29, జూన్ 2018, శుక్రవారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది
నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన గళమెత్తి గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది
ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది
లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది
ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన
అధర ప్రాంగణ మొకటి నన్ను కరుణిస్తూనే ఉంటుంది
నిన్ను చూచి ఆకాశం.
తన నుదుట తిలకం దిద్దుకున్నది
నిన్ను మెచ్చి మధుమాసం
తన నడకను నీ దిశగా మార్చుకున్నది
నిండు పున్నమి దరహాసం
నీ ఆధరాన చేరి
ఆనంద తాండవం చేస్తున్నది
గాలికి ఎగిరిన
నీ కురులను చూచి
నీలి నింగి వంగి వంగి
వందనాలు చెబుతున్నది
నీ సౌందర్యదీప్తిని గని
మల్లె ముందారం సన్నజాజి
మూతి ముడుచుకుంది
ఇన్నిన్ని వన్నెల చిన్నెల
సోయగాల చెలువములు తిలకించి
ప్రకృతి నీకు ప్రణామం చేస్తున్నది
ఒక వాన పాట..
----//------
ఒక చినుకు
పలికింది ఓంకారం
ఒక చినుకు
అలదింది సిందూరం
ఒక చినుకు
చుట్టింది శ్రీకారం
ఒక చినుకు
మీటింది సింగారం //
పెదవిపైన
పడిన వాన గానమాయెను
అది గుండెపైన
జారగనే జాతరాయెను
నడుము పైన
పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన
మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి
తనువంతా బృంద గానమై
కనుల ముందు
బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి
తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి
పరుగిడగా వనము నవ్వెను
తనువంతా
తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి
మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే
గాలివాన ఆగిపోయెను
ఆదమరచి
మనసు వీణ మూగవోయెను //