2, ఏప్రిల్ 2018, సోమవారం

అర్ధరాత్రి ..
ఒక అక్షరం నన్ను తట్టి లేపింది
ఏమైంది అన్నాను
నాకు నిద్ర పట్టడం లేదు
నన్నేం చెయ్య మంటావు 
ఏదైనా ఒక మంచి కథ చెప్పు
ఇప్పుడా !
తప్పదు మరి
ఒక కవిత వినిపిస్తాను
పోనీ ఒక పాట పాడు
ఈ నిసి రాతిరి వేళ నన్నిలా ..
యాగీ పెట్టడం అన్యాయం అన్నాను
ఏం చెయ్యమంటావు
నువ్వే కదా నాకు ఒక రూపం కల్పించి ..లాలించే విరించివి..
సరే..సరే..
తక్షణం
ఒక ఊహని రమ్మని పిలిచి
తనని ఒక కవితగా మలిచి
ముత్యాల ముఖ పుస్తకం
పల్లకి నధిరోహింపజేసి
ఇక లోకంలో ఊరేగమన్నా ను
నన్ను చూచి చిలిపిగా కన్ను గీటి
ఇక తెల్లరేదాకా నిద్రపో అన్నది
ఏమో ...
వేకువనే ఎన్ని గుండెలు తట్టి
ఎందరి హృదయాలలో దూరి
ఎంత మంచి నిదురను కాజేసిందో
ఈ కవితా మహాతల్లి...
ఉదయాన్నే అందరిని అడగాలి...

క్రింగ్ క్రింగ్.....
అర్ధరాత్రి నన్ను తట్టి లేపిన అక్షరాన్ని, ఒక కవితగా మలిచి ,ముఖపుస్తకం పల్లకి ఎక్కించి ,లోకంలోకి వెళ్ళమని టాటా చెప్పానో లేదో.. అది ఏకంగా కానీ ఖర్చు లేకుండా, ఏ passport ,visa, విమానం అవసరం లేకుండా నే అమెరికా వెళ్లి ,అక్కడ న్యూజెర్సీలో, మనుమరాలితో ముచ్చట లాడుతున్న ఒక తాతయ్య ని కితకితలు పెట్టినట్టు ఆ మిత్రుడు ఇప్పుడే ఆనందంగా చెప్పాడు
ఔరా అక్షరమా!
పాదలేపనం తో ప్రవరుడు తృటిలో హిమాలయాలకు వెళ్లినట్టు., కానీ ఖర్చు లేకుండా అమెరికా వెళ్ళావా ..అని ఆశ్చర్య పోతుండగా
క్రింగ్ క్రింగ్.... ఫోన్
ఎవరూ
నేను నీ అక్షరాన్ని
అదేమిటి అమెరికా వెళ్ళావు
అక్కడ ఇండియాలో అందరూ నిద్రపోతుంటారుగా
ఏమి తెలివి తేటలు
అన్నీ తమరి దయ, కరుణా కటాక్షమే కదా కవివర్యా..
అంతగా పొగడకు
ఔను మీ అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉన్నారన్నావు వెళ్ళి పలకరించి వచ్చేదా..
అంత పని చెయ్యకు.. వాళ్ళు వారి కార్యాలయాలలో busy గా వుంటారు
అయితే మిగతా మన తెలుగు మిత్రులను కలుస్తాను
సరే.
sorry..
నిద్రపో మళ్ళీ లేపినట్టున్నాను
ఉదయాన్నే కలుస్తాను
ఫోన్ పెట్టేసింది ..గడుగ్గాయి
-----అర్ధరాత్రి అక్షరానికి.ఆకృతి కల్పించిన వైనం..ముందు post లో చూడండి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి