10, జూన్ 2012, ఆదివారం

పాటలోకి ప్రయాణం

తెల తెల వారుతున్న వేళ , ఆమె తలారా స్నానం చేసి కురులారబెట్టుకొంటూ ఎగిరే ముంగురులు సవరించుకొంటూ
తోటలో తిరుగాడుతూ రేయి జరిగిన సన్నివేశాన్ని పరవశంతో సున్నితమైన భావాలతో సుందరమైన పదాలల్లి  పాడుకొంటున్నది .తన విభుని నిద్దుర లేవమంటూ రాత్రంతా ఎన్ని ఘన కార్యాలు చేసావో చూసావా అని అలుకలు బోతున్నది
 
మల్లె పూవులు విరిసేరా మంచు తెరలు తొలగెరా
నల్లనయ్యా మేలుకో చల్లనయ్య మేలుకో
 
మల్లెలు విరిశాయి మంచు తెరలు కరిగి పోయాయి ఇంక  లేవయా మహానుభావా అంటున్నది 
 అంతే కాదు తన బుగ్గలపైన పంటి నొక్కులున్నాయని
అతని   పెదవుల పైన తన కాటుక రేఖ అంటుకున్నదని
 
పురిటి వెలుగుల బుగ్గ పైని పంటి నొక్కులు కంటిరా 
చిరుత నవ్వుల పెదవిపై నా కంటి కాటుకలంటేరా
 
ఇంకా చిక్కు పడిన కురులు ఒక్కసారి పరికిస్తే సిగ్గు ల మొగ్గై పోతున్నానని 
ఆ హాయి తలచుకుంటే గమ్మత్తుగా వుందని అంటున్నది  
 
చిక్కుపడిన కురులు చూచి సిగ్గు ముంచుకు వచ్చేరా 
రేయి గడిపిన హాయినంతా మనసు నెమరు వేసేరా 
 
ఎంత ఆరాధన ఒలికించిందో ఈ మాటల్లో తను నవ్వితేనే గాని  తెల్లవారదని ఆ నవ్వుల్లో చూపుల్లో
 తన జీవితం రసబంధురం  అని హాయిగా ఎలుగెత్తి గానం చేస్తున్నది
 
నీవు నిండుగా నవ్వినపుడే నాకు నిజముగా తెల్లవారును 
నీ నవ్వులోనే నా రేపుమాపులు గలవురా నీ చూపులో
 
 కురులు చిక్కు పడడం ,పెదవుల  పైన కాటుక లుండడం, మనసు నెమరు వేసుకోడం
పురిటి వెలుగులు , పంటి నొక్కులు ఇలా   ఎన్నెన్నో పద బంధాలు ..
పాట నిండా పరచుకున్న అనురాగం ఆరాధన ప్రణయం అపురూపం
ప్రతి పదం సన్నివేశాన్ని బరువుగా మోస్తూ సందర్భాని సూచిస్తూ
శృంగార సన్నివేశమే అయినా అశ్లీలం అణుమాత్రం కనుపించదు
 
 
పాట వింటే హృదయంతో వినాలి   ప్రతి చరణం లో లీనం కావాలి .
ఆసన్నివే శం లోకి  చొచ్చుకు పోవాలి. అప్పుడే ఆ పాట ధన్యం
 
ఈ గీతం ఓ యాభై ఏళ్ల క్రితం ఇల్లాలు అనే చిత్రం లో వచ్చింది 
ఆనాటి నుంచి నన్ను నిరంతరం వెంటాడుతోంది
నా మది పరవశించి నా కలం చేత ఎన్నో గీతాలు వ్రాయించింది
 
''నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది'' అంటారు  శేషేంద్ర
నిద్రాణమైన నా మనసును మేలుకొలిపి వందలాది గీతాలు కవితలు నాలోంచి వెలికి తీసిన గీతమిది
''పాటకు దండం పెడతా ''అంటారు సినారే.. 
నేను ఈ గీతానికి ప్రణమిల్లుతున్నాను

2, జూన్ 2012, శనివారం

చిరునవ్వు ఒక వరం

Having a smileon our face is good compliment to life,
but putting a smile on other's face by our efforts is the best compliment to life

