31, జనవరి 2013, గురువారం

ఏం చేస్తుంటావు ?ఏం చేస్తుంటావు ?
కవిత్వం వ్రాస్తుంటాను
ఏమిటీ !
కవిత్వం ....
దేన్ని గురించి
మనిషి గురించి
మనిషా ?!
మనిషి లోని మనసు గురించి
ఇంకా ఏం  చేస్తుంటావు
పాటలు రాస్తుంటాను
పాడుకొంటూ ఉంటాను 
ఆహా ఏమి పాటలో అవి
మధువులు కురిపించే పాటలు
 ఎదలను మురిపించే పాటలు
ఇంకా....
నన్ను నేను ప్రేమిస్తుంటాను
ఆహా ......
 లోకాన్ని ప్రేమిస్తుంటాను
అబ్బో అది గొప్పే

నీతి  నిజాయితీ మరచి
నిస్సిగ్గుగా
నిప్పుల్లో నడిచే
నీ లాంటి వాళ్ళను
నిరసిస్తుంటాను
.....................
అవినీతి అక్రమార్జన
అధికార దుర్మదాంధకారాన్ని 
అవి మోసుకు తిరిగే వారిని
 భస్మం చేస్తుంటాను

నువ్వు మామూలు మనిషివి కాదు

ఔను కాను
నేను కవిని
లోకాన్ని వెలిగించే రవిని
నీవంటి వారి దుర్మార్గాన్ని 
అహంకారాన్ని  ఖండించే భార్గవిని

( ఒకసారి నా కావ్యం ''ఆరడుగుల నే ల ....''
పైన ప్రచురణలు లో ఉన్నది -తొంగి చూడాలని కొరుకొంటూ ...)

ఉదయానికి వందనం

నన్ను ప్రాణాలతో
సజీవంగా నిన్నటి నుంచి
నేటికి నడిపించు కొని వచ్చిన
ప్రభాతానికి వందనం
గాఢ  నిద్రను
దీర్ఘనిద్రగా మలచకుండా
తెల్ల వారే దాకా నన్ను కాపాడిన
చల్లని రాత్రికి అభివందనం
కలత నిదురన్నది 
నన్ను దరిజేర నీయకుండా
మధుర స్వప్నాల డోల లూగించిన
కలలకు అభినందనం
ఆప్యాయంగా పలకరించిన
తొలి కిరణానికి
అపురూపంగా నను తాకిన
మలయ పవనానికి
చిరు నవ్వుతో ఎదురైన
నవ వికసిత కుసుమానికి
నడక దారిలో నన్ను
మురిపించిన
మందహాసానికి
తెల తెలవారిందని చాటి చెప్పే
పక్షుల కిలకిలరావానికి
నా రాకను గమనించి
తన్మయంగా తలలూచిన
తరు శాఖలకు
  అలజడి లేకుండా
ఈ కవనపు తోట లోనికి
ప్రవేశించేందుకు
అవకాశం  కల్పించిన
నా మానసానికి
మనసా నమామి !
శిరసా నమామి!