28, మార్చి 2012, బుధవారం

చిలిపి దొరగారు

రమ్మన్నది ఎవరో
పెదవి ఇమ్మన్నది ఎవరో
పద పద మన్నది ఎవరో
నిదుర వలదన్నది ఎవరో
ఎదలో దాగిన దెవరో
కమ్మని కధగా
కరిగి కరిగి పొమ్మన్నది ఎవరో //


దొంగ చూపుల దొరగారు
బుంగ మూతి పెట్టారు
దరికి రాను పొమ్మంటే
అందంగా అలిగారు
కొంత అలుసు ఇచ్చామా
చెలరేగి పోతారు //


కురుల మబ్బులో దాగారు
కొసరి కొసరి అడిగారు
పాపం తలిచా మంటే
ఒక్క దానితో పోనీరు
ఉక్కిరి బిక్కిరి చేస్తారు
ఊపిరాపి వేస్తారు //

చెంపపైన ఒకటంటారు
కెంపు లన్ని ఏవంటారు
చెక్కిలి అందించామా
చుక్కలు లెక్కిస్తారు
ముక్కు పిండి నవ్వుతారు
మొక్కులన్ని తీరుస్తారు //

మెరుపు తీగ

మెరుపు తీగ నేల పైకి దిగి వచ్చిందా
కొండ వాగు అడవి దాటి నడిచొ చ్చిందా
అంతలోనె మందారం అర విచ్చిందా
అవనిలోని సింగారం శిర సొంచిందా//

తనువంతా సిరి వెన్నెల అలదు కొన్నది
నిలువెల్లా సిందూరం చల్లుకొన్నది
కలువలనే కన్నులుగా చేసుకొన్నది
చీకటినే కాటుకగా దిద్డుకొన్నది //

రతనాలనుముత్యాలను రాసి పోసిరో
తేనియతో తీవలతో మూస చేసిరో
ఇన్నాళ్లుగ పరువాలను ఎచట దాచిరో
ఈ బొమ్మను ఇంతకాల మేమి చేసిరో //

కొండ గాలి తిరిగింది ఆమె రాకతో
చంద్రవంక జరిగింది ప్రేమ లేఖతో
నీలి నింగి వంగింది కాంతి రేఖతో
పడుచుదనం నవ్వింది ఏరువాకతో //

కల కోసం

కంటి రెప్ప దుప్పటిలో
ముసుగుతన్ని పడుకున్నావా
మసక మసక వెలుతురులో
మగత లోన ఉన్నావా
ఓ అపరంజి స్వప్నమా
ఓ అరుదైన స్వర్గమా//

చేయి పట్టి చెలిదాకా
నడిపించే జాణవు నీవు
ఆదమరచి ఒడిలోన
శయనించే వాడను నేను
ముంగురులే మోమున జారి
ముసురుకున్న మబ్బులలోన
విహరించే వాడను నేను
నన్ను మరిచి, అన్ని మరిచి //

పెదవి పైన వేలుంచి
ఎన్ని ఊ సులాడానో
నడి రాతిరి గాలించి
ఎన్ని సార్లు వేడానో
నిదురరాదు ఈ రేయి
నీ జాడే కనరాదోయి
నీ తోడే లేకుంటే
నా జీవితమే నిశిరేయి //

ఎలకోయిల గానం

వేల వేల గానాలు
వెదురు పొదలలో ఉన్నాయి
కోటి కోటి రాగాలు
కొమ్మ గూటిలో ఉన్నాయి
ఎవరికైనా తెలుసా
ఎలకోయిల గీతాలన్నీ
నా ఎద లోగిలిలో ఉన్నాయి //

నాకంటి పాపలోన
మురళీరవముంది
నా పెదవి అంచులోన
వేణు గానముంది
నానడుము వొంపులోన
వీణ దాగి ఉంది
ఎంచి ఎంచి చూసావా
నిలువెల్లా పిల్లనగ్రోవిగ మారింది //

ముద్దు ముద్దుగా నవ్వానా
అది మోహనరాగం
మోవి మోవి కలిపానా
అది జీవనరాగం
తీగ లాగ అల్లుకుంటే
అది కుసుమ పరాగం
అందమైన జీవిత మంటే
అది సరిగమ పదనిసరాగం //

26, మార్చి 2012, సోమవారం

ఔరా తుమ్మెదా !


అక్కడక్కడా చందన పరిమళం
అప్పుడప్పుడు పుప్పొడి పరిచయం
ఏమి నోము నోచావే తుమ్మెదా
అలవికాని ఆనందం నీదేకదా //

నీవేమో ప్రేమతెలియని దానవు
ఈ నిజము సుమా లెరుగవు పాపము
కవ్వించి బులిపించి ఎగురుతావు రెక్కలతో
రెక్కలతో మక్కువతో రేకులపై సంచారం
లెక్కకు మించి పూలతో ప్రేమాయణం //

ఎరుపెక్కిన చెక్కిలితో
ఎదురు చూచు కన్నులతో
వేల ఎదురు తెన్నులతో
ఏమి కధలు అల్లావో
ఎన్ని కబుర్లు చెప్పావో
ఏమి నోము నోచావో తుమ్మెదా
అలవికాని ఆనందం నీదే కదా//

21, మార్చి 2012, బుధవారం

నేను చూశాను

నేను చూశాను
తల్లి మరణాన్ని
కళ్ళారా చూచిన
ఓ చిట్టి తల్లి
ఆ దారుణ సంఘటనని
గుడ్ల నీరు కుక్కుకొంటూ
న్యాయస్తానంలో
వివరిస్తున్న దృశ్యాన్ని

నేను చూశాను
ఓ మృగం బారిన పడి
సగం కాలినదేహంతో
జీవితం పైనవిరక్తితో
నోట మాట రాక
న్యాయదేవత ఎదుట
శిలా ప్రతిమలా
స్థాణువైన ఇల్లాలిని

ఎవ్వరి కోసం

మోము సుప్రభాతం
మోవి మౌనగీతం
మనసున వెన్నెల మాసం
మనసా అది ఎవ్వరి కోసం

20, మార్చి 2012, మంగళవారం

ఉగాది గీతం

జాతి సంపద ఎంత వృధా అయ్యేనో కదా
భావి మేధస్సెంత నిస్సారమయ్యేనో కదా
వందేళ్ళ సెంచరీల క్రికెటాట వలన
జనమంత సోమరులై వీక్షించుట వలన

ఎన్ని మమతాను రాగాలు మసి అయ్యేనో కదా
ఎన్ని రాగ బంధాలు కనుమరుగయ్యేనో కదా
ఏలిన నాటి శనివోలె నట్టింట కొలువైన
బుల్లి తెర చిత్ర విచిత్ర హింసల విన్యాసాల వలన

ఎంత జీవన రాగం నేల పాలయ్యేనో కదా
ఎంత వెన్నెల కాంతి అంతర్ధాన మయ్యేనో కదా
సుఖ సంతోషాలు మరిచి ఆలు బిడ్డల మరిచి
ఎల్ల వారిని మరిచి వెర్రిగాఈ మనిషి
ఎండమావుల లోన సంచరించుట వలన

ఎన్ని ఇడుముల పాలయ్యేనో కదా
ఎన్ని కడగండ్లు తోడయ్యేనో కదా
ఎదురై న మనిషిని కరకర నమిలేసి
ఎనలేని ఆశతో లంచాలు భోంచేసి - కడకు
ఉన్న ఉద్యోగ మొకటి ఊడీ పోవుట వలన
కారాగారమందు చేరి పోవుట వలన

ఎంత ఓజస్సు ఆవిరై పోయెనో కదా
ఎంత తేజస్సు మాటు మాయమయ్యేనో కదా
మాయదారి సారా తాగి రేయింబవళ్ళు
గమ్మత్తుగా మత్తులోన మునిగి తేలుట వలన
ముంగిటిలో మృత్యు నర్తనమ్ము వలన

ఎంత మానవత ధ్వంస మయ్యేనో కదా
ఎంత నాగరికత దగ్ధ మయ్యేనో కదా
నరునిలోని నరుడు కనుమరుగౌట వలన
అంతులేని ఆశ అంతరంగాన చెలరేగి
ప్రేమానురాగాలు అంతరించి పోవుట వలన

ఎన్ని యుద్ధాలు ఎన్ని అబద్ధాలు
ఎన్ని అసత్యాలు ఎన్ని అవినీతి కృత్యాలు
ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని రాద్ధాంతాలు
ఎన్ని భయాలు ఎన్ని సందియాలు
ఎన్ని దిగుళ్ళు ఎన్ని నెగళ్లు

ఏ గౌతముడు తిరిగి వస్తాడు
మానవతా మందిరాలు ఈ నేలపైన నెలకొల్పగా
ఏ గాంధీ మరలా జన్మిస్తాడు
అహింసా శాంతి సందేశాలు జాతికి వినిపించగా

ఏ ఉగాది అయినా ............
వసంతాన్ని కొని తెస్తుందా, కోయిల పాటలు వినిపిస్తుందా
ఏ కాలానికైనా ఈ అంధకార యుగం అంతరిస్తుందా
ఏనాటికైనా సరి కొత్త యుగం ఇలపైన అవతరిస్తుందా
ఏ నవ యువ గీతమైనా జాతి జాతకం మారుస్తుందా
ఏ చైతన్యా రావమైనా జాగృతి జయ కేతనం ఎగుర వేస్తుందా

17, మార్చి 2012, శనివారం

పరువాల తోట

వరమొకటి కోరింది తుమ్మెద
మరు జన్మలో అయ్యింది పయ్యెద
మదనుడికి వచ్చింది ఒక ఆపద
వర్ణించగా నాతరమా ఆ మధుర గాధ//

సిరి వెన్నెలలన్ని పోగుపడిన వచ్చట
సిందూరం చెప్పింది ఒక చిన్న ముచ్చట
మరుమల్లె మందారం ఒకటైన పాట
అది అందంగా పూచిన పరువాల తోట

అక్కటక్కటా ! ఆ తోట వాకిట
ఎన్నెన్నో పడిగాపులున్నాయట//

సోయగాలు సౌరభాలు ఎన్ని ఉన్ననూ
సుమకోమల సుందర మందిరాలు ఎన్ని ఉన్ననూ
అన్నన్నా విన్నారా ఆ వింత విఢ్దూరము
ఆ పసిడి వన్నెల దే చిన్నెలదే అగ్ర తాంబూ లము

అరరే ! ఇది నిధి నిధానమా
చిత్ర విచిత్ర విధి విధానమా //

అనురాగ సంగమం

నది పెదవిని తాకాలని
కడలికి ఆరాటం
కడలి కౌగిలి చేరాలని
సెలయేటికి ఉబలాటం
ఆ సంగమ భంగిమ చూడాలని
నింగికి నేలకు ఆర్భాటం //

గిరి శిఖరాలెన్ని ఎగిరి దూకిందో
జలపాతాలై జలకాలాడిందో
తరుశాఖల తలలెన్ని నిమిరిందో
మెలికలు తిరిగి అలుకలు పోయిందో

వేయి పాయలుగా మారినది
బడలి ఒడిలో చేరినది
కడకు అందుకున్నది
కడలి అభివందనం //

అలల కలలెన్ని ఆమనులైనాయో
అరిగిన రాళ్ళేన్ని రతనాలైనాయో
ఆ గలగలలెన్ని జీవన జలలైనాయో
ప్రాణ నాడులకు ఊపిరులూదాయో

అలసి సొలసి చివరికి
ప్రియ సన్నిధి చేరుకొన్నది
బిగి కౌగిట ఒదిగొదిగి
ప్రియ బాంధవి తానన్నది //

16, మార్చి 2012, శుక్రవారం

రహస్యం

కుసుమాలు
రహస్యం చెప్పాలని
రమ్మని సైగ చేస్తే
కొమ్మ చాటుకి వెళ్లాను
విరి జల్లు
ఎద ఝల్లనగా కురిసి
పుష్పాభిషేకం చేసింది
ఆశ్చర్యంతో
నా కనులు విప్పారితే
ముగ్ధ కుసుమాలు
మధుర కంఠంతో అన్నాయి
' కళ్యాణమస్తు '
అణువణువు అమృతం తాగినట్టు
అమరుణ్ణి అజేయుణ్ణి అయినట్టు

తీగ సోయగం

ఊపిరి సలపడంలేదు
ఊహకు అందడం లేదు
రేపని మాపని
ఊరించిన దాపరికాలు
రేయి పగలు
చెలరేగిన మధుర స్వప్నాలు
నన్ను లతికలై తమకంతో
అల్లుకున్న మధుర క్షణాన
లతాంతాలై నన్ను
అభిషేకించిన సుముహూరుతాన .......

ఏ పూల సౌరభాలో ఇవి
ఏ తీగ సోయగాలో ఇవి
ఏ వాగు వంకల వరవడులో
ఏ గుండె గొంతుక అలజడులో

వెండి వెన్నెలలో జలకాలాడినట్టు
కొండ గాలి సోకి సొమ్మసిల్లి నట్టు
కుసుమ శయ్య కల గన్నది
కోకిలమ్మ పాడుతున్నది

వెన్నెముక

అతడి పొలంలో కంకులు
ఇతడి పుస్తకంలో అంకెలు
అతడి కన్నుల్లో శంకలు
ఇతడి కంఠంలో రంకెలు

అతడి బ్రతుకు అంధకారం
ఇతడి బ్రతుకు సుధాపూరం

ఆ సంకెళ్ళు విరగ్గొట్టి
రక్షించండి రైతుని
రైతు బ్రతుకుని వెలిగించి
రక్షించండి దేశాన్ని

ఇంతేలే ...

భారత రాజ్యాంగానికి
శస్త్రచికిత్స జరుగుతోంది
ష్ ....అటు వైపు వెళ్ళకండి !
శాసనాలు పుడుతున్నై
సభలో రసాభాస కేకలు
మిన్ను ముట్టుతున్నై
ప్రజల సంక్షేమం కన్నా
పార్టీల మనుగడ మిన్నగా
ఒక కులం ఒక మతం
ఉన్నత శిఖరాల కేగరేసే
ప్రయత్నాలు జరుగుతున్నై
సామాన్యుడా
అటుకేసి చూడకు
నలిగి పోగలవు
అసలే అంతంత మాత్రం బ్రతుకులు
నిర్దాక్షిణ్యంగా పగిలి పోగలవు

ఎదురు చూపులు

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
తోట ఎదురు చూస్తున్నది
పున్నమి వాకిళ్ళలో
పూలదోసిళ్ళతో నిలుచుని
స్వాగత గీతాలాలపిస్తున్నది

బహుశా మీ కోసమే నేమో !
తెల్లబోయి చూస్తారేం ?
పదండి మరి

రస హృదయం

అక్షరాల విత్తనాలు చల్లుతున్నా సుక్షేత్రంలో
అందమైన భావాలకు
ఊపిరి పోస్తున్నా నా నేత్రంలో
అయినా ఇంకా విత్తనాలు మొలకెత్తడం లేదు
ప్రాణంతో కేరింతలాడే పసిడి కాంతుల జాడ లేదు
నవ నవోన్మేష గీతాలు నడయాడడం లేదు
అయినా నాలోని ఆశలు వసివాడడం లేదు
నేను నిరంతర శ్రామికుణ్ణి
కవితా వారాశిలో
అవిశ్రాంతంగా సాగిపోతున్న నావికుణ్ణి
నాకు గమ్యం లేదు హర్మ్యం లేదు
రమ్యమైన భావాల సమ్మిళితం నేను
రమణీయ చేలాంచలాన
రెపరెప లాడుతున్న రస హృదయం నేను
నేను రాకేందు బింబాన్ని
ప్రహ్లాదుని కోసం నిలువునా చీలిన స్తంభాన్ని
నిటారుగా పెరిగే నికుంజాన్ని
నిన్నలను దాటుకొని వచ్చిన నవ శకారంభాన్ని
కవితా పిపాసువులకు సరి కొత్త సంరంభాన్ని

అవివేకం

రేపటి అమావాస్య అంధకారాన్ని
ఎలాగైనా వెలిగించుకోవాలని
వెన్నెల వెలుగుని పోగుచేసుకొని
మూటకట్టుకొంటున్నాడుమనిషి

అందరికి చెందాల్సిన సంపదని
తరతరాల కలిమిగా
మూట కట్టుకోవడం అవివేకం

చీకటిలో మగ్గి పోతున్న
ఆ సంపద
వెలుగు చూడాలంటే ఎంత వ్యధ
ఇంత శ్రమ ఎంత వృధా
కడకు ఆ వెన్నెల మూట
విప్పి చూసే వేళకు
అక్కడ ఏముంటుంది
ఒట్టి కటిక చీకటి

15, మార్చి 2012, గురువారం

అవినీతి చరామి

నా పేరు అవినీతి
నాదంతా ఒక జాతి
నా ఉనికి కులమతాల కతీతం
నాకు లేదు తరతమ బేధం
ఎన్ని చట్టాలు వచ్చినా ఏమి
నా పేరు సర్వాంతర్యామి //

మనిషి మనిషిలో ఉన్నాను
ప్రగతి పధం లో ఉన్నాను
అవరోధం నా వేదం
ఆనకట్ట తెగి పడితే నా కమితానందం
అందరూతెగ తిడితే అంతా భజ గోవిందం //

జగమంతా నా నామ స్మరణమే
జనమంతా నా పర్యావరణమే
నాలోనే వినోదం నాతోనే విషాదం
నా తోడే లేకుంటే నా నీ డే పడకుంటే
మనిషి కేది భవితవ్యం //

వార్ధక్యం తలుపు తట్టిన వేళ

ఒక్క భావకవి
మాత్రమే అనుకొన్నాను
ఎందఱో కవులు
నాలో కొలువు దీరి ఉన్నారు
ఒక్క మనసే కదా
ఒత్తిళ్ళే కదా అనుకొన్నాను
ఓంకారం నేర్చుకొని
ఓం శాంతి అనుకున్నాను
హృదయం ఉదరం
నయనం కాలేయం
ఇలా అబ్బో ఎందఱో
కవిత్వం వల్లెవేస్తున్నారు
దిగంబర కవులై విప్లవ కవులై
గర్జిస్తున్నారు గాండ్రిస్తున్నారు
ఓషధులను పిలిపించి
కవి సమ్మేళనాలు
ఘన సన్మానాలు
గుట్టుగా జరిగి పోతున్నాయి
ఎన్నేళ్ళదో ఈ సాధన
కవిత్వం చిక్కబడుతోంది
దాతను నేనే, శ్రోతను నేనే
యమయాతన తలుపు తడుతోంది
తెర జారే దాకా తప్పదు మరి
ఈ చీకటి వెలుగుల విభావరి

నిర్వేదం

మనసు కసురు కొన్నది
అనవసరమైన ఆలోచనలతో
నన్నేల విసిగిస్తావని
హృదయం ఉసూ రుమన్నది
విపరీతమైన వేదనతో
ఎన్నాళ్ళిలా కొట్టుకు చావాలని
దేహం దిగులుగా చూచింది
ఈ ఇద్దరి వాగ్యుద్ధానికి
తన మనుగడ ప్రశ్నార్ధకమని
జీవితం నిట్టూర్చింది
ఇక నూరేళ్ళు కొనసాగడం
అసంభవమని

14, మార్చి 2012, బుధవారం

ఆమెని చూచాక

ఆమెని చూచాక
మనసుందని తెలిసింది
అయితే ఇప్పటిదాకా
మరు భూమిలోనా నడిచింది
ఆమె రమ్మని పిలిచాక
ఏరువాక కనిపించింది
ఔనా మరి ఇన్నాళ్ళు
ఎండమావినా వలచింది
ఏడడుగులు నడిచాక
మోహన రాగం వినిపించింది
ఎంత దారుణం ఇంతకాలం
విరహమా ఆలపించింది
ఆమె రాకతో నాలో
అమృత వర్షం కురిసింది
ఇన్నాళ్ళకి కదా నా జీవితం
నవనందనమై విరిసింది

చాలు

ఒడిలో తలనిడుకొని విశ్రమించే
ఆ ఒక్క క్షణం చాలు
తమకంతో కురులను నిమిరి లాలించే
అనునయం చాలు
తన్మయంగా తదేకంగా వీ క్షిం చే
అనుభవం చాలు
అధ రాన్నిఅధరంతో పలకరించే
ఆనందం చాలు
మమతా వేశంలో లతలా అల్లుకు పోయే
ఆలింగనం చాలు
నేనున్నానని గుండెల్లో దాచుకొని సేద దీర్చే
అభయం చాలు
కడదాకా ఎన్ని ఇడుములైనా వీడిపోననే
అశ్రు బిందువు చాలు

13, మార్చి 2012, మంగళవారం

ఋతురాగం

మీకన్నా ఆ మాకు నయం
ఒక ఋతువులో ఆకులు రాలిపోయినా
అక్షరాలూ గుణింతాలు నేర్చుకొని
మళ్లీ రుతువుకి
అందమైన ఆకుల్ని రేకుల్ని
అమర్చుకొంటుంది
ఆ కోయిల నయం
ఏ అక్షరాలూ రాకున్నా
భాషా ద్వేషాలు లేకుండా
సర్వజనుల నలరించే
స్వర గతులు కూర్చి
కమ్మని పాటలు పాడుతుంది
అక్షరాలూ తెలియక పుస్తకాలు తెలియక
పాటలు పాడక పల్లవులు వినక
ఆకుల రేకుల సౌకుమార్యం అర్ధం కాక
ఎందుకయ్యా జీవితం
ఎండమావులు వెదుక్కుంటూ
ఎండుటాకులు ఏరుకొంటు
ఎంత కాలమీ జీవనం

ఒక్క క్షణం !

అక్షరాలు చూచి
అలా పారి పోతున్నారా
పుస్తకాలు తెరిచి
ఒక జీవితకాలం అయిందా
అక్షరాలు పదాలు
మరిచిపోయారు సరే
ఆధారాలు, పెదాలు లాంటివి గుర్తున్నాయా
అవీ మరిచిపోయారా
కంటి పాపలు, కదలాడే చేపలు
వెచ్చని ఊ పిరులు
ముచ్చెమటల లాహిరులు
ఏవి తెలియవా
వాటి గురించే వినలేదా
అయితే మీ జీవితం వ్యర్ధం
మీ బ్రతుకు నిరర్ధకం

వెలుగుల వాగులు

ఈ పాదులు
మాతృత్వం నిండిన ఎద లోతులు
ఈ ఆకులు
చెట్ల ఆకలి చల్లార్చే చేతులు
ఈ తీగలు
ప్రవహించే వెలుగుల వాగులు
ఈ మొగ్గలు
మొక్కల చెక్కిలిపై మొలిచిన సిగ్గులు
ఈ పూలు
ఈ తోట వెలిగించుకొన్న దీపాలు

11, మార్చి 2012, ఆదివారం

తొలిరేయి

కలగా ఉంది
కమ్మని కలగా ఉంది
తనువంతా
కాంతి జలపాతంలా ఉంది
మనసంతా
శాంతి నికేతనంలా ఉంది //

విరజాజుల పరిమళం
ధూపం ఔతుంటే
చిరు గాజుల సవ్వడి
తాపం ఔతుంటే
తనువును తాకిన తన్మయం
మోహం ఔతుంటే
పెదవిని చేరిన అనునయం
దాహం ఔతుంటే //

అల్లన నడిచిన బిడియం
కొత్తగా ఉంది
ముద్దుగ ముడిచిన అధరం
మెత్తగా ఉంది
హాయిగ సాగిన సోయగం
హత్తుకోమంది
ఒడిలో ఒదిగిన సందియం
అల్లుకోమంది//

దరిచేరిన చిరు సిగ్గులు
మొగ్గలౌతుంటే
ఎరుపెక్కిన ఆ బుగ్గలు
దగ్గరౌతుంటే
బిగి కౌగిలి నెచ్చెలి
ఉక్కిరిబిక్కిరౌతుంటే
అది గాంచిన సిరి మల్లెలు
పక్కుమంటుంటే //

అనుబంధం

ఎన్నాళ్ళకి ఒచ్చింది ఓంకారం
ఎదలోనికి
ఎన్నేళ్ళకి ఒచ్చింది శ్రీరాగం
పెదవి మీదికి
తోడూ ఒకటి దొరికింది
హృదయానికి
బంధ మొకటి నడిచింది
బ్రతుకు లోనికి //

మేలిముసుగు వేసుకొని
మెలమెల్లగా
సిందూరం అలదుకొని
చలచల్లగా
ఎలకోయిల పిలుపులతో
హాయిహాయిగా
రాయంచ నడకలతో
తీయ తీయగా //

ఎగురుతున్న ముంగురులు
ఏరువాకగా
పెదవి పైని ఎర్రదనం
ప్రేమలేఖగా
అలదుకొన్న కాటుక
అలవోకగా
ఇచ్చిన తొలి కానుక
హాయి మోయగా//

ప్రేమించు

ప్రేమించు, ప్రేమను పంచు
ప్రేమగా పలకరించు
చూపుల్లో వెన్నెల చిలకరించు
పెదవుల్లో చిరునవ్వులు ఒలికించు
మాటల్లో మమతను పలికించు
మౌనంలో శాంతిని వెలయించు
చేతల్లో సేవలు అందించు
ఆశించకు లంచం, అది కరిగే పొగమంచు
మంచిని శ్వాసించు, వంచన ద్వేషించు
కరుణను కురిపించు, వరుణుని మరిపించు
ధర్మం ఆచరించి , కాలాన్ని జయించు
గొప్పలు కాదంచు, తప్పులు మన్నించు
ధ్యానించు ,లోపలి లోకం తిలకించి
జ్ఞానం సంపాదించు
బోధించు, జీవన సారం ఎరిగించి
బోధి వృక్షమై వ్యాపించు
సాధించు ,సర్వ ధర్మములు పాటించి
కైవల్యం సంపాదించు .