26, ఫిబ్రవరి 2012, ఆదివారం

రైతు గీతం

ఏ పల్లెను చూచినా ఏమున్నది గర్వ కారణం
ఏ గుండె తలుపు తట్టినా ఎడారి రోదనం
ఎదుగు బొదుగు లేక ఎండిన జన జీవనం
ఏరువాక కానరాక రైతు బ్రతుకు దారుణం //

ఏవి తల్లీ నిరుడు పండిన పాడి పంటలు
ఏవి తండ్రీ నిన్న నిండిన పసిడి గాదెలు
ఎవరు రాసిగా పోసినారో నీ నొసట బాధలు
ఏ చరిత పుటలలో దాచినారో ఆనాటి మధుర గాధలు //

వానకారు ఒట్టిపోగా ఏతమైనావు
ఎండమావులు ఎదురు రాగా రాత అన్నావు
అప్పులెన్నిచేసినవో ఆస్తి అంతా వేలమాయే
ఆరుగాలం పడిన కష్టం హారతి కర్పూర మాయే //

ఎవరు రారు ఎవరు రారు నీకోసం ఎవరు రారు
ఎవరు రారని ఊరకుంటే ఏరువాకలు కదిలి రావు
ఏకమై రైతులంతా ఒక లోకమై కదలి రండి
అన్యాయం అక్రమం ఎక్కడున్నా ప్రతిఘటించండి
అందరిని అలరించే నాటికాలం పాతలోకం ఇలకి దించండి
కొందరినే వరించిన భోగ భాగ్యం సౌభాగ్యం అందరికి పంచండి //

 వెన్నెముక నీవు - అందుకేనేమో వెనుకబడి వున్నావు
దుక్కిదున్నిన నాగలివి నీవు- దిక్కు తోచక దిగాలుగా ఉన్నావు//

16, ఫిబ్రవరి 2012, గురువారం

సంధ్యా సమీరం

ఒకటే జననం ...
ఎన్ని మరణాలో
ఒకటే జీవితం ...
ఎన్ని విభిన్న చరణాలో,
ఎన్ని మరణ చరణ కింకిణీరవాలో
ఒకటే గమనం ....
ఎన్ని కన్నీటి చరణాలో
అగమ్య తమస్విని గహ్వరాల పయనాలో
ఒకటే భ్రమణం ....
దారి పొడుగునా ఎన్ని దగ్ధ గీతాలో
అనావిష్క్రుత కావ్యాలో ఎన్ని గర్వ భంగాలో ,
ఎన్ని విరిగి పడిన తరంగాలో
ఒకటే దాహం .....
ఎన్ని కన్నీటి సంద్రాలు ఆపోశన పట్టినా
ఎంతకు దప్పిక తీరని హాహాకారాలో
ఒకటే శోకం ...
ఎన్ని గగనాంగనాలింగానాలో
పరమపద సోపానపటంలో ఎన్ని సర్ప పరిష్వంగాలో
ఒకటే గమ్యం ...
ఎన్ని వెన్నెల గీతాలు ఎదురైనా
వాకిలిలో ఎన్ని వేకువలు కొలువైనా,
ఎన్ని స్వయం కృతాపరాధాలో
ఒకటే ప్రాణం .....
నిర్వాణ సోపాన మధిరోహణంలో
ఎన్నిఅవహేళనలో ఎన్ని ఆశని పాతాలో
ఒకటే ఖననం ఒకటే దహనం .......
కనుమరుగౌతున్న ఎన్ని జీవన రహస్యాలో
ఎన్ని కాలుతున్న దృశ్యాలో

మమతల సడి

నా కనులలో ఇంకా తడి ఉన్నది
మాసిపోని మమతల సడి ఉన్నది
నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది
ఏనాటిదో శోకం నా వాకిట పడి ఉన్నది
ఇన్ని యుగాలుగా నలిగిన నా హృదయం
నీ సన్నిధి చేరాలని తహ తహ పడ్తున్నది
కన్నీటి ప్రవాహంలో కాలం కొట్టుకు పోయినా
కత్తుల వంతెనపై నడిచి నట్లున్నది
నువ్వు లేని ఈ లోకం
నిప్పుల సుడిగుండం వలె ఉన్నది
ఎంతకు చల్లారని ఈ శోకం
ఉప్పెనలా ఎగిసి పడ్తున్నది
ఎందుకో ఎద లోపల ఈ వేళ
చితి మంటల చిట పట వినిపిస్తునది
ఏనాటిదో ఈ ఓటి పడవ
తిరిగి రాని లోకాలకు పయనిస్తున్నట్లున్నది

