17, జులై 2012, మంగళవారం

ఒక ఝంకారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది

నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన  గళమెత్తి  గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన 
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది

ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది  

లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన 
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది

ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన 
అధర ప్రాంగణ మొకటి నన్ను అలరిస్తూనే ఉంటుంది

ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని....

అప్పుడప్పుడు  
పచ్చని కొమ్మల్లోకి పారిపోవాలని పిస్తుంది

చిన్నారి కోయిలనై చిగురాకు గుబురుల్లో దూరి
కొత్త కొత్త రాగాలు తీయాలపిస్తుంది

కొండల్ని కోనల్ని పలకరించాలనిపిస్తుంది
గిలిగింతలు పెట్టాలని పిస్తుంది
కొండలపైనుండి దొర్లి సెలఏరులా  గంతు లేయాలని పిస్తుంది 

వేన వేల  మలుపుల్ని వెదుక్కొంటూ
చిరు గాలి తరగల్ని చిమ్ముకొంటు పరుగు తీయాలని పిస్తుంది

మలయానిలమై మలుపు మలుపులో
మధుర కావ్యాలు వ్రాయాలని పిస్తుంది
ఆనంద వాహినిలా ప్రవహించాలని ఉంటుంది

జీవించి ఉన్నంత కాలం
ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని పరవశించాలని ఉంటుంది

చిరునవ్వుకు చెయ్యండి సన్మానం

నేను కవిని కాదు 
రచయిత నసలే కాదు
అక్షరం గురించి అంతగా నాకు తెలియదు    
ఏ  గ్రంధాలు ప్రబంధాలు కావ్యాల పరిచయం లేదు
నాకు తెలిసిందల్లా ఆమె ....
ఆమని అందాలు మోమున చిందు లేయగా
నా జీవన ప్రాంగణం లోకి అరుదెంచిన ఆమె
 
ఆమె చుట్టూ మిరుమిట్లు గొలిపే సౌందర్యం
ఆమె కన్నుల్లో అలవికాని అనురాగం
ఆమె హృదయంలో  నిదుర లేచిన ఆరాధన
 
నా శోధన ఎప్పుడు మొదలయ్యింది
ఇదమిద్ధంగా నాకు గుర్తు లేదు
తోట వాకిట తుమ్మెద ఒకటి
నన్ను దాటుకొని వెళ్తూ కన్ను గీటడం చూసాను
పూల పెదాల పైన అది వ్రాసిన మధుర కవితలు చదివాను
ఏటి గట్టున ఓ రెండు  కంటి పాపలు
ఎదురుగా కూర్చుని నన్నే తాదాత్మ్యంగా గమనించడం చూసాను
అంతలోనే అటుగా వచ్చిన పిల్లగాలి
ఆమె చీర నెగురవేసిన వేళ  రెపరెపల పాట విన్నాను
 
అప్పుడు నేను అలవోకగా పాడుకున్న పాటలు
ఆమె చెక్కిలి మీద చెంప ల పైన చుబుకం మిద  నాసిక పైన
ఏవో మంజుల రాగాలు తొడుక్కొని
ఆమె చిరునవ్వుల  కాంతిలో విహరించడం గమనించాను
నేను వ్రాసిన గీతాలు
ఆమె మోములో నయనాలలో అణువణువులో
కాంతి రేఖలై కర్పూర దీపాలై ప్రకాశించడం కనుగొన్నాను 
 
పుప్పొడి రాలిన చప్పుడు  అతి జాగ్రత్త గా అవలోకిస్తున్న నాకు  
అప్పుడు  అవి కవితలుగా కావ్యాలుగా గీతాలుగా అనిపించలేదు
పున్నమి  వెన్నెలలో జలకాలాడుతున్న నా అంతరంగానికి
అందులో  ఏ గొప్పదనం ఏ మాధుర్యం గోచరించలేదు
 
అందుకే  సౌందర్యం లావణ్యం లాలిత్యం
అనురాగం ఆరాధన పుణికి పుచ్చుకున్న
ఆమె చిరునవ్వుకు చెయ్యండి సన్మానం 
 
ప్రణయ పరిమళాలు ఆ రహస్యాలు తెలుసుకున్న
రస పిపాసులైన మీ గుండె గూటిలో
దాగున్న తారుణ్య భావాలకు చెయ్యండి సత్కారం