30, ఏప్రిల్ 2012, సోమవారం

కొలను ...అల

కొలను
అల.. ను 
అడిగింది 
నన్ను 
కలవరం పెట్టడం తప్ప
నీ కింకేం 
పనిలేదా అని 

కుసుమం 
భ్రమరాన్ని 
అడిగింది 
చుట్టూ 
గింగురుమనడం తప్ప
నీ కింకేం 
చేతకాదా అని 

సరిగ్గా అప్పుడే 
జాబిలీ
నాచెలి నడిగింది 
ఈ వెన్నెల 
చాలా  
ఇంకా 
కావాలా అని 

ఆ ప్రశ్నకు   
కొలను 
తెల్లబోయింది
కుసుమం 
సిగ్గుతో 
సోలి పోయింది   

28, ఏప్రిల్ 2012, శనివారం

ఒక మాట చెప్పనా!

ప్రజల నోళ్ళు కొట్టి ప్రజా స్వామ్యాన్ని పాతిపెట్టి ,,
గజదొంగలీనాడు  రాజులై  దొంగలై రాజ్యమేలుతున్నారు ..తిలక్

అప్పు చేసే వారు ధన్యులు ................
ఇచ్చే వారు జీవన సంగ్రామంలో అభిమన్యులు

నువ్వన్నావు.. నావి మీన నేత్రాలని   ..
అందుకేనా ఈదడానికి  కన్నీళ్ళు ఇచ్చి వెళ్లావు

ఎన్నటికి నిను వీడననే బాసను ,
 నీ పెదవి నా పెదవిపై చేసెను

ఏం చెబ్తున్నావని కాదు -
ఎంత అందంగా చెబ్తున్నావని -
ఎంత రసం అనుభవింప జేస్తున్నావని

నిజమైన కళ  ఆత్మని సంస్కరిస్తుంది -
ఆ సంస్కారం కంటికి కనబడదు 

(ఇవి నేను చదివినవి  తెలుసుకొన్నవి ---.ఆ కవులకు ధన్యవాదాలతో )

ఇంద్రధనస్సు

ఆకాశాన్ని
అటు ఇటు కలుపుతూ
ఆ వంతెన ఏమిటనుకున్నారు 

ఆదిక్కుని ఈ దిక్కుని
అనుసంధించిన
అందాల వారధి
ఆ రధ సారధి ఎవరనుకున్నారు

ఆ హృదయంగమ సంగమ
భంగిమ ఏమనుకున్నారు

ఓ కాంతి  కిరణం
ఓపలేని తాపంతో
ఓ హిమబిందువు
కెమ్మోవిని
సమ్మోహనంగా చుంబిస్తే..

ఆ కమనీయ దృశ్యం
నింగి నీలాలలొ రచించిన
ఆ రంగ వల్లుల  మృదులాస్యం

కనులారా కాంచిన ఆకాశం
అర సిగ్గుతో
మోమును దాచుకొన్న
అందాల పయ్యెద
జిలిబిలి సోయగం

ఒక విన్యాసం

ఉదయాన్నే
ఆమె ఎదురౌతుంది

ఒక మందారం
ఆమె పెదవి పైన                      
నవ వధువౌతుంది   

ఒక విన్యాసం
ఆమె కనులలో 
రసధుని ఔతుంది

తప్పనిసరిగా
ప్రతి రేయి నాకు  
నిదుర కరువౌతుంది

వసివాడని ఆచిరునవ్వుని
ఆమె లేత అధరం
నిరంతరం మోస్తూనే ఉంటుంది

అరుదైన ఆ పరిమళం
ప్రతి క్షణం నన్ను 
అమరుణ్ణి  చేస్తూనే ఉంటుంది

ఆ చిత్తరువుని ఒడిసి పట్టుకొని
నామనసు పిచ్చిగా యధేచ్చగా
ఎన్నో కావ్యాలు రాస్తూనే ఉంటుంది

ఆ స్నిగ్ధ దరహాసాన్నిదాచుకొని
అనునిత్యం నా హృదయం
నవమోహనంగా నర్తిస్తూనే వుంటుంది

26, ఏప్రిల్ 2012, గురువారం

గాన గాంధర్వం


అపురూపమైన అందాల్ని
అల్లుకున్నానని
అబ్బో ..
ఆ  చిర కెంత గర్వం

అనన్యమైన రీతిలో
నీ యౌవన గిరుల్ని
హత్తుకున్నానని కదా
ఆ పయ్యెద దర్పం

నీ సన్నని
నడుమును పెనవేసుకొని
లాస్యం చేస్తున్నది
చేలాంచలం
అందులకా ఆ మందహాసం

నీలాల  నీ కురుల
ఒదిగి పోయినందుకా
ఆ విరుల పరిహాసం

ఒకసారి అనుమతివ్వు
ఒక అందమైన
బహుమతివ్వు
అన్నిటి దర్పం అణిచి
గర్వభంగం చేస్తాను

అందచందాలు
పొందు పరచుకున్న
నీ మేని వీణియను సవరించి
నీ జీ వన రాగాన్ని
గాన గాంధర్వం చేస్తాను

కిలికించితాలు 3


ఎవరు ఎక్కు పెట్టిరో
ఎదను నాటుకొంటున్నవి
 పదునైన బాణాలు                     
ఎవరు తలుపు తట్టిరో
 ఎదలోపల పల్లవించుచున్నవి
 మధుర గానాలు

ఎవరు కబురు పెట్టిరో
 నయనాల దాగినవి
 మలయానిలాలు

ఎవరు ఆశ పెట్టిరో
 చెక్కిలిని చేరినవి
 కుసుమాలయాలు

ఎవరు గాటు పెట్టిరో
 పెదవులపై అరవిరిసినవి
 అరుణోదయాలు
  
ఎవరు నన్ను చుట్టు ముట్టిరో
 ఎంత హాయి కురిసినవి
 ఆలింగనాలు

25, ఏప్రిల్ 2012, బుధవారం

కానుక

ఒక రేయి
నిన్ను నాకు -నన్ను నీకు
కానుక ఇచ్చి 
ఒంటరిదై  పోతుంది

ఒక హాయి
మల్లెపూల మాల గుచ్చి
పరిమళాలు కుమ్మరించి
సొమ్మసిల్లి పోతుంది

కనుదోయి
స్వప్నాలరాసి పోసి
స్వర్గాల బాట వేసి
ద్వారాలు మూసి పోతుంది

ఒక వేయి
సుమదళాల పరిమళం
శయ్య పరచి నిన్ను వలచి
నన్ను పిలిచి కన్ను గీటి పోతుంది

పెదవిని తాకిన  
ప్రతి అణువు ఒక వేణువై
మౌనరాగం పాడి అలిసి పోతుంది

బిగి కౌగిలి దాటి వచ్చిన
ఒక నిశ్వాసం కారు మేఘమై
జీవనరాగం కురిసి పోతుంది

21, ఏప్రిల్ 2012, శనివారం

నీవు రావు నిదుర రాదు

నీవురావు
నిదురరాదు
రేయి హాయిగా
గడిచి పోదు
మూగ మనసు
మాటవినదు
తీగ తనువు
తపన ఆపదు
అరవిచ్చిన
వెచ్చని ఊ పిరి
అణువణువునా
మోహన లాహిరి
వలపు రేపిన
వేడి గాడుపు
హెచ్చిన తాపంతో
వెచ్చనైన పానుపు
సిగలో పూల గుసగుసలు
మేనిలో సొగసు కువకువలు
ఉప్పెనలా నిట్టూర్పులు
ఉదయించని తూర్పులు
బండరాయి మాదిరి
బరువెక్కిన రాతిరి
నీవు రాలేదు
నిదుర రాలేదు
కలలురాలేదు

కంటి రెప్పల బరువు

పెదవి పైన
నిన్న నీవుచేసిన బాస
నిత్య నూతనంగా వుంది
ప్రేమగా నువ్వు చేసినసంతకం
నుదుటిపైన పదిలంగా ఉంది

నువ్వే మారి పోయావు
నియమాలని
కట్టుబాట్లని దిగజారి పోయావు
సనాతన సాంప్రదాయాల
ఊబిలో కూరుకు పోయావు

నీ కింకా తెలిసినట్టు లేదు
నా కంటి రెప్పల బరువు
పెదవిపైన
నువ్వు చేసిన సంతకం
ఎప్పుడో చెదిరి పోయింది
నీ జీవితం పైన
సంతకం చేయడానికి
నేనిప్పుడు సిద్దంగా వున్నాను
నా సంతకం లేని
నీ బ్రతుకు నిరర్ధకం
నేనంకితంకాని
నీ జీవితం నిరామయం

19, ఏప్రిల్ 2012, గురువారం

గుండె బరువు

నిన్న
నువ్వు
అమ్ముకున్న
తనువు

ఎవరికీ తెలుసు
నీ గుండె బరువు

అనుకున్నావు
అది నీ
బ్రతుకు తెరువు

అయినా
తీర్చలేదు
అది
నీ కున్న కరువు

అందుకే
నువ్వయినావు
కల్పతరువు

14, ఏప్రిల్ 2012, శనివారం

తోట నవ్వింది

ఈ తోటలో
పువ్వులతో పాటు
నవ్వులు పూయించాలని నా చిరకాల సంకల్పం
ఈ నేలపైన
చీకటిని తరిమేసి
నిరంతరం వెన్నెల కాయించాలని నా ఆశయం
ఈ గాలిని
ప్రక్షాళనం చేసి
పరిమళాలతోఅభిషేకించాలని నా ఆ కాంక్ష

తోట నవ్వింది
జీవితాన్ని కాదని
అల్లుకున్న తీగలకు అడ్డదిడ్డంగా పడి లేస్తూ
పరిగెడుతున్న మనిషి ఉన్మాదం చూడమంది
నేల నవ్వింది
కాంతి కిరణాలను తగుల బెట్టి
కారు చీకటిలో కాపురముంటున్న అర్భకుల్ని చూపించింది
గాలి పగల బడి నవ్వింది
ప్రతి మనిషి హృదయం కాలుష్య మయం
ఏ సౌరభం చొరబడని కీకారణ్యం ఎలా ప్రక్షాళన చేస్తావంది

అందుకే నేను తిరిగి వచ్చేసాను
నా హృదయ ప్రాంగణం లో
పాట ఒకటి సృష్టించుకొని
ఆ కుటీరంలో నివసిస్తున్నాను
పరిమళాలు చల్లుకొంటు
వెన్నెల జల్లుల్లో తడుస్తూ
ప్రతి రోజు ప్రభాతాల్ని వీక్షిస్తున్నాను
మలయపవనాల వెంట
మైళ్ళ కొలదీ విహారం చేస్తున్నాను

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

'మల్లెమాల' కు మల్లె పూదండ


అడుగో మల్లెమాల
మనందరి మనో మందిరాల
సుగంధాలు వెదజల్లుతున్న
సుందర సుకుమార భావాల సుమ మాల
అతడు ఆటవెలదులతో ఆటలాడు వేళ
అందరి హృదయాలలో ఆనంద హేల

ఈ అనర్ఘళ పద్యాలు
ఎక్కడివి ఈ అందాల జలపాతాలు
శ్రోతల హృదయాల్ని ఉర్రూతలూగిస్తూ
ఎక్కడివి ఈ పద మంజీర నిక్వణాలు
ఈ చిత్ర విచిత్ర పద విన్యాసాలు

కాదు కదా ఈత వేమన కజ్ఞాత శిష్యుడు
కాదు కాదు ఈతడు భర్తృహరి కనుంగు చెలికాడు
ఈతడు సుమతి శతక కారునికి అసలైన సరి జోడు
సినీ సౌందర్య నందనంలో మల్లెల మాలలల్లుతున్న సుందర రాముడు
నడిస్తే పద్యం
నవ్వితే పద్యం
ఊపిరి విడిస్తే పద్యం

ఏమిటి ఈతని నేపధ్యం
ఈ యన బాల్యం సస్య శ్యామలం
ఈయన జీవనం పచ్చ తోరణం
ఈయన హృదయం శబ్దాలయం
ఈతని మది కౌముది కళా నిలయం
ఈయన నాలుక పైన సదా సూక్తి ముక్తావళీ పద నర్తనం
నిలువెల్లా సంగిత సాహిత్య సంకీర్తనం
ఔనౌను ఈతడు
సినీ వినీలాకాశంలూ రెప రెపలాడుతున్న విజయ కేతనం

తెలిసింది తెలిసింది మల్లెమాల గారూ
మీ ఆటవెలది నెల్లూరు నెరజాణ
మీ మది రసరమ్య గీతాలు పలుకుతున్న మాణిక్య వీణ
మీరొక నడుస్తున్న మానవతా గీతం
మీరున్న చోట సరస సాహిత్య సంగీత హిమ పాతం
ఆమని వలె
నవ వసంత యామిని వలె
కదలాడే మీ కవితా ధార నేమన వలె
ఏమన వలె ...ఏమన వలె

వేమన వలె
రాముని వలె
ఆ ముని వలె
నడయాడే
మిమ్మేనవలె
వేమన
వేమన
అభినవ వేమన

*********************************
8-1-2003 న ఎం ఎస్ రెడ్డి గారికి , కట్ట మంచి కళా వేదిక ప్రాంగణం లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం  అభినవ వేమన బిరుదు ప్రసాదించిన సమయాన నేను వ్రాసినది, వేదిక పైన ఆలపించినది


పాట విన్నాను

పాట విన్నాను
పాపట సిందూరంలో
నిన్ను దాచుకున్నాను
పాటలాధరాన
ప్రణయ గీతం వ్రాసుకున్నాను
నీ పాటే..... పాడుతున్నాను //

నిదుర రాని వేళలో
నిను రమ్మని పిలిచాను
నీ ఎదురుగ నిలిచాను
పొదిగిన కౌగిట ఒదిగాను
ఒక కమ్మని కలగన్నాను //

పాట నీవు పాడగా
పల్లవి నేనైనాను
పదనిస రాగమైనాను
పగలంతా రావని తెలిసి
యుగాలు నిదురించే
ఊర్మిళ నైనాను //

చాటున ఉన్నావని
కన్ను గీటినావని
బుగ్గన చిటికేసావని
మనసును వెలిగించాను
మానస వీణను సవరించాను //

ప్రాణ 'మిత్రుడు '

ఇన్ని రంగు లెక్కడివి
నీలి నింగికి
ఇన్ని సొగసు లెక్కడివి
లేత మబ్బుకి
ఆ బొట్టు ఎవరు పెట్టారో
పడమటి నుదుట
ఆ రంగు లెవరు అద్దారో
ఆకాశం ముంగిట

ఒక వెలుగు వెలిగి వెళుతున్నావా
ఓ సూర్యుడా
ఓటమి అన్నది ఎరుగని
ఓ వీర యోధుడా //

వెళ్ళే వేళ నింగి బుగ్గ గిల్లాలని
ఏమిటా ముచ్చట
ఎర్ర రంగు పులిమి ఏ నగిషీలు
చెక్కినా వచ్చట
ఏది ఏమైనా నీ ఆట
చూడ ముచ్చట
ఆరు నూరైనా ఆపకు సుమీ
ఈ వచ్చుట వెళ్ళుట //

ఆ కొండ వెనకాల ఎవరున్నారని
ప్రతి రోజు వెళతావు
వారేమి అన్నారని మరలా
ఈ కొండన ఉదయిస్తావు
మా ప్రాణాలు నిలపాలని
తరలి వచ్చిన వాడా
జీవ రాసిని బ్రతికించగా
నడుం కట్టిన వాడా

ఏమిటో తెలియదు సుమా
ఇలా నీ రాకపోకలు
నీవు రాకుంటే ఈ జగతిని
ఉండునా జీవ రేఖలు //


12, ఏప్రిల్ 2012, గురువారం

దాచిన అందాలు

ఇది నయనం
సిరివెన్నెల దాచుకున్న భువనం
ఇది అధరం
నవమదువును దాచుకున్న సదనం
ఇది హృదయం
ప్రణయం వ్రాసుకున్న కవనం //

పులకించిన తనువున
పచ్చదనం పరిమళం
తిలకించిన క్షణమున
తన్మయం పరవశం

పూచిన మల్లెల తెల్లదనం
పున్నమి వెన్నెల చల్లదనం
నిలువెల్లా మోయలేని లావణ్య విభవం //

అలవోకగ ఎదురైతే
కలవరం కలరవం
అందాలే వరమైతే
ప్రకంపనం ప్రభంజనం

కోయిల పాటల మాధుర్యం
కొమ్మల మాటున సుమహర్మ్యం
ఎగిరే చేలాంచలం సౌందర్య నందనం //

11, ఏప్రిల్ 2012, బుధవారం

ప్రేమ గొప్పదనం

Man asked God !
what is the difference between my love and your love ?
God smiled and said....
''A fish in water is my love
A fish in plate is your love ''

మనిషి దేవుణ్ణి నిలదీశాడు
ఏమిటి నీ ప్రేమయొక్క గొప్పదనం ?
మొక్కవోని చిరునవ్వుతో ,
మంద్ర స్వరంతో దైవం అన్నాడు
''హాయిగావిహరించే
జలధి లోని- జలచరం నాప్రేమ
కంచంలో రుచికరంగా
వడ్డించిన-- కొరమీను నీ ప్రేమ ''

సొంతలాభం కొంత మానుకుని
పరులకోసం పాటు పడమని
తన భాగ్యం, తన సౌఖ్యం
అంతులేని దాహం, స్వార్ధం
నాశనానికి హేతువని
నర్మ గర్భంగా వచించాడు
మాయమై పోతున్న మనిషికి
తన కర్తవ్య మేమిటో విశదీకరించాడు
--------------------------
క్షణ భంగురం జీవితం
పరోపకార మిదం శరీరం
-----------------------------

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఈ నిజం తెలుసుకో ..

How beautiful God keeps on adding one more day in your life - Not only because you need it -
One else need you ................

ఆ దైవం ...
మరొక రోజుని నీకు ప్రసాదించింది
నీ జీవితాన్ని ప్రకాశవంతం చేసింది
నీ ఆయువు మరొక రోజు పొడిగించింది
నీ కోసమే కాదు ......................
నీకు మాత్రమె అవసరమని కాదు

మరి ఎందుకో తెలుసా !
నీ ఉనికి ఈ లోకానికి అవసరమని
మంచితనంతో మానవత్వంతో
నువ్వు ఎందరినో అలరిస్తావని
మమతానురాగాలు ప్రసరిస్తావని

ఒచ్చిన పని విస్మరించి
ఒత్తిడిలో చిత్తడిలో నలిగిపొతూ
జన్మించిన కారణం మరిచిపోకు
అకాల మరణాన్ని
రారమ్మని ఆహ్వానించకు
--------------------------------
ఎంతో దూరం లేదు మృత్యువు
అసలు నిజం అర్ధమయిందా
...........నీకు నీవే శత్రువు
------------------------------------

8, ఏప్రిల్ 2012, ఆదివారం

అలలు మనకు ఆదర్శం

Waves are inspiring ,not because they rise and fall ,
but because they never fail to rise again

పడి లేస్తున్నందుకు కాదు
విరిగి పడినపుడల్లా
తిరిగి ఎగిసి పడ్తున్నందుకు

ఎన్ని సార్లు తుత్తునియలైనా
ఆ పట్టుదల విడిచి పెట్టనందుకు
అలలు మనకు ఆదర్శం

అలుపెరుగని ఆ ఉత్సాహం
ఆ జలధి తరంగ మృదంగ నాదం
నిత్య చైతన్యానికి సంకేతం

నింగిని తాకాలనే ఆరాటం
నిముసమైనా ఆగని ఆ పోరాటం

ఓ మనిషీ!
అవధరించు ఆ కెరటం
అందించే ఆ సందేశం
------------------------------
నిజం కాదు ఓటమి
నీలో ఉంటె ఓరిమి
-----------------------------

ఒంగోలు వృషభం

ఒంగోలు వృషభం

ఇది ఒంగోలు ఎద్దు
నింగి దీని సరిహద్దు

ఇది ఒంగోలు గిత్త
ఉదాత్తం దీని చరిత్ర

ఆ పరమశివుని నంది నడచి వస్తున్నదా ఏమి
మనసు పరవశమొంది నర్తిస్తున్నదా ఏమి

వెన్నెలంతా నీ మీదనే కురిసినట్టుంది
నిండు పున్నమి నీవై నడిచి నట్టుంది

తెలుగు జాతికే నువ్వు గర్వకారణం
జాతి నిన్ను మరిచి పోయింది ఎంత దారుణం

లేపాక్షి బసవన్నా లేచి రావయ్యా
ఈ లేగ అందాలు చూచి పోవయ్యా

ఎంత బాగున్నావే లేగ దూడా
వేయి కన్నులు చాలవులే నిన్ను చూడ

నిన్ను మరిచి పోయినాయి మా పల్లెలు
నింగి మరచి పోయినది వాన జల్లులు

పలకరిస్తే పాడియావులు
పారిపోవా ఎండమావులు

అంతరించి పోతున్నది నీ సంతతి
ఆలకించే వారెవరు ఆ సంగతి

మా గుండెల్లో దాగి వున్న జ్ఞాపకానివి
మా జిల్లా గత వైభవ చిహ్నానివి

7, ఏప్రిల్ 2012, శనివారం

అమ్మ

Out of all relations we make in our journey of life till our last breath ,
the relation with mother is 9 months more .

ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర
ఎన్నెన్నో మమతల మకరందాలు
కడ ఊపిరి దాకా
ఎన్నెన్నో ప్రయాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఎన్ని సంవత్సరాలు గతించినా
నవమాసాలు మోసిన
అమ్మతో అనుబంధం మాత్రం
తొమ్మిది నెలలు నిస్సందేహంగా అధికం
అమ్మ ప్రేమ, లాలన, అనురాగం,
ఆజన్మాంతం వసివాడని జ్ఞాపకం

అనన్యం, అగణ్యం, అపురూపం
అజరామరం, అమ్మ భావనం

మర్మములు తెలుసుకో

Feel the deapth of this sentence !

Even God does not like the hardness of toungue and heart -

That's why he made them boneless ....
నీకు ఈ రహస్యం తెలుసా !నాలుక, హృదయ వాహిక

కఠినంగా, కర్కశంగా ఉండడం

ఆ దైవానికి సైతం , ఇష్టం లేక

మృదుత్వం, లాలిత్యం రంగరించి

అస్థి(త్వం) లేకుండా

శల్య రహితంగా

ఆ రెంటిని మలిచాడు

ఆ విధంగా సర్వ జగతిని

పరిరక్షించాడుమనసు శిరీష కుసుమ పేశలం

మరిచావా బ్రతుకు బడబానలం

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

చిత్రం

Funny but true thought !!
In the past, nobody had watches ,but every one had time .
Now every one has a watch, but nobody has time.

చిత్రంగా లేదూ !!
పూర్వం ఎవరికీ చేతి గడియారం ఉండేది కాదు
అయినా బోలెడు సమయం వారి చెప్పు చేతల్లో ఉండేది
ప్రస్తుతం అందరి ముంజేతికి అందమైన వాచీలు న్నాయి
కాని పక్క వాణ్ని పలకరించే తీరిక లేదు
తనను తాను పరికించుకొనే వ్యవధి లేదు
నిలబడి నీళ్ళుతాగే ఆలోచన లేదు
నిండుగా శ్వాసించే యోగం లేదు

జీవితం ఓ పరుగు పందెం
ఆదమరిచావా తెగును బంధం

3, ఏప్రిల్ 2012, మంగళవారం

అవాక్కయ్యాను

ఒకాయన అడిగారు
'ఇదంతా ఎవరు చదువుతారు ' అని
అది దీర్ఘ కవిత ,అందులో జీవిత ముంది ,అగాధాలున్నాయి, వెన్ను చరుపు లున్నాయి
ఆయన్ని అడిగాను ''ఒక విషయం అడుగుతాను మీరేమి అనుకోరు కదా ''
అబ్బే అడగండి
మీరు పడి పడి సంపాదిస్తున్నారు కదా !నిద్రాహారాలు మాని కోట్లు కూడబెడ్తున్నారు కదా! , అదంతా ఎవరు తింటారు?
అంతే అవాక్కయ్యాడు
''ఈ విషయమే ఇందులో రాసాను ఇది తెలియకే మీ లాంటి వాళ్ళు జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటున్నారు
మీకు మీరే కాకుండా, అనురాగాలకు అనుబంధాలకు అసలు మానవతకు దూరంగా జరిగి పోతున్నారు
ఆఖరి అంకంలో ఆలు బిడ్డల్ని విస్మరించి అయినవారికి దూరంగా 'అయ్యో ఇంత జీవితం వృధా చేసుకొన్నామే ' అని వాపోతున్నారు , అది ఏమిటో ఇప్పుడే ఆగి ఆలోచించమని ఇది రాసాను ''
ఏమనుకున్నాడో ఏమో అతను
ఒక పుస్తకం అడిగి తీసుకోని చక్కా పోయాడు
ఇక రాడనుకున్నాను
మర్నాడు హటాత్తుగా వచ్చి 'ఓ వంద కాపీలు ఇవ్వగలరా 'అన్నాడు ఓ పదివేలు అక్కడ పెట్టి
వేలు వద్దన్నాను
''కాదనకండి, ఇలాంటి కావ్యాలు ఇంకా రాయండి ,రాబోయే కావ్య ముద్రణకు నాకు అవకాశమివ్వండి ''
ఇప్పుడు అవాక్కవ్వడం నా వంతయ్యింది

1, ఏప్రిల్ 2012, ఆదివారం

ఆక్రందన

దేశం కన్నీరు పెడుతోంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తోంది
ధర్మం దుఖితమతియై రోదిస్తోంది
న్యాయం తన ఉనికి ఎక్కడో శోధిస్తోంది
పాపం ప్రపంచ మార్గమై పయనిస్తోంది

అఖండ శేముషి ఆర్జించిన మనిషి
తనవేషం మార్చుకొన్నాడు
శిరీష కుసుమ పేశలమైన మనసునిండా
మోసం ద్వేషం పేర్చుకొన్నాడు
సత్యం నీతి నియమం విస్మరించి
నిత్యం వేటాడడం నేర్చుకొన్నాడు

కులం మతం ఒక్కటైన కాలం
అందరు అన్నదమ్ములై వెలిగిన దశాబ్దం
ఊరు మొత్తం ఒక కుటుంబమైవర్ధిల్లిన స్వర్ణ యుగం
ఎక్కడో చరిత పుటల్లో దాగి పోయింది
మానవుడు మాధవుడుగా మారిన మహర్దశ
అక్కడెక్కడో ఆమడల దూరాన ఆగిపోయింది
ఒకరినొకరు ఆదుకొన్నసంఘటనలు
పరస్పరం ఒదార్చుకొన్నసన్నివేశాలు
కాశీమజిలి కధలుగా మిగిలిపో యాయి

అడుగడుగునా వాడ వాడలా ఎదురౌతున్న
నరకాసురులు, బకాసురులు, కీచకులు
హంతకులు ,నయ వంచకులు, పరాన్న భుక్కులు
ఎవరు వీళ్ళు !ఏకాలం వాళ్ళు! ఏ యుగం వాళ్ళు ?

ఏ గుండె తలుపు తట్టినా ఎండమావుల కల కూజితం
ఏ మనిషిని తట్టి చూచినా కనిపించే ఆకలి కీకారణ్యం