చిరునవ్వు ఒక వరం
మందస్మిత వదనం
జగతికే మనోహరం

నువ్వు నవ్వితే  చాలదు 
నీ బ్రతుకు రవళిస్తే  సరిపోదు

ఎదుటి పెదవి ఎందుకు
అంధకారంలో ఉందొ ఆలోచించు
అది పరిహరించేందుకు 
నువ్వేం చెయ్యాలో ప్రయత్నించు

అదే జీవితానికి అర్ధం
అదే జీవన పరమార్ధం

నవ్వు,
నవ్వించు ,
నవోదయాలను నలుగురికీ పంచు

మరణించకు ప్రతి నిముసం

If things are happening according to your wish
you are lucky , if they arenot ,you are very lucky
because they are happening according to God's wish ...
 
నీవు అనుకున్నది
అనుకున్నట్టు జరిగితే
అదృష్టవంతుడివి
అనుకోనివి జరిగాయా
మరీ అదృష్టవంతుడివి
 
అర్ధం కాలేదా
అది ఆ దైవనిర్ణయం
అలా జరగాలని
ఆ దేవ దేవుని ఆదేశం
 
ఏది మన  చెప్పు  చేతల్లో ఉండదు
ఎప్పుడూ జీవితం ఒకలా ఉండదు
 
చీకటిని వెతుకుతూ వెలుగు
వెలుగును మింగేస్తూ  చీకటి
 
మరచి పోకు ఈ సత్యం
మరణించకు ప్రతి నిముసం
 
తలచినదే జరిగినదా దైవం  ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ..
            (ఒకసినీ గీతం)

1, జూన్ 2012, శుక్రవారం

ఓ దేవులపల్లీ !

ఓ దేవులపల్లీ
తెలుగు కళామ తల్లి
జడలో విరిసిన సిరి మల్లీ 
మళ్లి రావయ్యా మా నడుమకి   
మధుమాసాలు మందహాసాలు
కొని తేవయ్యా పుడమికి //
 
మల్లి జాబిల్లి
దారంతా పూవులు చల్లి
ఎదురు చూస్తున్నాయి
నీవు వచ్చే  దారుల్లో ..
ఎల కోయిలలన్ని 
కొత్త కొత్త గీతాలల్లి
నీ కోసం వెదికినవి
ఈ కొండా కోనల్లో //
 
పూదేనియ గ్రోలదు తుమ్మెద
పూదోటను   వీడదు తెమ్మెర
పూలిమ్మని కొమ్మ కొమ్మకు
పురమాయించే దెవరయ్యా
గూడుందని గువ్వల జంటకు
గుర్తు చేసే దెవరయ్యా   //
 
ఓ  దేవులపల్లీ !
నీ కోసం పూమాలలు అల్లి
ప్రతి హృదయం సుమసదన మైనది
నీ పదముల సడి  వినాలని
ప్రతి గాలి మలయమారుతమైనది
 
రావయ్యా  ప్రభాత కుసుమంలా
రావయ్యా ప్రసూన విభవంలా //
 
(ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి.... భక్తి ప్రపత్తులతో )

అమ్మా అని పిలవాలని వుంది

అమ్మా !
 
ఏమిటి నా నేరం
నే చేసిన పాపం
నీ పాపగా పుట్టడమేనా
ఆడపిల్లలా అడుగెట్టడమేనా
ఎందుకమ్మా ఈ శాపం
ఎందులకీ ..శోకం//
 
మాతృత్వం వరమంటారే
మమతా మమకారాలు
నీ సొంతం అంటారే
చిగురు గానే చిదిమేస్తే
మొగ్గలోనే తుంచేస్తే
ఆ తల్లి బిరుదు ఏలనమ్మా
అమ్మకు అర్ధం లేదమ్మా
నీ జన్మ వ్యర్ధమమ్మా //
 
నీవూ ఒక అమ్మ పాపవే   
ఆమె కలల  రూపానివే
నాకీ శిక్ష ఏలనమ్మా
నాపై కక్ష ఎందుకమ్మా
నిను చూడాలని ఉంది
నాకు జన్మ ఇవ్వమ్మా
అమ్మా అని పిలవాలని వుంది
ఆవకాశం ఇవ్వమ్మా //
 
(భ్రూణ హత్యలు నిరసిస్తూ..ఈ గీతం )