18, జనవరి 2018, గురువారం

ఆకు నాకు ఆదర్శం
---------------------
చినుకు పడిన వేళ
చిగురులు తొడిగిన
చిన్నారి ఆకు నాకు ఆదర్శం
నిశ్చింతగా నిర్మలంగా
చిరుగాలి వొడిలో
సయ్యాట లాడే
ఆకు నాకు ఆదర్శం
వెచ్చని వేసవిని తలదాల్చి
విసిగి వేసారిన జగతికి
చల్లని నీడ నిచ్చి సేద దీర్చి
రాలిపోయే ఆకు నాకు ఆదర్శం
చిన్నారి మొగ్గలకు ఊపిరు లూది
చిగురాకు పొత్తిళ్ళలో జోలపాడి
పురుడు పోసిన ఆకు నాకు ఆదర్శం
రంగు రంగుల రంగేళి ,
వయ్యారి గాలి తరగల తేలి
రెపరెప లాడే ఆకు నాకు ఆదర్శం
పాడు గాలి తాను తాగి
ప్రాణ వాయువు పుక్కిలించి
జగతి ప్రగతికి ఊతమిచ్చే
ఆకు నాకు ఆదర్శం
చింత లన్ని దీరి
చివరకు రంగు మారి
తన తనువు చాలించి
మరో చిగురాకుకు చోటిచ్చి
చాటిన అసమాన త్యాగం
అదే కదా కర్మ యోగం
ఆ ఆకు నాకు ఆదర్శం....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి