21, ఏప్రిల్ 2018, శనివారం

రామచంద్రుడితడు .రఘువీరుడు'
-------------------------------------------
బాలకృష్ణు డితడు భవదీయుడు
లలిత లలిత భావకవిత
సుతి మెత్తగ రాయగలిగే భావుకుడు //
అవని పైకి అరుదెంచిన ఆమని యితడు
అందరి మదిలో వికసించిన బృందావని యితడు
పదపదమున వినిపించే బృందగానము
ఇట్టె ఆకట్టుకొనే రచనా సంవిధానము //
అనవరతము వినిపించే వేణుగాన మితడు
అరవిరిసిన పువ్వులకు ప్రాణనాథు డితడు
అడుగడుగున మంజుల మృదు మధుర భావము //
ఆ చిన్నారి చిలిపి కృష్ణుని నామధేయ మితడు
అలరించిన అలనాటి కృష్ణ శాస్త్రి యితడు
ప్రణయమై ప్రభవించిన కవితామూర్తి యితడు //
(నిలువెత్తు రాముని ఎదుట నేను ఉన్న చిత్రం చూచాక..ఈ గీతం నేనైతే ఎలా వుంటుందో అన్న భావనతో
నేను చేసిన చిన్న ప్రయత్నం ..)
ఆ శ్రీరామచంద్రునికి భక్తీ ప్రపత్తులతో ప్రణమిల్లు తూ ------
మొగ్గ
పువ్వుగా మారుతున్న
దృశ్యం చూస్తున్నాను
సుమ దళాలలోకి
పరిమళాలు 
బిరబిరా చొరబడిన
సవ్వడి వింటున్నాను
సంరంభంతో
ఆ సౌరభాలను మోసుకెళ్తున్న
చిరుగాలి కెరటాల
కేరింతలు గమనిస్తున్నాను
వనమంతా వసంత శోభ
సంతరించు కొంటున్న ఆనందం
పువ్వు పువ్వులో
యవ్వనం చిందు లేస్తున్న
లాస్యం తిలకిస్తున్నాను
ఔను
నాకు ఆశ్చర్యం
ఆ పువ్వుల పరిమళం
నీ నవ్వుకి ఎలా వచ్చింది
ఆ మల్లియ తెల్లదనం
నీ పెదవి పైకి ఎప్పుడు చేరింది
ఆ మకరంద మాధుర్యం
అచ్చట ఎవ్వరు దాచింది
ఇన్ని
సోయగాలు
సరాగాలు
సౌభాగ్యాలు
ఏ పువ్వు నోచింది!
ఒక ధనికుని మరణ భయం... =================
కనులు వాలి పోతున్నవి
దిగులుగా ఉంది
సిరులు ఎదురుగా
గుట్టలుగా పడిఉన్నవి 
బాధగా ఉంది
గుండె ఆగి ఆగి కొట్టుకొంటున్నది
భయంగా ఉంది
ఏమౌతాయి ఈ కలిమి గుట్టలు నిరామయంగా ఉంది
ఎన్ని ఆశలు ..ఎన్ని బాసలు
బ్రతుకు ముగిసి పోతుందా!
నిజం ఎంత చేదుగా ఉంది
అప్పుడే మరణమా
చివరి చరణమా
ఆవేదనగా ఉంది
ఎంత జీవితాన్ని విస్మరించానో,
కొరత వేశానో ఎగతాళిగా ఉంది
జాబిల్లి అందాలు ఇన్నాళ్ళు గుర్తు రాకపోవడం వింతగా ఉంది
ఏమి సాధించానో ఎంత వాదించానో
నన్ను చూస్తే నాకే జాలిగా ఉంది
నేను మనిషినన్న విషయం
మరణం ఉంటుందన్న నిజం కొత్తగా ఉంది
కళ్ళు మూతలు పడుతున్నవి
మత్తుగా వుంది
నాకు మరణమా
వినడానికి గమ్మత్తుగా ఉంది
సందేహం లేదు
మరణం ఆసన్నమౌతోంది
శ్వాస వేగం తగ్గింది
చూపు మందగించింది
ఇంకెన్ని క్షణాలో..
అనుమానంగా ఉంది
అరే .! ఇదేమిటి..
ఎవరూ..వెక్కి వెక్కి ఏడవడం లేదు ఆశ్చర్యంగా ఉంది
ఆర్జించిన అనంత సంపద
ఎదురుగా దిగులుగా ఉంది
అనురాగం అనుబంధం
ఎప్పుడెప్పుడా అన్న ఆనందంలో ఉంది
ఎందుకొచ్చానో ఈ భూమి మీదకి
అని ఇప్పుడనిపిస్తోంది
ఎప్పుడూ లేనిది,ఎందుకో మరి
లేమి మరింత అందంగా కనిపిస్తోంది
గుండె ఆగిపోతున్న చప్పుడు
ఆగిఆగి వినిపిస్తోంది
యముని మహిషపు
లోహపు గంటల మోత
భయ పెడుతోంది
అరె - ఏమయింది
ఎందుకు ఈ పగలు
నిసిరేయిలా ఉంది
కమ్ముకొస్తున్న హాయిలా వుంది
అ ర్ధ మ యిం ది...............
నేను మరణించి కొంతసేపయింది