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఒక రేయి అడిగింది

ఒక రేయి అడిగింది
ఒంటరిగా ఎలా ఉన్నావని
కనుదోయి అడిగింది
కబురులు కావాలా అని //

చిగురు పెదవి నవ్వింది
చిత్రాలు చేసుకొమ్మని
చిరు నవ్వు చెప్పింది
కావ్యాలు రాసుకొమ్మని
సిగపువ్వు పిలిచింది
యుగళ గీతమై రమ్మని

మొగమాట మేలంది
మొగలిపూల సౌరభం
తగుమాట లాడింది
దరిజేరిన తన్మయం
బిగువింక చాలంది
బిడియాల గడుసుదనం

ఒడిలోన వాలింది
సుడిగాలి సోయగం
మిడిమేల మేలంది
నాలోని ఓ సగం
ఇక చాలు చాలంది
నడిరేయి నాటకం

పురి విప్పిన పరువాలు

దాచుకోకమ్మా కోకమ్మా
పూతరేకుల పరువాలు
దాచాబోకమ్మా రైకమ్మ
పూలతావుల లావణ్యాలు //

ఎంత దాచినా దాగవులే
దోరదోర అందాలు
ఎంత ఆపినా ఆగవులే
అరజారిన పయ్యెదలు

ఏ పాపం ఎరుగవులే
కంపించే అధరాలు
ఏ శాపం ఇవ్వవులే
ఎరుపెక్కిన నయనాలు //

ఎవరో ఒకరికి ఇవ్వాలి
దాచిన సిరి సంపదలు
ఇంకొకరికి అంకిత మివ్వాలి
మూసిన పెదవుల ముచ్చటలు
ఏ ఎండ కన్ను ఎరుగనివి
పురి విప్పిన పరువాలు
ఎంత ఇచ్చినా తరగనివి
ఈ ముద్దు మురిపాలు //

ఈ శోకం ఎన్నాళ్ళు

చీకటి వాకిట ఉన్నావా
ఈ శోకం ఎన్నాళ్లన్నావా
వేకువ రాకను చూసావా
తూర్పు తీర్పును విన్నావా
అదే అదే జీవితం --ఏదీ కాదు శాశ్వతం
మానును నిన్నటి గాయం- గాయం మానుట ఖాయం//

శోకం పొంగిన వేళ ఆగదులె కన్నీరు
ఆనందంలో కూడా అదియే కన్నీరు
నవ్వినా ఏడ్చినా కన్నీరే
కన్ను తెలుసుకున్న ఆ సత్యం
మనిషికి తెలియదు విచిత్రం//

ఆకులు రాలిన వేళ
చెట్టుకు లేదు శోకం
చిగురులు వేసిన వేళ
అంతా హర్షాతిరేకం
అరుదెంచిన ఆ ఋతు గానం
ప్రక్రుతి నేర్చిన ఆ పాఠం
మనకు తెలియదు మన ఖర్మం //

ఇది ఏమి లోకం

ఇది ఏమి శోకం ఇది ఏమి లోకం
ఇది ఏమి దాహం ఇది ఏమి మోహం
ఇలా దీనాతి దీనంగా హీనంగా
నీచ నికృష్ట నిబిడాంధకారంగా
ఎన్నాళ్లీ శోకదావానల దగ్ధ గీతం
దుర్భర దుస్సహ దుర్వినీత జ్వలిత గానం //

ఇరుగు పొరుగు తెలియక
ఈ పరుగులెందుకో తెలియక
మనసుకి హృదయానికి శృతికలవక
ఎంత కాలమీ తికమక
ఎందు కోసమీ యవనిక //

నిదుర రాని రాత్రులు
పనికి రాని ఆస్తులు
తన మరణ శాసనం తానె రాసుకొని
సాగి పోతున్న శవ యాత్రలు
దగ్ధ మౌతున్న సజీవ పాత్రలు//

8, ఫిబ్రవరి 2012, బుధవారం

ఈ దారిన వస్తావో రావో !

ఎందరో ఈ దారిని నడిచి వెళ్ళారు
తమ జ్ఞాపకాల్ని అపురూపంగా విడిచి వెళ్ళారు
చిరునవ్వులు వెదజల్లుకొంటు వెళ్ళారు
సిరి వెన్నెల సంబరంగా మోసుకెళ్ళారు
అనురాగంతో అంధకారాన్ని అధిగమించారు వాళ్ళు
బృందగానంతో బాధల్ని మధించారు వాళ్ళు
సంకల్పాన్ని అవలీలగా సాధించారు
సంతోషాన్ని కడదాకా మోశారు
ఆ మహనీయుల అడుగు జాడల్ని అద్భుతంగా తిలకిస్తున్నారు
వారి మహోన్నత చరితను అనాదిగా పఠిస్తున్నారు
ఎందుకో మరి అందరూ మహాత్ములు కాలేక పోతున్నారు
ఏలనో మరి మహాభి నిష్క్రమణం చెయ్యలేక పోతున్నారు

కౌగిలి కారాగారం

ఒక చిన్ని నవ్వు
ఏమి మంత్రం వేసిందో
ఒక చిలిపి సైగ
ఎంత రాద్దాంతం చేసిందో
కనురెప్ప వొంగి
ఎన్ని కర్పూర దీపాలు వెలిగిం చిందో
కంటిపాప ఒదిగి
ఎన్ని స్వప్నాలు రాసి పోసిందో
ఎగురుతున్న పయ్యెద
ఎన్ని ఏకాంతాలు కల్లోలితం చేసిందో
నడుమల్లన ఊగి
ఎన్ని ఇడుములు సృష్టిం చిందో
జడ కరినాగై సాగి
ఎన్ని సార్లు కాటు వేసిందో
ప్రతి కదలిక ఇలా ప్రాణాంతకమై పోతుంటే
కాలం గిలగిలా కొట్టు కొని ఆగి పోతుంటే
తప్పకుండా ఇది శిక్షార్హ మైన నేరం
తప్పదు, నీకీ కౌగిలి కారాగారం

ఆనంద తాండవం

ఒక్క నీ ఉహ చాలు
చిగురిస్తాయి నాలో శాంతి వనాలు
ఒక్క చల్లని చూపు చాలు
నాలో వికసిస్తాయి కాంతి సుమాలు
ఒక్క తలపు చాలు
మేలు కొంటాయి నాలో వేల కవనాలు
ఒక్కపిలుపు చాలు
ఒళ్ళు విరుచు కొంటాయి
అణువణువునా భువనాలు
పక్కన నువ్వుంటే చాలు
రెక్కలు కట్టుకొని
రివ్వున విహాయసంలోకి ఎగిరి పోతాను
రేకులు విప్పుకొని
పరిసరమంతా పరిమళాలు కురిసి పోతాను
అక్కున చేర్చు కొంటే చాలు
అమని వెదజల్లు కొంటు
హాయి వెల్లువలో పరవసించి పోతాను
ఆ నీల గగనాలు స్పర్శించి
ఆనందతాండవం చేస్తాను

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

దేవత

అతడు మరిచిపోయిన మధు మాధుర్యం
అతడు విస్మరించిన జీవన సంగీతం -------ఆమె
ఎంత శ్రమిం చినా లభించని జీవన సౌభాగ్యం
వెన్నంటి ఉండే ఆరోగ్య మహా భాగ్యం----- ఆమె
ఏ ఉరుకులు పరుగులలో దొరకని సిరి
అపురూపమైన ఆనంద జీవన ఝరి -----ఆమె
బ్రతుకంతా తోడోచ్చే ఓదార్పు
కడదాకా లాలించే నిట్టూర్పు
అలౌకిక ఆనంద గీతమామె
నూరేళ్ళ జీవన రాగాన్ని
నవ మోహనంగా ఆలపిం చేందుకు
దివినుంచి దిగి వచ్చిన దేవత ఆమె

2, ఫిబ్రవరి 2012, గురువారం

స్వప్నం


భారంగా
ఒక మూట బుజాన వేసుకొని
ఓ యువకుడు కదిలి పోతున్నాడు
బాగా చదువుకొన్నవాడు
పేరు చివర అందంగా
డిగ్రీలు పెర్చుకోన్నవాడు
కుతూహలం కొద్ది
మాట మాట కలిపి
ఏమిటి విషయం అన్నాను
మూట విప్పి చూపించాడు
అప్రతిభుణ్నయ్యాను
అక్కడున్నది
ఒకే ఒక సుదీర్ఘ సప్నం
కట్నం