29, అక్టోబర్ 2012, సోమవారం

చరిత్ర నవ్వుతోంది

కవి ఇటురా
ఎవరా అని విస్మయంగా చూసాను
విచిత్రం ఎక్కడైనా ఉందా  
ఇంతకు ఎవరు నువ్వు 
నేనయ్యా  చరిత్రని
.............
వింత కాలంలో నైనా ఉందా
యుగం లోనైనా జరిగిందా
అదేనయ్యా ప్రజాసేవ చేస్తాను ప్రాణత్యాగం చేస్తాను 
పాదాక్రాంతం ఔతాను అంటూ   పాదయాత్రలు 
ఈ చిత్ర విచిత్రాలు చూస్తున్నావా
........................
 ఒక పేజి కవిత వ్రాయి అరుదైన చిత్రం
గత  కాలం ఎరుగని చిత్రాతిచిత్రం
విచిత్రం చరిత్రలో నిక్షిప్తం కావాలి కదా
@@@
ప్రజా సేవ చేస్తాం
మీ సేవలో తరిస్తాం 
మీ కోసం ప్రాణ త్యాగామైనా చేస్తాం
మీరే మా దైవం మీరే మా సర్వం
ఏమయింది వీళ్ళకి
అమితంగా ప్రాధేయ పడ్తున్నారు
వంగి వంగి దండాలు పెడ్తున్నారు
ఎవరికైనా సేవ చేయడానికి
అంత దీనంగా ప్రార్ధించాలా
అంతగా మోకరిల్లాలా
కాళ్ళావేళ్ళా  పడి బ్రతిమాడాలా
ఇది నిజంగా నిజమా అనిపిస్తోంది
సహజమా అనిపిస్తోంది
ఎన్ని ప్రసంగాలు
ఎన్ని ప్రతిజ్ఞలు
ఉచితానుచితాలు మరచి
అన్ని ఉచితమంటూ వాగ్దానాలు
మైళ్ళ కొద్ది కాలి నడకలు ..
ఈ పందేరాలు  ఫలహారాలు
ఎవడబ్బసొమ్మని ?
లాల్ బహదూర్ శాస్త్రి గారూ!
ప్రకాశం పంతులు గారూ!
 ఆనాటి నాయకులారా
వినండి ఈ శుష్క వాగ్దానాలు
ఊక దంపుడు ప్రసంగాలు
ఏది దానం చెయ్యమనండి వారి కలిమి గుట్టల్ని 
పాముల కిరవైన  చీమలు పెట్టిన పుట్టల్ని
 పగుల గొట్టి  అందరికి పంచి పెట్టమనండి
దాచి పెట్టిన ధన కనకరాసులు వెలికి తీసి
దేశమంతా  వెదజల్లమనండి
అంతే........  పరార్ 
అర్ధమయిందా మిత్రులారా
వీరి నయవంచన
పదవి కోసం తదుపరి నిధుల కోసం
ఎంత తపన
కాకుంటే ప్రజా సేవ చేస్తామని
ఈ  ప్రాకులాట ఏమిటి
బాంచన్ కాల్మొక్త .. అంటూ
ఈ దుర్గతి ఏమిటి
దేశ ప్రజలారా  బహుపరాక్ ....

28, అక్టోబర్ 2012, ఆదివారం

ఒక రేయి విషాద గీతమైన వేళ

ఈ రోజు  గడిచి  పోనీ
ఈ రేయి నడిచి  పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం 
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన  మలిగి పోనీ //

ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //

మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //

27, అక్టోబర్ 2012, శనివారం

అందమైన కానుక

అందమైన జలపాతం
అరవిరిసిన పారిజాతం
సౌందర్య కాసారం
అతి సుందర కాశ్మీరం
అన్నీ గుర్తుకొస్తున్నాయి
నువ్వే అన్నీ అనిపిస్తున్నాయి
నీ అణువణువున అవి నర్తిస్తున్నాయి //

అతిలోక సౌందర్యం
    నా ముందు నిలిచింది
అమదానంద  మాధుర్యం
    కనువిందు చేసింది
అరుణాధర సుమగీతం
    స్వరధారగ  సాగింది
లలిత లలిత లావణ్యం
    కౌగిలిలో ఒదిగింది //

ఇంద్ర ధనసు అందాలు
    నేలకు దిగి వచ్చాయి
సుందర నందన వనాలు
    నా ముంగిట నడిచాయి
సుమకోమల గీతాలు
    నాకు కానుకన్నాయి
జన్మ జన్మల బంధాలు
    నిన్ను నాకు ఇచ్చాయి //

ఎందుకమ్మా ఇంత అందం

ఎందుకమ్మా ఇంత అందం 
       ఇలా ఏడిపిస్తావు
ఎంత కాలం ఇలా ఎదురై
       నన్ను ఉడికిస్తావు
మందహాసం విందు చేసి
   ఎందుకిలా బులిపిస్తావు 
ఏల వింతగ చూస్తావు
ఎవరి  సొంతం ఔతావు //


కవ్వించే నీ రూపే ఎంత హాయిగా ఉన్నది
ఊరించే నీ తలపే ఎంత తీయగా ఉన్నది
నా మది ఏదో హాయి గొలుపు పిలుపు విన్నది
అది  నాలో వలపు మేలుకొలుపుతున్నది //

ఆ నయనం ఎన్ని తీపి కలలు కన్నదో
అచట వింత కాంతి ధారలై కురియుచున్నది
ఆ పెదవి ఏ అపురూపమైన కధలు విన్నదో
ఏ పూలతావిదో మధువు అచట కొలువు ఉన్నది //

24, అక్టోబర్ 2012, బుధవారం

ఒక్క నవ్వు చాలమ్మా !

ఒక్క నవ్వు చాలమ్మా
ఒక్క నువ్వు చాలమ్మా
ఒక్కటై పోదామమ్మా
చుక్కల లోకం చూద్దామమ్మ //

వేయి కనులు చాలవమ్మా
రేయి పగలు కలలమ్మా
ఇంతలేసి కన్నులవి
అంత సేపు మూయకమ్మా
కాంతులీను వెన్నెలలు
కటిక చీకటి చేయకమ్మా //

ఒయీ అని పిలువమ్మా
ఓంకారం అది నాకమ్మా
ఓర్వలేని లోకమమ్మా
ఒంటరి పయనం ఏలమ్మా
ఒద్దికగా యిద్దర మొకటైతే
అది ముద్దు ముచ్చట ఔనమ్మా //

పట్టు చీర కట్టవమ్మ
పట్టపు రాణివి నీవమ్మా
బెట్టు చేయ రాదమ్మ
ఒట్టు వేయ వద్దమ్మా
పల్లకిలోన ఊరేగి
నా ఉల్లంలో చేరవమ్మా//

చెలి వొడి ..

కల ఒకటి వెంటబడి
నిదురన్నది కొరవడి
చేలమొకటి కనబడి
చేరుకున్నా చెలి వొడి //

కౌగిలిలో తలనిడి
ముద్దులతో ముడివడి
పొద్దుటి  సడి వినబడి
ఇద్దరమూ విడివడి //

అణువణువున అలికిడి
ఇద్దరిలో అలజడి
యవ్వనాల సవ్వడి
ఎదలోపల సందడి //

తనువుల ఒత్తిడి
తపనల చిత్తడి
ఆశల గారడీ
అంతలోనె చిడి ముడి//

పొరపాటున

పొరపాటున
తోటలోకి వెళ్ళానా
ఒక పూవు  అడిగింది
తనలా కుసుమించమని

పొదమాటున
పైట సరిచేసుకున్నానా
తేటి అడిగింది
తన పాటకు నాట్యం చేయమని

కొమ్మ నవ్వింది
కొంగు సరి చేసుకొని
రెమ్మ నవ్వింది
కళ్ళు  అరమూసుకొని
మొగ్గ అడిగింది
సిగ్గు శృతిచేసుకొని
పచ్చని అందానికి
ప్రాయం వచ్చెనని
ఆ ముచ్చటలన్నీ
ఇంకెప్పుడని

చీర నడిచింది
చుట్టు కొంటు వయ్యారాన్ని
కొంగు తడిమింది
కొత్త కొత్త అందాన్నీ
నడుము అలిగింది 
నడక యింక చేత కాదని
వయసు కసిరింది
అల్లరింక తన వల్ల కాదని

మనసు నవ్వింది
మార్గం ఉన్నదని
మౌనంగా చెవిలో చెప్పింది
మధుమాసం వస్తుందని
అందాకా  కోరికలకు
కళ్ళెం వేయమని

అందాల బొమ్మతో ..

చెక్కిన శిల్పం లా
చక్కగా వున్నావు
చెక్కిట చేయిడుకొని
బొమ్మలా వున్నావు
మందహాస మధురిమతో
చందమామ నన్నావు
యవ్వన మృదు లాస్యంతో
వర   వీణను  అన్నావు //

సరసాలాడే వేళ
      వేణువు నన్నావు
సరదా తీరే వేళ
     అణువణువున వున్నావు
మేడలో వేసిన మాల
      నేనేనని అన్నావు
పెదవుల ముసిముసి నవ్వు
      నాదేనని అన్నావు //

సందె వెలుగు లాగ
      నీవు తరలి రాగా
వాగు మలుపు లాగా
     తనువు మారి పోగా
మేని అందమంతా
     ఇంద్ర ధనసు కాగా
మేఘ రాగామల్లె
     మెరుపు మెరిసి పోగా

సరస సంగీతం

తీగలా వచ్చి
పూవులా విచ్చి
వాగులా నడిచి
వానలో తడిసి
వయ్యారాలన్ని కుప్పలుగా పోశావు
సింగారాలన్ని సిగ్గులుగా దాచావు //
 
రాజులా వచ్చి
మోజులే తెచ్చి 
ముద్దులే ఇచ్చి
కౌగిలిలో గుచ్చి
వయ్యారాలన్ని  వరి మడిగా చేసావు 
ఒకటై పోదామని    వరమడిగేసావు //
 
నిన్న పూచిన మల్లెలన్ని
       పెదవిపై  దాచానన్నావు
నిన్నకురిసిన వెన్నెలంతా
        వృధా చేసానన్నావు
నిన్న రాతిరి వింతలన్నీ
        కధలు కధలుగా చెప్పావు
ఎంత జాతర చేసినావని
         ఊరంతా దండోరా వేశావు//
 
 
కళ్ళు రెండు మూసుకొంటే 
        కంటి పాపలో  కొచ్చావు 
ఒదిగి ఒదిగి నేనుంటే 
        నడుము వంపులో దాగావు 
కంటి పాపలో నేనుంటే 
         ఏల కసురు కుంటావు
నడుము వంపులో దాగుంటే
         ఏల వద్దు వద్దంటావు //
  

1, అక్టోబర్ 2012, సోమవారం

ముంగురుల మృదులాస్యం

నీలి నింగి అల్లన వొంగి
నీ శిరస్సును నిమిరెనా ఏమి

ఆ తుమ్మెదలబారు
ఒక్కమారు రివ్వున వాలి
నీ తలపై నడయాడెనా ఏమి

ఒకసారి మోవిపై జారి
ఒకమారు గాలితో జత చేరి
ఎన్ని విలాసాలో
ఎన్నెన్ని విన్యాసాలో

అభ్యంజనానంతరం
ఆ కురుల కెంత సంబరం
మోమున ఆ స్వైర విహారం
పచ్చని ప్రాంగణాన   చేరి
ఆ కేరింతల వినోదం
అవి పలకరింపులో
పలవరింతలో
రహస్య సంప్రదింపు లో

నిసిరాతిరి వేళ
ఎదపై పవళించిన వేళ
మోమును కప్పినవి
కురుల రాగాలా
కారు మేఘాలా

ఆకురుల నింగిలో దాగిన
నగు మోము సోయగం
విరుల పరిష్వంగం లో
రంగు రంగుల వైభవం
వర్ణించగ నాకు సాధ్యమా

దరహాసం

ఆ దరహాసం కోసం
నీ అధరం ఎంతకాలం తపసు చేసిందో

ఆచిరునవ్వును ధరించాలని
 నీ పెదవి ఎంతగా ఉబలాట పడిందో

అక్కడ తడి పొడి తపనలపై
నీరెండ పడి ఒక హరివిల్లు విరిసింది

ఆ రంగుల వేదిక పైన నా చూపులు ముడివడి
నాలో విరిజల్లు కురిసింది

ఆ మెత్తని పానుపు పైన
మత్తుగా గమ్మత్తుగా ఉన్నట్టుంది
ఆ మందహాసం ఎంత హాయిగా శయనించింది

అధరం

ఆ పెదవి గురించే నాకు చింత
అంత దయనీయంగా పడి ఉన్నదే అని నీ చెంత
ఆ పెదవి గురించే నా ఆవేదన
ఒంటరిగా ఎన్నాళ్ళని ఎందుకని ఆ తపన
ఆపెదవి గురించే నా ఆరాటం
ఎలా తీరాలని ఏమి కావాలని  తన ఉబలాటం
ఆ పెదవి ఎరుపు వెనకాల
ఎన్ని  శ్రావణ  మేఘాలున్నాయో
మిరుమిట్లు గొలిపే ఆ మెరుపు వెనకాల
ఎన్ని అల్లరి రాగాలున్నాయో
ఎన్నాళ్లుగా  అక్కడ వేచి ఉన్నదో మైమరపు
ఎంత కాలంగా అచ్చట పడి ఉన్నదో ఒక తీయని తలపు
ఆ పెదవి కోసమే నాతపస్సు
ఎప్పుడో ఎక్కడో మరి ఆ ఉషస్సు

ఆ వసివాడని సౌందర్యం
ఆ గులాబి రేకులసోయగం
తలచుకొంటేనే మది నిండా పరవశం
 
ఏ కోమల సుమదళానిదో ఆ లావణ్యం
ఏ కోవెల ప్రాంగణం చేరనున్నదో ఆ లాలిత్యం
 
ఆసుతి మెత్తని సుమ కోమల వైభవం
హత్తుకొనని బ్రతుకున ఏమున్నది ప్రాభవం
 
ఆ అధరం గురించే నా మధనం
ఊరించే ఆ పెదవి గురించే నా కవనం
 
అ అధరం వరించే ఒక నిముషం
నా బ్రతుకున చిగురించే మధూదయం
అదే అదే ఆనాడే అసలైన మహోదయం