1, జూన్ 2012, శుక్రవారం

ఓ దేవులపల్లీ !

ఓ దేవులపల్లీ
తెలుగు కళామ తల్లి
జడలో విరిసిన సిరి మల్లీ 
మళ్లి రావయ్యా మా నడుమకి   
మధుమాసాలు మందహాసాలు
కొని తేవయ్యా పుడమికి //
 
మల్లి జాబిల్లి
దారంతా పూవులు చల్లి
ఎదురు చూస్తున్నాయి
నీవు వచ్చే  దారుల్లో ..
ఎల కోయిలలన్ని 
కొత్త కొత్త గీతాలల్లి
నీ కోసం వెదికినవి
ఈ కొండా కోనల్లో //
 
పూదేనియ గ్రోలదు తుమ్మెద
పూదోటను   వీడదు తెమ్మెర
పూలిమ్మని కొమ్మ కొమ్మకు
పురమాయించే దెవరయ్యా
గూడుందని గువ్వల జంటకు
గుర్తు చేసే దెవరయ్యా   //
 
ఓ  దేవులపల్లీ !
నీ కోసం పూమాలలు అల్లి
ప్రతి హృదయం సుమసదన మైనది
నీ పదముల సడి  వినాలని
ప్రతి గాలి మలయమారుతమైనది
 
రావయ్యా  ప్రభాత కుసుమంలా
రావయ్యా ప్రసూన విభవంలా //
 
(ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి.... భక్తి ప్రపత్తులతో )

5 వ్యాఖ్యలు: