17, జులై 2012, మంగళవారం

ఒక ఝంకారం

ఎప్పుడు నా హృదయంలో
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది
ఎల్లవేళలా నా మదిలో
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది
నిరంతరం హాయిగొలిపే
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది
హృదంతరంలో నిరంతరం
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది

నా పాటలు నేర్చిన ఎలకోయిల
తన  గళమెత్తి  గానం చేస్తూనే ఉంటుంది
నన్నల్లుకున్న సిరి వెన్నెల
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది
విశాల నయనాల చిప్పిలిన 
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది

ఉప్పెనలా ఎగిసి పడిన
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది  

లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది
కాలి అందియలు సందడించిన 
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది

ఆదమరచి ఆర్తితో అల్లుకున్న
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది
మధురరాగాలు అవధరించిన 
అధర ప్రాంగణ మొకటి నన్ను అలరిస్తూనే ఉంటుంది

ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని....

అప్పుడప్పుడు  
పచ్చని కొమ్మల్లోకి పారిపోవాలని పిస్తుంది

చిన్నారి కోయిలనై చిగురాకు గుబురుల్లో దూరి
కొత్త కొత్త రాగాలు తీయాలపిస్తుంది

కొండల్ని కోనల్ని పలకరించాలనిపిస్తుంది
గిలిగింతలు పెట్టాలని పిస్తుంది
కొండలపైనుండి దొర్లి సెలఏరులా  గంతు లేయాలని పిస్తుంది 

వేన వేల  మలుపుల్ని వెదుక్కొంటూ
చిరు గాలి తరగల్ని చిమ్ముకొంటు పరుగు తీయాలని పిస్తుంది

మలయానిలమై మలుపు మలుపులో
మధుర కావ్యాలు వ్రాయాలని పిస్తుంది
ఆనంద వాహినిలా ప్రవహించాలని ఉంటుంది

జీవించి ఉన్నంత కాలం
ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని పరవశించాలని ఉంటుంది

చిరునవ్వుకు చెయ్యండి సన్మానం

నేను కవిని కాదు 
రచయిత నసలే కాదు
అక్షరం గురించి అంతగా నాకు తెలియదు    
ఏ  గ్రంధాలు ప్రబంధాలు కావ్యాల పరిచయం లేదు
నాకు తెలిసిందల్లా ఆమె ....
ఆమని అందాలు మోమున చిందు లేయగా
నా జీవన ప్రాంగణం లోకి అరుదెంచిన ఆమె
 
ఆమె చుట్టూ మిరుమిట్లు గొలిపే సౌందర్యం
ఆమె కన్నుల్లో అలవికాని అనురాగం
ఆమె హృదయంలో  నిదుర లేచిన ఆరాధన
 
నా శోధన ఎప్పుడు మొదలయ్యింది
ఇదమిద్ధంగా నాకు గుర్తు లేదు
తోట వాకిట తుమ్మెద ఒకటి
నన్ను దాటుకొని వెళ్తూ కన్ను గీటడం చూసాను
పూల పెదాల పైన అది వ్రాసిన మధుర కవితలు చదివాను
ఏటి గట్టున ఓ రెండు  కంటి పాపలు
ఎదురుగా కూర్చుని నన్నే తాదాత్మ్యంగా గమనించడం చూసాను
అంతలోనే అటుగా వచ్చిన పిల్లగాలి
ఆమె చీర నెగురవేసిన వేళ  రెపరెపల పాట విన్నాను
 
అప్పుడు నేను అలవోకగా పాడుకున్న పాటలు
ఆమె చెక్కిలి మీద చెంప ల పైన చుబుకం మిద  నాసిక పైన
ఏవో మంజుల రాగాలు తొడుక్కొని
ఆమె చిరునవ్వుల  కాంతిలో విహరించడం గమనించాను
నేను వ్రాసిన గీతాలు
ఆమె మోములో నయనాలలో అణువణువులో
కాంతి రేఖలై కర్పూర దీపాలై ప్రకాశించడం కనుగొన్నాను 
 
పుప్పొడి రాలిన చప్పుడు  అతి జాగ్రత్త గా అవలోకిస్తున్న నాకు  
అప్పుడు  అవి కవితలుగా కావ్యాలుగా గీతాలుగా అనిపించలేదు
పున్నమి  వెన్నెలలో జలకాలాడుతున్న నా అంతరంగానికి
అందులో  ఏ గొప్పదనం ఏ మాధుర్యం గోచరించలేదు
 
