31, జనవరి 2013, గురువారం

ఉదయానికి వందనం

నన్ను ప్రాణాలతో
సజీవంగా నిన్నటి నుంచి
నేటికి నడిపించు కొని వచ్చిన
ప్రభాతానికి వందనం
గాఢ  నిద్రను
దీర్ఘనిద్రగా మలచకుండా
తెల్ల వారే దాకా నన్ను కాపాడిన
చల్లని రాత్రికి అభివందనం
కలత నిదురన్నది 
నన్ను దరిజేర నీయకుండా
మధుర స్వప్నాల డోల లూగించిన
కలలకు అభినందనం
ఆప్యాయంగా పలకరించిన
తొలి కిరణానికి
అపురూపంగా నను తాకిన
మలయ పవనానికి
చిరు నవ్వుతో ఎదురైన
నవ వికసిత కుసుమానికి
నడక దారిలో నన్ను
మురిపించిన
మందహాసానికి
తెల తెలవారిందని చాటి చెప్పే
పక్షుల కిలకిలరావానికి
నా రాకను గమనించి
తన్మయంగా తలలూచిన
తరు శాఖలకు
  అలజడి లేకుండా
ఈ కవనపు తోట లోనికి
ప్రవేశించేందుకు
అవకాశం  కల్పించిన
నా మానసానికి
మనసా నమామి !
శిరసా నమామి!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి