2, ఏప్రిల్ 2018, సోమవారం

నువ్వు లేని నేను....
------------------------
ఇది ...విషాద వియోగాల సమ్మేళనం
ఇది నిశీధి నిరామయాల సహజీవనం
నీ చిరునవ్వులు కనిపించక
చిన్నబోయిన ఉదయాలు
నీ కనుసన్నలు కనిపించక
నివ్వెరపోయిన కుసుమాలు
సుతిమెత్తని నీ చేతి వేళ్ళలో
ఊపిరి పోసుకున్న పారిజాతాలు
సుమకోమలమౌ నీ గళ సీమలో
శృతి చేసుకున్న మౌనగీతాలు
నీ చల్లని మమతల పందిళ్లలో
అల్లుకున్న రాగబంధాలు
నన్ను నిలదీస్తున్నవి ..
నీ రూపం.. కనబడదేమని ప్రశ్నిస్తున్నవి
నీ మందహాసం కోసం ..పరితపిస్తున్నవి
నీ ఆత్మీయ స్పర్శకోసం అలమటిస్తున్నవి
ఎన్ని మమతలు...
మూటకట్టుకొనిపోయావో
ఎన్ని మలయానిలాల్ని
వెంటగొని పోయావో
ఎన్ని మానసాల్ని
దోచుకొని వెళ్ళావో
ఎంత రాజసాన్ని
మోసుకొని వెళ్లావో
ప్రకృతి దీనంగా విలపిస్తున్నది
పరిసరం వెక్కివెక్కి రోదిస్తున్నది
ప్రత్యూషం ఎంతకీ తరలి రాకున్నది
ప్రసూనం మొగ్గలోనే దాగున్నది
నీ సమక్షంలో ..ఎన్ని నిముసాలు
మధుమాసాలై కుసుమించాయని
నీ సన్నిధిలో ..ఎన్ని రోజులు
సన్నజాజులై వికసించాయని
నీ సాహచర్యంలో.. ఎన్ని ఊసులు
నెలవంకలై హసియించాయని
నీ సన్నిధానంలో ఎన్ని సంక్రాంతులు
నేల దిగి నడిచాయని....
(ఆమె ..అర్ధాంతరంగా
అంతర్ధాన మైన వేళ...
నాతో పాటు ప్రకృతి సైతం ..
ఎంతగా విలపించిందో ..
నేను వ్రాసిన దీర్ఘకవిత
"నువ్వు లేని నేను"..
స్మృతి కావ్యం నుంచి..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి