18, జనవరి 2018, గురువారం

అవాక్కయ్యాను
-----------------
ఒకాయన అడిగారు
'ఇదంతా ఎవరు చదువుతారు ' అని
అది దీర్ఘ కవిత ,అందులో జీవిత ముంది ,
అగాధాలున్నాయి,
వెన్ను చరుపు లున్నాయి
ఆయన్ని అడిగాను
''ఒక విషయం అడుగుతాను
మీరేమి అనుకోరు కదా ''
అబ్బే అడగండి
మీరు పడి పడి సంపాదిస్తున్నారు కదా !
నిద్రాహారాలు మాని కోట్లు కూడబెడ్తున్నారు కదా! ,
అదంతా ఎవరు తింటారు?
అంతే అవాక్కయ్యాడు
''ఈ విషయమే ఇందులో రాసాను
ఇది తెలియకే మీ లాంటి వాళ్ళు
జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటున్నారు
మీకు మీరే కాకుండా,
అనురాగాలకు అనుబంధాలకు
అసలు మానవతకు దూరంగా
జరిగి పోతున్నారు
ఆఖరి అంకంలో ఆలు బిడ్డల్ని విస్మరించి
అయినవారికి దూరంగా '
అయ్యో ఇంత జీవితం వృధా చేసుకొన్నామే '
అని వాపోతున్నారు ,
అది ఏమిటో ఇప్పుడే ఆగి ఆలోచించమని ఇది రాసాను ''
ఏమనుకున్నాడో ఏమో అతను
ఒక పుస్తకం అడిగి తీసుకోని
చక్కా పోయాడు
ఇక రాడనుకున్నాను
మర్నాడు హటాత్తుగా వచ్చి
'ఓ వంద కాపీలు ఇవ్వగలరా 'అన్నాడు
ఓ పదివేలు అక్కడ పెట్టి
వేలు వద్దన్నాను
''కాదనకండి, ఇలాంటి కావ్యాలు ఇంకా రాయండి ,
రాబోయే కావ్య ముద్రణకు నాకు అవకాశమివ్వండి ''
ఇప్పుడు అవాక్కవ్వడం
నా వంతయ్యింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి