నేర్పుతావా..
నీ ముఖ కాంతి లోని యౌవన రహస్యాన్ని చెబుతావా ..’’అని .
నిజమే
మీ మనసు
ఓ అనురాగ రసగంగ .
.అది నిరంతరం
అక్షరాల చెక్కిళ్ళపై
పుప్పొడిని ముద్దాడుతుంది ..
కనుకనే
మీ పదాలకు పాదాలకు
ఇంతటి పరిమళం..
చదివే వాళ్ళకు పరవశం
'నా కంటి పాపలో నిలిచి పోరా ..
నీ వెంట లోకాల గెలువ నీరా. ..'
అన్న దాశరధి గారి పల్లవిలో ప్రేమ ఎంతగా పల్లవించిందో లోకానికి తెలుసు.
. ఈ పల్లవికి ప్రపంచమంత వ్యాఖ్యానం చెయ్యవచ్చు..
కవిత్వం లోతు గ్రహిస్తే
మీ కవిత లోను అలాంటి లోతులు చాల వున్నాయి ..
వాటిని తడిమే వాళ్ళే లేరు.. ఎవరైనా
బాగుంది, చాలా బాగుంది అని పోస్టింగులు పెడితే,
మిమ్మల్ని మోసగిస్తున్నట్టే..
ఇప్పుడు ..
చదవకుండానే వహ్వా! భళా! అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ పాఠకులు వచ్చారు .
.తస్మాత్ జాగ్రత్త.
మీకు
మీ కవిత్వానికి
అంతరాలు లేని మీ మంచి మనస్సుకు నమస్సులు
సదా మీ హితైషి
........బీరం సుందరరావు

10, ఆగస్టు 2020, సోమవారం

 వితా లతాంతాలు

12

ఉదయాన్నే
విరిసిన ప్రతిపువ్వు
నీ కాళ్ళావేళ్ళా పడి
బ్రతిమలాడుతోంది..

నీ అంగుళులు
తాకి తరించాలని

ఆ పువ్వు
వెదజల్లిన పరిమళం
నీ చుట్టూ
అల్లిబిల్లిగా తిరుగుతోంది

తన జీవితాన్ని
సార్ధకం చేసుకోవాలని

పువ్వు గొప్పా
నువ్వు గొప్పా
నన్ను పట్టి
పీడిస్తున్న సందేహం
.....

ఆశ్చర్యంతో
తలమునకలై
ఉన్న నన్ను తట్టి
బుగ్గ మెలిపెట్టి
సంశయం తీర్చావు ..

"సుమం
సంగతి ఏమో కాని
నీది మాత్రం
అలవికాని సౌందర్య దాహం.."

...బాలకృష్ణారెడ్డి

 నేను

కవిని కాను
నేను వ్రాసేదంతా
కవిత్వం అనలేను

నేను
పండితుణ్ణి కూడా కాను
నాలో పాండిత్యం ఏమాత్రం లేదు
అనవసర పాండిత్యం అసలే లేదు

ఏదీ
తోచనప్పుడు
పూలతో
గాలితో
మేఘాలతో
మేలమాడుతుంటాను

ఊసుబోక
వెన్నెలతో
మల్లెలతో
మందారాలతో
ముచ్చటిస్తుంటాను

ఆ మాటలే
ఆ పాటలే
అక్షరాలకు.
పదాలకు వినిపిస్తుంటాను

అవే
కవితలుగా
కావ్యాలుగా
గీతాలుగా
వెదజల్లుతుంటాను..

దానిని
మీరు కవిత్వం అంటారా
అది మీ ఇష్టం

కాదనడానికి
నేనెవరు
మీ అభీష్టం..

 కవితా లతాంతాలు

...13...
పూల
అందాలు పరికించి
గాలి గంధాలు మోసుకెళ్లింది .
.
మధుర
నాదాలు పలికించి
తేటి తేనియలు తీసుకెళ్లింది ..

ప్చ్..
ఇంతలోనే
ఏమీ లేని
దానినయ్యానని
అయ్యో పాపం.
కుసుమం
ఎంతగానో వాపోయింది..

......................

ఆ తోటలో
అడుగు పెట్టానో లేదో

అరవిరిసిన
కుసుమాలు
ఆనందంగా
నన్ను పలకరిస్తాయి ..

అప్పుడే
అటు వచ్చిన
తుమ్మెదలకు

నన్ను
తమను కీర్తించే
కవిగా పరిచయం చేస్తాయి..

 నువ్వు

వెన్నెలవా !
కాదు
ఎలకోయిలవా !-
కాదు కాదు
సుమానివా !!

కాదా !

మరి ..
ఈ కాంతి కిరణాలు
ఇన్ని సంగీత స్వరాలు
ఈ అద్భుత పరిమళాలు
నీ కె క్కడివి
.....

నేనెవరో
నీకు తెలిదా
చోద్యం కాకపోతే --

నీ మానస వినీలా కాశంలో
విహరించే నిండు జాబిలిని

నీ గుండె గూటిలో
నివసించే చిన్నారి కోయిలని

అనునిత్యం
నా నామస్మరణం చేసే
నీకోసం విరిసిన కన్నె కుసుమాన్ని

నేను ..
నీ నెచ్చెలిని..

....బాలకృష్ణారెడ్డి

 ఆలాపనలు- సల్లాపములు

--- 33---

''అందరిదీ ఒక దారి..
అయితే ఉలిపి కట్టెది ఒక దారి అన్నట్టుంది"

"ఉన్నట్టుండి ఈ ఉలిపికట్టె
ఇప్పుడు.ఎందుకు గుర్తుకు వచ్చిందో మా వెన్నెల బొమ్మకి"

"ఎందుకంటే ..
నువ్వు ఉలిపి కట్టెవు కాబట్టి"

"ఏమిటి అంత ప్రేమగా సంబోధించావు ..
ఏకంగా నా మీద ..
పాశుపతాస్త్రమే సంధించావు"

"మరి..
అందరూ వ్రాసే కవిత్వమేమిటి ..
నువ్వు చేస్తున్న దేమిటి"

"అంత తప్పు నేనేం చేశాను"

"ఈ ప్రేమ ప్రణయం ..
అసలు ఈ కవిత్వం నీ కెలా అబ్బింది"

"ఎందుకో నీకు తెలియదా"

"తెలియకనే కదా.. అడుగుత"

"నువ్వేగా...ఎర్రగా బుర్రగా ...
నా ఎదురుగా ఉంటే ఇంకేమి వ్రాయను ?"

"ఆహా ! అలాగా ..ప్రతి దానికీ
నన్ను ఆడిపోసుకోవడం ..
తమరికి బాగా
అలవాటయింది.."

.".అయితే ఈ కవిత విను..
నీకు నిజం బోధపడుతుంది"

"విన్నవించు మహాశయా"
...
****
ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప..

ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ
ప్రణయ సుమ గీతికలు తప్ప..

కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల
చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ
సంచయము తప్ప..

వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల
పద మంజీర మంజుల
సంగీత విభావరి తప్ప..

నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న
ఎలకోయిల

నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో
పొదిగిన ప్రణయాక్షరాల
ప్రసూన మాల ..

******
"అబ్బ ..
కుంభవృష్టి కురిసి
వెలిసినట్టుంది"

"ఇంకా.."

"అప్పటిదాకా..
సాఫీగా సాగి పోతున్న
సెలయేరు ..ఒక్కసారిగా .
కొండకొమ్ము నుంచి కిందకి దూకినట్టుంది ."
.
"ఇం ...కా."

"కారుమబ్బును చూచి
పరవశించిన నెమలి
పురి విప్పి నాట్య మాడినట్టుంది"

'ఇప్పుడు తెలిసిందిగా ..
ఈ కవిత్వం ఎందుకు వ్రాస్తున్ననో..."
.
"తెలిసింది .తెలిసింది .కవిగారు!
మీ ప్రతిభకు జోహారు.."

"ఇంకెప్పుడు
పొరపాటున కూడా
ఇలా పిచ్చి ప్రశ్నలు సంధించకు సరేనా.."

"చిత్తం ..
ఓ ప్రణయకవి గారూ..
మా మంచి దొరగారూ..'"

......బాలకృష్ణారెడ్డి

27, ఫిబ్రవరి 2020, గురువారం


ఇవ్వు ఇవ్వు ఇవ్వు 
ఎదుటివారికి లేనివారికి 
ఇవ్వడంలోనే ఉన్నది ఎంతో హాయి
అనాదిగా పశువులు పక్ష్యులు 
నదులు చెట్లు మేఘాలు  సైతం అన్ని ఇస్తూనే ఉన్నాయి
సృష్టిధర్మానికి విరుద్ద్ధంగా 
కేవలం తీసు (దోచు) కోవడం తప్ప  
ఇచ్చే గుణం మరచిన ఓ మనిషి  
ఏ ప్రాణికోటిలో లేని 
ఈ స్వార్ధం దుర్మార్గం దుర్వినీతి వంటి దుర్గుణాలు 
నీ కేల అలవడినాయి

3, ఫిబ్రవరి 2020, సోమవారం

ఎదలో అలజడి చెలరేగితే చెప్పుకోను
నెచ్చెలి ఉంది..
నడిరేయి
చలి పులి గాండ్రిస్తే కప్పుకోను చెలి కౌగిలి ఉంది..

4, జులై 2018, బుధవారం

నా కనులలో
ఇంకా తడి ఉన్నది
మాసిపోని మమతల సడి ఉన్నది
నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది
ఏనాటిదో మరి
ఈ శోకం నా వాకిట పడి ఉన్నది
ఇన్ని యుగాలుగా
నలిగిన నా హృదయం
నీ సన్నిధి చేరాలని తహ తహ పడ్తున్నది
కన్నీటి ప్రవాహంలో కాలం కొట్టుకు పోయినా
కత్తుల వంతెనపై నడిచి నట్లున్నది
నువ్వు లేని ఈ లోకం
నిప్పుల సుడిగుండం వలె ఉన్నది
ఎంతకు చల్లారని ఈ శోకం
ఉప్పెనలా ఎగిసి పడ్తున్నది
ఎందుకో ఎద లోపల ఈ వేళ
చితి మంటల చిట పట వినిపిస్తున్నది
ఏనాటిదో ఈ ఓటి పడవ
తిరిగి రాని లోకాలకు పయనిస్తున్నట్లున్నది
-----------------------------నేను సగం దేహంగా మిగిలిపోయిన సందర్భం ---నా మనసు గుర్తు చేసుకున్న వేళ---

29, జూన్ 2018, శుక్రవారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది
నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన గళమెత్తి గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది
ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది
లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది
ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన
అధర ప్రాంగణ మొకటి నన్ను కరుణిస్తూనే ఉంటుంది
నిన్ను చూచి ఆకాశం.
తన నుదుట తిలకం దిద్దుకున్నది
నిన్ను మెచ్చి మధుమాసం
తన నడకను నీ దిశగా మార్చుకున్నది
నిండు పున్నమి దరహాసం
నీ ఆధరాన చేరి
ఆనంద తాండవం చేస్తున్నది
గాలికి ఎగిరిన
నీ కురులను చూచి
నీలి నింగి వంగి వంగి
వందనాలు చెబుతున్నది
నీ సౌందర్యదీప్తిని గని
మల్లె ముందారం సన్నజాజి
మూతి ముడుచుకుంది
ఇన్నిన్ని వన్నెల చిన్నెల
సోయగాల చెలువములు తిలకించి
ప్రకృతి నీకు ప్రణామం చేస్తున్నది
ఒక వాన పాట..
----//------
ఒక చినుకు
పలికింది ఓంకారం
ఒక చినుకు
అలదింది సిందూరం
ఒక చినుకు
చుట్టింది శ్రీకారం
ఒక చినుకు
మీటింది సింగారం //
పెదవిపైన
పడిన వాన గానమాయెను
అది గుండెపైన
జారగనే జాతరాయెను
నడుము పైన
పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన
మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి
తనువంతా బృంద గానమై
కనుల ముందు
బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి
తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి
పరుగిడగా వనము నవ్వెను
తనువంతా
తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి
మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే
గాలివాన ఆగిపోయెను
ఆదమరచి
మనసు వీణ మూగవోయెను //
తెలుగుకు
వందనం
తెలుగు
భాషామతల్లికి
అభివందనం
తెలుగు సుమములు
విరబూసిన ఈ నేల
పూల మందిరం
తెలుగు తేజం
వెల్లివిరిసిన
ప్రతి హృదయం
నవనందనం
తెలుగుకు వందనం..
తెలుగు జాతికి వందనం..
తెలుగు మహస్సుకు వందనం
తెలుగు వచస్సుకు వందనం
తెలుగు యశస్సుకు వందనం
ఎన్ని చిలిపిదనాలో
ఆ నవ్వులలో ఉన్నాయి
ఎన్ని పూలవనాలో
ఆ పెదవులపై ఉన్నాయి
ఎన్ని మౌనగీతాలో ఎన్నిపారిజాతాలో
ఎన్ని మూగరాగాలో అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి
నడకలు బరువైనాయి
మల్లెలు మరులైనాయి
మాటలు కరువైనాయి
అగరు పొగలు అత్తరులు వందిమాగధులైనాయి
అన్ని -వంగి వంగి వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి ,
మంగళ వాద్యాలున్నాయి
ఊపిరిలో మందార మకరంద
పోతన పద్యాలున్నాయి
ఒంగిన ఆ కనుదోయి ఆ ఓరచూపు లెవరికోసమోయి
అది అరవిరిసిన మరుమల్లెల మందహాసమేనోయి //
ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప !!?
కొన్ని కుసుమాలు కొన్ని భ్రమరాలు
ఇంకొన్ని వెన్నెల కిరణాలు మలయపవనాలు
ఒక రోజు నా లోగిలిలోకి బిరబిర నడిచి వచ్చ్చాయి
ప్రణయ కవిని కలుసుకోవాలని నాతో అన్నాయి
లోనికి రారమ్మని సాదరంగా ఆహ్వానించాను
మీరు వెదికే ఆ కవిని నేనే నన్నాను
ఆశ్చర్యంగా అవి నాకు అంజలి ఘటించాయి ఎంతో ఋణపడి ఉన్నామన్నాయి
ఎవరు పట్టించుకోని తమని అనునిత్యం పలకరించడం, కావ్యగానం చెయ్యడం
అరుదన్నాయి,, అపురూపమన్నాయి
సుమదళాల పరిమళాలు నాపై చల్లి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాయి
ఇలా నన్ను నేను మరిచిపోతుంటే -
ఇంకేం వ్రాయను ప్రణయ కవితలు తప్ప
అర్ధం చేసుకొరూ !!!!!!!!!