10, ఆగస్టు 2020, సోమవారం

 కవితా లతాంతాలు

...13...
పూల
అందాలు పరికించి
గాలి గంధాలు మోసుకెళ్లింది .
.
మధుర
నాదాలు పలికించి
తేటి తేనియలు తీసుకెళ్లింది ..

ప్చ్..
ఇంతలోనే
ఏమీ లేని
దానినయ్యానని
అయ్యో పాపం.
కుసుమం
ఎంతగానో వాపోయింది..

......................

ఆ తోటలో
అడుగు పెట్టానో లేదో

అరవిరిసిన
కుసుమాలు
ఆనందంగా
నన్ను పలకరిస్తాయి ..

అప్పుడే
అటు వచ్చిన
తుమ్మెదలకు

నన్ను
తమను కీర్తించే
కవిగా పరిచయం చేస్తాయి..

 నువ్వు

వెన్నెలవా !
కాదు
ఎలకోయిలవా !-
కాదు కాదు
సుమానివా !!

కాదా !

మరి ..
ఈ కాంతి కిరణాలు
ఇన్ని సంగీత స్వరాలు
ఈ అద్భుత పరిమళాలు
నీ కె క్కడివి
.....

నేనెవరో
నీకు తెలిదా
చోద్యం కాకపోతే --

నీ మానస వినీలా కాశంలో
విహరించే నిండు జాబిలిని

నీ గుండె గూటిలో
నివసించే చిన్నారి కోయిలని

అనునిత్యం
నా నామస్మరణం చేసే
నీకోసం విరిసిన కన్నె కుసుమాన్ని

నేను ..
నీ నెచ్చెలిని..

....బాలకృష్ణారెడ్డి

 ఆలాపనలు- సల్లాపములు

--- 33---

''అందరిదీ ఒక దారి..
అయితే ఉలిపి కట్టెది ఒక దారి అన్నట్టుంది"

"ఉన్నట్టుండి ఈ ఉలిపికట్టె
ఇప్పుడు.ఎందుకు గుర్తుకు వచ్చిందో మా వెన్నెల బొమ్మకి"

"ఎందుకంటే ..
నువ్వు ఉలిపి కట్టెవు కాబట్టి"

"ఏమిటి అంత ప్రేమగా సంబోధించావు ..
ఏకంగా నా మీద ..
పాశుపతాస్త్రమే సంధించావు"

"మరి..
అందరూ వ్రాసే కవిత్వమేమిటి ..
నువ్వు చేస్తున్న దేమిటి"

"అంత తప్పు నేనేం చేశాను"

"ఈ ప్రేమ ప్రణయం ..
అసలు ఈ కవిత్వం నీ కెలా అబ్బింది"

"ఎందుకో నీకు తెలియదా"

"తెలియకనే కదా.. అడుగుత"

"నువ్వేగా...ఎర్రగా బుర్రగా ...
నా ఎదురుగా ఉంటే ఇంకేమి వ్రాయను ?"

"ఆహా ! అలాగా ..ప్రతి దానికీ
నన్ను ఆడిపోసుకోవడం ..
తమరికి బాగా
అలవాటయింది.."

.".అయితే ఈ కవిత విను..
నీకు నిజం బోధపడుతుంది"

"విన్నవించు మహాశయా"
...
****
ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప..

ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ
ప్రణయ సుమ గీతికలు తప్ప..

కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల
చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ
సంచయము తప్ప..

వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల
పద మంజీర మంజుల
సంగీత విభావరి తప్ప..

నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న
ఎలకోయిల

నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో
పొదిగిన ప్రణయాక్షరాల
ప్రసూన మాల ..

******
"అబ్బ ..
కుంభవృష్టి కురిసి
వెలిసినట్టుంది"

"ఇంకా.."

"అప్పటిదాకా..
సాఫీగా సాగి పోతున్న
సెలయేరు ..ఒక్కసారిగా .
కొండకొమ్ము నుంచి కిందకి దూకినట్టుంది ."
.
"ఇం ...కా."

"కారుమబ్బును చూచి
పరవశించిన నెమలి
పురి విప్పి నాట్య మాడినట్టుంది"

'ఇప్పుడు తెలిసిందిగా ..
ఈ కవిత్వం ఎందుకు వ్రాస్తున్ననో..."
.
"తెలిసింది .తెలిసింది .కవిగారు!
మీ ప్రతిభకు జోహారు.."

"ఇంకెప్పుడు
పొరపాటున కూడా
ఇలా పిచ్చి ప్రశ్నలు సంధించకు సరేనా.."

"చిత్తం ..
ఓ ప్రణయకవి గారూ..
మా మంచి దొరగారూ..'"

......బాలకృష్ణారెడ్డి