2, ఏప్రిల్ 2018, సోమవారం

ఉగాది అంటే ఉల్లాసం
ఉగాది అంటే ఉత్సాహం
ఉర్వి పైకి నవవసంతం
నడిచి వస్తున్నదన్న సంకేతం
అనంత కాల గమనంలో
ఈ విశాల విశ్వంలో ప్రతి ఏటా
ప్రకృతి పాడుకొనే ఉజ్వల గీతం
ఈ ఆనందం ఈ అద్భుతం ఎవరికీ!!!
ప్రకృతికి , పచ్చదనం పరచుకున్నలోగిళ్ళకి
కొమ్మకొమ్మకి, కోయిలమ్మకి, కొత్త చిగుళ్ళకి
విరబూసిన వేప చెట్టుకి
విరగకాసిన మామిడి కొమ్మకి
చండ ప్రచండంగా ప్రకాసించే భానుడికి
వస్తున్నామని హెచ్చరించే వడగాలులకి
ఉగాది అంటే ఉల్లాసం ఉత్సాహం
ఉగాది ఆగమించిన వేళ..
జగమంతా ఎల్లెడలా నవనవోన్మేషం
మరి నీకు నాకు ఈ మనిషికి
ఏమున్నది కొత్తదనం...
అసలు మనకు వచ్చిందా నవోదయం
ఇది నిన్నటి ఉదయమే
నిన్నటి హృదయమే
నిరంతరం ఎగిసిపడే
కల్లోల కడలి తరంగమే
నిన్నటి దాహమే
నిశ్చల నిబిడాంధకారమె
నూతనత్వం చేతనత్వం
ఏనాడు కనీ విని ఎరుగని
కూపస్త మండూకం లా
స్వేచ్చా స్వాతంత్ర్యాలు విడనాడి
ఒకే గాడిలో తిరుగాడే గానుగెద్దులా
నిరాశలో నిర్వేదంలో నిస్తేజంలో
ఏమిటి ఈ దుర్భర దుస్సహ జీవితం
ప్రకృతికి లాగే మనిషికి
ఆరు ఋతువులు ఉంటే ఎంత బాగుండును
ఈ వసంత మాసం ఈ కోయిల గీతం
ఈ పచ్చదనం పరవశం
మన జీవితాలలోకి అనునిత్యం
తరలి వస్తే ఎంత బాగుండును
అదేమి చిత్రమో
అవనికి ఆరు ఋతువులు అయితే
ఈనాటి మనిషికి ఒకే ఒక ఋతువు
దాని పేరే ధన ఋతువు
ఎంత వున్నా ఇంకా ఇంకా
కావాలనే ఆకలి ఋతువు
ఇదేమి కర్మమో
ఇతడికి జీవించి నన్నాళ్ళు
ఆనందం సుఖము శాంతి అన్ని కరువు
దాని పర్యాయపదమే అవినితి అక్రమార్జన
దాని పర్యవసానమే మద్యపానం మనోవేదన
జీవిత పర్యంతం ఎంత ఉన్నా ఎంత తిన్నా
ఇంకా కావాలని రోదన
ఆరని తీరని వేదన ఆవేదన
ఈ రుతువులోనే
తెల్లారి పోతుంది మనిషి జీవితం
ఈ క్రతువు తోనే
మసక బారి పోతుంది కల్లోల భారతం
మానవత మటుమాయమై పోతున్న
ఈ సంధి కాలంలో..
ఏ ఉగాది వినిపిస్తుంది
అసలైన జీవన సత్యాన్ని
ఏ ఉగాది విశదీకరిస్తుంది
మానవ జీవన తత్వాన్ని
ఏ ఉగాది కొని తెస్తుంది
ఇలపైకి భూతల స్వర్గాన్ని
అందుకే నేను కోయిలనై
కొమ్మ కొమ్మకు ఎగురుతున్నాను
కొత్త పాటలు కట్టి
మనిషి మనిషికి వినిపిస్తున్నాను
ఈ గాలి విరాళి ఈ నేల ఈ పచ్చదనం
ఈ ఆనందం ఈ గీతం ఈ గానం మీ కోసం
అని దీవిస్తున్నది
అరుదెంచిన ఈ మధుమాసం ..
హాయిగా ఆలకించండి ఈ విజయ దరహాసం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి