మంగళవారం 29 మే 2012

రాత్రి ఓ అభినేత్రి

రాత్రి
ఓ అభినేత్రి
నాకలలోకొచ్చి
ఓ అభియోగం  చేసింది
దురభి ప్రాయంతో
నామీద నీలాపనింద వేసింది
కొన్నిఅక్షరాలు కూర్చి
తన గురించి
ఓ కావ్యం వ్రాయమంది
కొత్త రాగాలు సృష్టించి
తన సౌందర్యం
రాగ బద్ధం చేయమంది

నేను నవ్వాను
నా ఎదలోని
మువ్వల సడి
వినమన్నాను
నా మనసులోని
మల్లెల పరిమళాలు
నా కనుసన్నలలోని
వెన్నెల పరవళ్ళు
ఆమె అసమాన
సౌందర్యంతో కలగలిపి
కుప్పలు తెప్పలుగా
నేను వ్రాసిన వేల కావ్యాల్ని
ఆమె మ్రోల రాసులుగా పోశాను

ఆపై
విప్పారుతున్న
ఆమె రెప్పల్లో
పుప్పొడి రాగాలు చూశాను

వెన్నెల ప్రవాహం ఒడ్డున

హంస గమనమ్ముతో
హరిణ నయనమ్ముతో
మందహాస మధురాధరమ్ముతో
నువ్వు కదలి పోతుంటే
జంటగా వస్తున్న నాకు
వెన్నెల ప్రవాహం ఒడ్డున
నడుస్తున్న భావన
సమ్మోహనంగా నా చుట్టూ
పరిమళాల వాన

అప్పుడప్పుడు
నీ అరమోడ్పునయనాలు
నావంక  నెలవంకలౌతు
నిలువెల్లా నీ  అందాలకు
నేనాశ్చర్యంతో తల మునకలౌతు
ఈ ప్రయాణం ....
ఒక జీవిత  కాలం కాకూడదా!
 నాలో  గాఢమైన  నిట్టూర్పు

హఠాత్తుగా ఆలింగనంలో ఒదిగి
సుకుమార హస్తాలు  నన్నల్లుకోగా
నీ నీలి నయనాలు ఆర్ద్రం కాగా
ఏమిటి ఏమిటి !!
నీ ఎర్రని పెదవులు విచ్చుకొని
వెలువడ నున్న తీర్పు
ఏమది ప్రియతమా ?

పెదవులపై ఒక గీతం

ఎవరయ్యా నువ్వు 
విరిశరములు నాపై
ఎందుకు సందిస్తావు
ఇరు మేనులు చెరి సగమని
బిగి కౌగిలి బందిస్తావు 
అది ఏమని నిలదీయగా 
చిరు నవ్వులు  చిందిస్తావు//
 
పెదవులపై  ఒక గీతం
         రచియిస్తావు
నిదుర రాని కలలోనికి 
         నడిచొస్తావు 
శివుని విల్లు అలవోకగ 
         విరిచేస్తావు
చిలిపి తలపు తెర దీయగ
 మది వీణను సవరిస్తావు //
 
నిలువెల్లా నెలవంకలు
         వెలిగిస్తావు
తనువంతా చిరు చెమటలు
          తరలిస్తావు
ఉపిరిలో  ఉప్పెనలే
         రగిలిస్తావు 
తగదయ్యా ఇది అంటే
        నవ్వేస్తావు //