1, ఏప్రిల్ 2012, ఆదివారం

ఆక్రందన

దేశం కన్నీరు పెడుతోంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తోంది
ధర్మం దుఖితమతియై రోదిస్తోంది
న్యాయం తన ఉనికి ఎక్కడో శోధిస్తోంది
పాపం ప్రపంచ మార్గమై పయనిస్తోంది

అఖండ శేముషి ఆర్జించిన మనిషి
తనవేషం మార్చుకొన్నాడు
శిరీష కుసుమ పేశలమైన మనసునిండా
మోసం ద్వేషం పేర్చుకొన్నాడు
సత్యం నీతి నియమం విస్మరించి
నిత్యం వేటాడడం నేర్చుకొన్నాడు

కులం మతం ఒక్కటైన కాలం
అందరు అన్నదమ్ములై వెలిగిన దశాబ్దం
ఊరు మొత్తం ఒక కుటుంబమైవర్ధిల్లిన స్వర్ణ యుగం
ఎక్కడో చరిత పుటల్లో దాగి పోయింది
మానవుడు మాధవుడుగా మారిన మహర్దశ
అక్కడెక్కడో ఆమడల దూరాన ఆగిపోయింది
ఒకరినొకరు ఆదుకొన్నసంఘటనలు
పరస్పరం ఒదార్చుకొన్నసన్నివేశాలు
కాశీమజిలి కధలుగా మిగిలిపో యాయి

అడుగడుగునా వాడ వాడలా ఎదురౌతున్న
నరకాసురులు, బకాసురులు, కీచకులు
హంతకులు ,నయ వంచకులు, పరాన్న భుక్కులు
ఎవరు వీళ్ళు !ఏకాలం వాళ్ళు! ఏ యుగం వాళ్ళు ?

ఏ గుండె తలుపు తట్టినా ఎండమావుల కల కూజితం
ఏ మనిషిని తట్టి చూచినా కనిపించే ఆకలి కీకారణ్యం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి