24, జులై 2014, గురువారం

అవి సినిమాలా

అవి నృత్యాలా ఆ పిచ్చి గంతులు
కుప్పిగంతులు గుంపులుగుంపులుగా ఇకిలింతలు సకిలింతలు 
మెలికలు తిరుగుతూ మూలుగులు రంకెలు కేకలు

అవి గీతాలా
 కొన్ని ముక్కలు అతికించి కొన్ని పరభాషా పదాలు ఇరికించి
వాటిని భాషరాని వారిచేత కొరికించి
కొన్ని మూలుగులు వినిపించి
అవి చూచి మేము ఆనందించాలా
అరకొరబట్టలు వేసుకొని ఆడపడుచులు తైతక్క లాడుతుంటే
అశ్లీలంగా చిందు లేస్తుంటే అవి మా కోరిక మేరకు అంటారా 

ఘనత వహించిన సిని కవులరా దర్శక నిర్మాతలారా 
ముందుగా వాటిని మీ కుటుంబ సభ్యులకు చూపించండి
వారికీ అరకొర దుస్తులేసి ఆ పిచ్చి పాటలు పాడించి తైతక్క లాడించి నడి వీధిలో నడిపించండి

కోట్లు ఒక్కటే కాదు కావలసింది
మీ దుర్మార్గాన్ని దురాశని మామీద రుద్దకండి
ఆ దరిద్రాన్ని నిషిద్ధాన్ని జనం మీద విసరకండి

జాతి సంస్కృతి నాగరికత ధ్వంసమై పోతున్నది
ఎవరు మిమ్మల్ని బొట్టుపెట్టి అడగడం లేదు
ఆ కట్టుబొట్టు మార్చి చీకొట్టేలా కాకుండా
అందరిని ఆకట్టుకొనేలా చలన చిత్రాలు తీయండి

మీ కళ్ళకు కట్టిన గంతలు తొలిగించి
గుడ్డ పీలికలు పిచ్చి గంతులు మూలుగులు
మీ ఆకలి కేకలు తగ్గించుకొని అద్భుతమైన సంస్కృతి వైపు అడుగులు వేయండి
మనజాతి పరువును కాపాడండి


6, ఏప్రిల్ 2014, ఆదివారం

పాపం సేవ చేస్తారట !!

పాపం సేవ చేస్తారట ! ?

ప్రజా సేవ చేస్తాం
మీ సేవలో తరిస్తాం అని  చెప్పడం కోసం
ఎవరైనా ఇంతగా ప్రాధేయ పడాలా
రేయింబవళ్ళు ఇలా ప్రాకులాడాలా
కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా
కల్లు  సారాయి పోయించాలా
మద్యం మత్తులో జనాన్ని ముంచెత్తాలా
డబ్బు మంచి నీళ్ళలా వెదజల్లాలా
ఒకరికి సేవ చెయ్యడానికి ఇన్ని పాట్లు పడాలా
పాదాభి వందనాలు తాగి తందనాలు
ఎందుకు పాపం వీళ్ళకి ఇంత  దురవస్థ
సామాన్యుడికి అర్ధంకాని ప్రశ్న ఇది
కాలానుకూలంగా ఈ దశాబ్దంలో
ప్రతి నాయకునికి పట్టిన దుర్గతి ఇది

ఆశ్చర్యంగా ఉంది అసహ్యంగా ఉంది
పక్కవాడిని పట్టించుకోని వాళ్ళు
అయినవాళ్ళని విసిరి కొట్టిన వాళ్ళు
ఇరుగు పొరుగును ఈసడించుకున్న వాళ్ళు
సంపద గుట్టలుగా పోగు చేసుకున్న వాళ్ళు
చీకటిలో పూడ్చి పెట్టిన వాళ్ళు
రహస్యంగా పాతి పెట్టిన వాళ్ళు
నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు
నిర్లజ్జగా యాచిస్తున్నారు
సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని
కాళ్ళవేళ్ళా పడి  దీనంగా వేడుకొంటున్నారు
దయయుంచండని ప్రాదేయపడుతున్నారు
పాపం ఎంత కష్టం ఒచ్చి పడింది  వీళ్ళకి
సిగ్గు లేదేమో ఇలా అడుక్కోవడానికి
మళ్ళి అడుగుతున్నా !
ఇంత యాతన అవసరమా
ఇంకొకరికి సేవ చెయ్యడానికి

కాలమా ఎంత పని చేసావు
చిత్ర విచిత్రంగా అడిస్తున్నావు
ధరిత్రి ఏనాడు ఎరుగని
వింత చరిత్ర రాస్తున్నావు