అందుకే  సౌందర్యం లావణ్యం లాలిత్యం
అనురాగం ఆరాధన పుణికి పుచ్చుకున్న
ఆమె చిరునవ్వుకు చెయ్యండి సన్మానం 
 
ప్రణయ పరిమళాలు ఆ రహస్యాలు తెలుసుకున్న
రస పిపాసులైన మీ గుండె గూటిలో
దాగున్న తారుణ్య భావాలకు చెయ్యండి సత్కారం

ఒక సాయంకాలం

పచ్చని తివాచి
పరచినట్టు పంట పొలాలు
ఆ పొలాలను
పలకరించే నీలి మేఘాలు
ఆ మేఘ రాగాలు
సంతరించుకున్న నింగి నీలాలు

సాయం సంధ్య వేళ
ఏటి పాయల వెంట
ఒంటరిగా నడుస్తుంటే
ఆప్యాయంగా పాదాలను
పలకరిస్తూ అలల గుసగుసలు

పరిసరమంతా
ఆహ్లాదంగా ప్రకృతి  దృశ్యాలు 
మనసంతా 
మల్లెలు చల్లినట్టు పారవశ్యాలు  

పరికించి చూశాను

అక్కడ  చిత్తరువులా
నీ ఆకృతిలో ఒక పచ్చని తరువు
ఆకాశంలో
నీ రూపు రేఖా విలాసాలతో
ఒక మేఘ శకలం

అంతలో ఆశ్చర్యంగా 
చిరు  నవ్వులు చిందిస్తూ
నా ముందర నిలుచున్న
ఒక ఇంద్ర ధనుస్సు

అదేమిటో
చిత్రంగా సర్వాంతర్యామిలా
ప్రకృతి ఒడిలో
ఎక్కడ చూచినా నీ ఆకృతులే

ఆ మూగ చూపులో

ఆ మూగ చూపులో
అయస్కాంతాలు
ఆ కొంటె నవ్వులో
రహస్య సంకేతాలు

ఆ చిలిపి పెదవిలో
మేలుకొలుపులు
ఆ మేని విరుపులో
మేఘ గర్జనలు

అంతలోనే అమాయకంగా
ఎవరో నీవను భావనలు
నా మది నిండా జల్లులుగా
కురిసిన ఆమనులు

ఎప్పుడో గాని భువి గుర్తొచ్చి
దివి దిగిన సౌందర్యం
ఎదురుగా నిలిచి
నను  మైమరపించిన  లావణ్యం 

పూచిన లతవై -నా
గుండె ఉప్పొంగిన కవితవై
నిదుర రాని కలతవై 
నా దేవతవై ........

ఆశ్చర్యం

ఏ నృత్యం నేర్చుకోలేదు నేను
అయినా నా మనసు చేస్తున్నది ఆనంద తాండవం 
ఏ నాట్యం ఎరుగను నేను
నా  అణువణువు చేస్తున్నది మనోహర నర్తనం
ఏ పులకింతలకు నోచుకోలేదు నేను
మరి ఏలనో నా మేనిలో ఈ మృదు మధుర లాస్యం
కనీసం చిందులు వేయడం సైతం తెలియదు నాకు
మరి ఎలా వచ్చెనో ఈ అద్భుత నటనా కౌశలం

నిజం చెప్పనా !
అసలు విషయం  చెప్పనా
అది నీవు నాలో చేరి
రేకెత్తించిన కేళీకలాపం
దరి చేరగా, నేను నీవుగా మారగా
ప్రభవించిన ప్రణయ లీలా వినోదం

నవ్వితే చాలు

నవ్వు నవ్వు నవ్వూ
చెంపలు  ఎరుపెక్కేలా
చామంతులు అరవిచ్చేలా
చందమామ ఇంకేలా
అని అంతా అనుకొనేలా....
హాయిగా నవ్వు
తీయగా నవ్వు //

నవ్వితే చాలు -నరాలు
వీణ తీగలై మోగాలి
నవ్వితే చాలు -స్వరాలు
రాగ  ధారలై సాగాలి

నవ్వితే నడుముకు
నటనలు రావాలి
నవ్వితే నడకలు
తడబడి పోవాలి //

కొమ్మల్లో కోయిల
కొత్త పాట పాడినట్టు
నింగిలోన జాబిలి
మత్తుగా మాటాడినట్టు

మొగ్గల్లో మందారం
ఒళ్ళు విరుచు కొన్నట్టు
బుగ్గల్లో సిందూరం
మొగ్గ తొడిగినట్టు//

గుండె మనసు సంవాదం

గుండె నిలదీసింది
ఎన్నాళ్ళు ఈ ఒత్తిళ్ళు అని
మనసుకు చివుక్కుమంది
 
నేనేం చేయను నా బాధ నీకేం తెలుసు
మనసు ఉసూరుమంది
నీకేం... బాదే సౌఖ్యమనే భావన నీది
నేనే విపరీతంగా  కొట్టుకోలేక చస్తున్నాను
నిజంగానే చచ్చేట్టున్నాను
 
నీ చావు నీది నా గోడు నాది మనసు పరితాపం
నేను  గుటుక్కుమని  ఆగి పొతే
నీ బొంద నువ్వేమి ఆలోచిస్తావు
 
ఔను కదూ  
అంతే కాదు
ఈ మనిషిని చూడు
తాగి తూలుతున్నట్టు ఎలా వూగిపోతున్నాడో
కొంపదీసి పోడు గదా,  నా నడక ఆగిపోదు కదా
చచ్చేంత భయమేస్తోంది
అన్నిటికి నీ చేతలే మూలకారణం
 
ఏంచెయ్యమంటావు మనసు దిగులుగా అంది
విపరీత మైన ఆ ఆలోచనలు చాలు, ఇక ఆపు
జీవించాలనే ఆశలు కొన్నైనా మేలుకొలుపు
మనం ఇద్దరం నాలుగు కాలాలు బ్రతికుంటాం
 
మనసు ఆలోచనలో పడింది
గుండె స్థిమిత పడింది

15, జులై 2012, ఆదివారం

కెవ్...................

A frog asked an astrologer
''pl. tell my future''
''A young smart girl will touch you ''
''Vow  when and where ! ? ''
''Next semistar  .... in biology  lab....  ''


ఓ కప్పు జ్యోతిష్యుడిని  ఆసక్తిగా అడిగింది
''నా భవిష్య వాణి వినిపించండి స్వామి ''

''త్వరలో నిన్నో అందమైన అమ్మాయి పలకరిస్తుంది''

''ఓహ్ ... ఎప్పుడు ఎక్కడ '' మండూకం గుండెల్లో   పట్టలేని ఆనందం

''రానున్న సెమిస్టర్ లో బయాలజీ ల్యాబ్ లో ......''

''.........................''

13, జులై 2012, శుక్రవారం

గాయాలు

Every one in your life will hurt you today or tomorrow ,
but you have to decide what is more important the pain or the person ....
 
ఏదో ఒకనాడు
ఎవరో ఒకరు
ఎప్పుడో ఒకప్పుడు
ఎందుకో ఒకందుకు
నిన్ను నిందించిన వారే
అస్త్రాలు సంధించిన వారే 
శూలాలతో గుచ్చిన వారే 
ఏదో వంకలతో  శంకలతో
నిన్ను వేధించిన వారే
 
ప్రతి దానికి ఉలికి పడకు
పగ ద్వేషంతో రగిలి పోకు
కట్టెదుట ఉన్నది కర్తవ్యం
కను చూపు మేరలో ఉన్నది గమ్యం 
 
కాలం  గాయాల్ని మాన్పుతుంది  
లోకం సత్యాన్ని గ్రహిస్తుంది
 
 

ముద్ద మందారం

గుండెలోన దూరి గువ్వల్లే ఒదిగావు
మత్తిలిన కళ్ళతో  ఒత్తిగిలి పడుకున్నావు
నల్లని ముంగురులు అల్లన నిమరగా
అలవోకగా కనురెప్ప లెత్తి అల్లరి చూపులు రువ్వావు
ఏదో చెప్పాలని కదిలీ కదలని పెదవులు
'అర్ధం కాలేదా '
చిలిపిగా నును లేత నవ్వులు

ఎన్నాళ్ళయిందో ఈ దృశ్యం చూచి
ఎంత కాలమయిందో రహస్యాలు దాచి
మెత్తని అణువుల హాయి కొత్తగా వుంది
చిలిపి చిలిపి తలపులతో రేయి మత్తుగా వుంది

ముంగురులు సవరిస్తున్న అంగుళులు   
అంగుళుల నలరిస్తున్న ముంగురులు
ముద్దు మోమును కప్పుకున్న తీరు
మునిమాపు వేళ మురిపాల సెలయేరు

ఎందుకా చిలిపి నవ్వు
ఇంతకీ ఎవరు నువ్వు
నన్నుడికిస్తూ ఊరిస్తూ వారిస్తూ 
నా చెంపపై కురులను ఆడిస్తూ
ఏనాటి చెలిమి ఇది
ఎంత గొప్ప కలిమి ఇది
మేఘాల తెర తొలిగి నిండు చందురిని వెలుగు

పెదవి కెదురైన పెదవి
ఎన్ని కావ్యాలు రచించిందో 
ఎదలోన ఒదిగొదిగి ఎన్ని గీతాలు పాడిందో
సుందర సురుచిర పధాల వెంట ఎంత హాయి సంచరించిందో
ఒక్కపరి ఉక్కిరి బిక్కిరై గుండెల్లో దూరి
ఎన్ని సంచలనాలు ఎన్ని సంభ్రమాలు
ఇంత గొప్ప అనుభూతిని  ఇన్నాళ్ళు ఎంతగా కోల్పోయానో
ఇక్కడ కురుల మధ్య చిక్కుకున్న చక్కని లావణ్యాన్ని నును లేత చెంపల్ని 
సున్నితంగా సుతారంగా నాశికతో పలకరిస్తుంటే ఎంత హాయి

'ఏమిటి మాటాడవు 
మాటకన్నా మౌనం గొప్పదనా
ఎందు కీ కన్నీళ్ళు,  కన్నుల్లో స్వచ్చ మైన నీలాలు
ఎంతసేపని అలా చూస్తావు
చిలిపి ప్రశ్న
కాలం పరుగెత్తుతోంది
కాలాన్ని జయించాలి
నిదుర  మరచి తదేకంగా యుగాలు గడపాలి

 'అంటే నిర్నిద్రనా '

' కదా మరి'

' ఎంత కాలానికి దొరికావు, ఆణిముత్యానివి '

'ముత్యాన్నా'

'ముద్దమందారానివి కూడా ' 

12, జులై 2012, గురువారం

నీలాల ఆ గగనం

నీలాల ఆ గగనం
నీ నడుమును వలచింది
నిండైన నీ రూపం
నా ఎదురుగ నిలిచింది //

నీలోని సోయగమంతా
రారమ్మని పిలిచింది
మేనిలోని ఈ సింగారం
ఎవరమ్మా మలచింది

బిగి కౌగిట ఈ రేయి
బింబాధరమయ్యింది
అంతలోనే తెలవారి
అరుణోదయ మయ్యింది

మరు నిముషం ఆ చూపే
మలయానిలమయ్యింది
చిలిపి చిలిపి నీ పిలుపే
కలకూజిత మయ్యింది //


నీలి నీలి కన్నులలో
మందిరాలు కలవేమో
ఆ పసిడి వన్నెలలో
నందనాలు నెలవేమో

పూచిన ఆ విరులన్ని
తొలిరేయి కొరకేమో
దాచి ఆ సిరులన్నీ
దోచుకొనే దొరకేమో

మన ఇద్దరి అనుబంధం
అంతా ఒక కల ఏమో
ఇద్దరిలో ఈ మౌనం
ఇది కలవరమేమో //


మనసేమో మరుమల్లె వంటిది

మనసేమో మరుమల్లె వంటిది
వయసేమో హరివిల్లు వంటిది
మరిచి పోకు మనసుని
మరిచి పోకు వయసుని
మరువబోకు ఓ మనసా
జీవితమే చిరు జల్లు వంటిది
జీవనమే పొదరిల్లు వంటిది //

మనసు మరిచి పోయావా
తెలియలేవు సుగంధాలు
వయసు మరిచి పోయావా
మరలి రావు వసంతాలు
కలలు నిజం చేసుకున్నావా
దిగి వచ్చును దిగంతాలు //

ఒకరికొకరు తెలియదులే
ఒంటరిగా నువ్వుంటే
వలపు పల్లవించదులే
కలలేవి  రాకుంటే
బ్రతుకు పరిమళించదులే
బంధాలే లేకుంటే   //

ఎవరు నీవు ఎవరు నేను

ఎవరు నీవు  ఎవరు నేను
ఎద గదిలో నీ రూపం దాగున్నది
ఎందులకో మరి కదల లేను
మన స్నేహం కడలి  కెరటం  లాగున్నది
ఎంత నిదుర కాచినదో  మది
పురిటి నొప్పులు పడి కమ్మని కలగన్నది 
ఎంత క్రూరమైనదో ఆ విధి 
యింక ఈ సయ్యాటకు సెలవన్నది 
ఎన్నాళ్లీ  కన్నీళ్ళని 
గుండెలోని ఎండమావి అనుకున్నది
ఏరువాక కానరాక
ఎందుకు బ్రతుకని ఒక చినుకను కున్నది