12, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఉగాది అంటే ఉల్లాసం

ఉగాది  అంటే ఉల్లాసం
ఉగాది అంటే ఉత్సాహం  
ఉర్వి నలు చెరగులా నడిచే నవనవో న్మేషం
అనంత కాల గమనం లో
ప్రతి ఏటా ప్రకృతి పాడుకొనే ఉజ్వల గీతం

ఈ ఆనందం ఈ అద్భుతం ఎవరికీ!!!
ప్రకృతికి , పచ్చదనం పరచుకున్నలోగిళ్ళకి
కొమ్మలకి, కోయిలమ్మకి, కొత్త చిగుళ్ళకి
విరబూసిన వేప చెట్టుకి
విరగకాసిన మామిడి కొమ్మకి
చండ  ప్రచండంగా ప్రకాశించే భానుడికి
వస్తున్నామని హెచ్చరించే వడగాలులకి
 ఉగాది అంటే ఉల్లాసం  ఉత్సాహం

మరి నీకు నాకు ఈ మనిషికి
ఏమున్నది కొత్తదనం...
వచ్చిందా నవోదయం
ఇది నిన్నటి ఉదయమే
నిన్నటి హృదయమే
నిరంతరం ఎగిసిపడే కల్లోల కడలి తరంగమే
నిన్నటి దాహమే  నిబిడాంధకారమె
నూతనత్వం చేతనత్వం  ఏనాడు  
కనీ విని ఎరుగని కూపస్త మండూకం లా
స్వేచ్చా స్వాతంత్ర్యాలు విడనాడి
ఒకే గాడిలో తిరుగాడే గానుగెద్దు  నడకలా
నిరాశలో నిర్వేదంలో నిస్తేజం లో 
ఏమిటి జీవితం !!
ప్రకృతికి లాగే మనిషికి
ఆరు ఋతువులు ఉంటే ఎంత  బాగుండును
ఈ వసంత మాసం ఈ కోయిల గీతం ఈ పచ్చదనం పరవశం
మన జీవితాలలోకి అనునిత్యం తరలి వస్తే ఎంత బాగుండును

అదేమి  చిత్రమో  
అవనికి ఆరు ఋతువులు అయితే
ఈనాటి మనిషికి ఒకే ఒక ఋతువు
దాని పేరే ధన ఋతువు
 జీవించి నన్నాళ్ళు
ఆనందం సుఖము శాంతి అన్ని కరువు
దాని పర్యాయపదమే అవినితి అక్రమార్జన
దాని పర్యవసానమే మద్యపానం మనోవేదన
జీవిత పర్యంతం ఎంత ఉన్నా ఎంత తిన్నా
ఇంకా కావాలని రోదన
ఆరని తీరని వేదన ఆవేదన
 ఈ రుతువులోనే తెల్లారి పోతుంది మనిషి జీవితం
ఈ క్రతువు తోనే మసక బారి పోతుంది కల్లోల భారతం

 ఏ ఉగాది వినిపిస్తుంది అసలైన జీవన సత్యాన్ని
ఏ ఉగాది విశదీకరిస్తుంది  మానవ జీవన తత్వాన్ని
ఏ ఉగాది కొని తెస్తుంది ఇలపైకి స్వర్గాన్ని

అందుకే నేను కోయిలనై
కొమ్మ కొమ్మకు ఎగురుతున్నాను
కొత్త పాటలు కట్టి
మనిషి మనిషికి వినిపిస్తున్నాను
ఈ గాలి విరాళి ఈ నేల ఈ పచ్చదనం
ఈ ఆనందం ఈ అభినివేశం
 ఈ గీతం ఈ గానం  మీ కోసం
అని దీవిస్తున్నది అరుదెంచిన ఈ మధుమాసం
హాయిగా ఆలకించండి ఈ 'విజయ' దరహాసం

2 కామెంట్‌లు:

  1. జీవన సత్యాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఉగాది పండుగ నుండి ఇలా తెలుసుకోవానే సందేశం బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. రవీ ,
    ధన్యవాదాలు . కోయిలని, ఆమనిని కాదని కొత్త సంవత్సరాన్ని
    సరి కొత్తగాపలకరించాను .అది నచ్చని ఒక కోయిల ఇది న్యాయం కాదని ప్రతి రోజు గొంతెత్తి నన్ను పలకరిస్తోంది , నిలదీస్తోంది . అందుకనే ఇప్పుడు నాదైన లోకంలో కవితలు గీతాలు రాస్తున్నాను . నీ అభిమానానికి మరొక్కసారి ...

    రిప్లయితొలగించండి