18, జనవరి 2018, గురువారం

ప్రతి మనిషి
ఒక గొప్ప స్థానం
నిలుపుకోడానికి
ఉద్దేశించబడ్డాడు
ఈ లోకంలో
ఇంతకు ముందు
ఎవరూ చేయని
ఒక ప్రత్యేక కార్యక్రమానికి
నిర్దేశించబడ్డాడు
అతడికి
ఒక కొత్త సమాజాన్ని
నిర్మించే సామర్ధ్యం ఉన్నా
తన జన్మ సార్ధకం
చేసుకొనే అవకాశం వున్నా
మనిషి
ఈ గొప్ప విషయాన్ని విస్మరించి
స్వార్థంలో చతికిలబడ్డాడు
ఆమె బొట్టు పెట్టుకొంటూ
నన్ను చూచి చిలిపిగా నవ్వింది
ఇది నీ రూపమే సుమా ...
కొంటెగా చెప్పింది
కాటుక దిద్దుకొంటు
వయ్యారంగా ఓరకంట
నను చూచింది
నా కంటి పాపలో నీవే సుమా,
మెత్తగా నవ్వింది
చీర కుచ్చెళ్లు
సరిచేసుకొంటు
చిలిపిగా కసిరింది
అంత తాదాత్మ్యం
పనికిరాదు సుమా
చెంతకొచ్చి మోమును
అరచేతుల నడుమ అదిమి
నుదుటిపై ఒక తీపి ముద్ర వేసింది
చిన్ననాడే
ఆమె నన్ను క లు సు కున్నది
ఒక వన కన్నియగా
తనను తాను పరిచయం చేసుకున్నది
తనతో
పూల వనాల వెంట నడవాలని
చేతిలో చెయ్యి వేయించు కున్నది
చేయిపట్టి
అందరికి దూరంగా తీసుకెళ్ళి
పూలతో గాలితో పుప్పోళ్ళతో
స్నేహం చేయమన్నది
కాలం కసిరిన వేళ నన్ను
తన ఎదలో దాచుకున్నది
జీవితకాలం నన్ను
తన జీవన సహచరునిగా
చేసుకున్నది
ఆమె పెదవిపై వేణువునై
ఆమె ఒడిలో వీ ణి య నై
ఎన్ని విన్యాసాలు చేశానో
ఆమె నుదుట సిందూరాన్నై,
ఆమె సిగలో మందారాన్నై
ఎంత సంతసాన్ని మోశానో
ఆమె అందానికి స్పందించి.
అనుబంధానికి అచ్చెరు వొంది
ఎన్ని కవితలు కావ్యాలు రాశానో
ఆమె కనుసన్నలలో
అక్కడ కాచిన వెన్నెలలో
ఎంత జీవితాన్ని అరబోశానో