10, జూన్ 2012, ఆదివారం

పాటలోకి ప్రయాణం

తెల తెల వారుతున్న వేళ , ఆమె తలారా స్నానం చేసి కురులారబెట్టుకొంటూ ఎగిరే ముంగురులు సవరించుకొంటూ
తోటలో తిరుగాడుతూ రేయి జరిగిన సన్నివేశాన్ని పరవశంతో సున్నితమైన భావాలతో సుందరమైన పదాలల్లి  పాడుకొంటున్నది .తన విభుని నిద్దుర లేవమంటూ రాత్రంతా ఎన్ని ఘన కార్యాలు చేసావో చూసావా అని అలుకలు బోతున్నది
 
మల్లె పూవులు విరిసేరా మంచు తెరలు తొలగెరా
నల్లనయ్యా మేలుకో చల్లనయ్య మేలుకో
 
మల్లెలు విరిశాయి మంచు తెరలు కరిగి పోయాయి ఇంక  లేవయా మహానుభావా అంటున్నది 
 అంతే కాదు తన బుగ్గలపైన పంటి నొక్కులున్నాయని
అతని   పెదవుల పైన తన కాటుక రేఖ అంటుకున్నదని
 
పురిటి వెలుగుల బుగ్గ పైని పంటి నొక్కులు కంటిరా 
చిరుత నవ్వుల పెదవిపై నా కంటి కాటుకలంటేరా
 
ఇంకా చిక్కు పడిన కురులు ఒక్కసారి పరికిస్తే సిగ్గు ల మొగ్గై పోతున్నానని 
ఆ హాయి తలచుకుంటే గమ్మత్తుగా వుందని అంటున్నది  
 
చిక్కుపడిన కురులు చూచి సిగ్గు ముంచుకు వచ్చేరా 
రేయి గడిపిన హాయినంతా మనసు నెమరు వేసేరా 
 
ఎంత ఆరాధన ఒలికించిందో ఈ మాటల్లో తను నవ్వితేనే గాని  తెల్లవారదని ఆ నవ్వుల్లో చూపుల్లో
 తన జీవితం రసబంధురం  అని హాయిగా ఎలుగెత్తి గానం చేస్తున్నది
 
నీవు నిండుగా నవ్వినపుడే నాకు నిజముగా తెల్లవారును 
నీ నవ్వులోనే నా రేపుమాపులు గలవురా నీ చూపులో
 
 కురులు చిక్కు పడడం ,పెదవుల  పైన కాటుక లుండడం, మనసు నెమరు వేసుకోడం
పురిటి వెలుగులు , పంటి నొక్కులు ఇలా   ఎన్నెన్నో పద బంధాలు ..
పాట నిండా పరచుకున్న అనురాగం ఆరాధన ప్రణయం అపురూపం
ప్రతి పదం సన్నివేశాన్ని బరువుగా మోస్తూ సందర్భాని సూచిస్తూ
శృంగార సన్నివేశమే అయినా అశ్లీలం అణుమాత్రం కనుపించదు
 
 
పాట వింటే హృదయంతో వినాలి   ప్రతి చరణం లో లీనం కావాలి .
ఆసన్నివే శం లోకి  చొచ్చుకు పోవాలి. అప్పుడే ఆ పాట ధన్యం
 
ఈ గీతం ఓ యాభై ఏళ్ల క్రితం ఇల్లాలు అనే చిత్రం లో వచ్చింది 
ఆనాటి నుంచి నన్ను నిరంతరం వెంటాడుతోంది
నా మది పరవశించి నా కలం చేత ఎన్నో గీతాలు వ్రాయించింది
 
''నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది'' అంటారు  శేషేంద్ర
నిద్రాణమైన నా మనసును మేలుకొలిపి వందలాది గీతాలు కవితలు నాలోంచి వెలికి తీసిన గీతమిది
''పాటకు దండం పెడతా ''అంటారు సినారే.. 
నేను ఈ గీతానికి ప్రణమిల్లుతున్నాను

7 వ్యాఖ్యలు:

 1. మంచి మధురగీతాన్ని మాతో పంచుకున్నందుకు కుడోస్!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా చాలా బాగుంది...పాట లోని సాహిత్యం ఆస్వాదించగలిగిన వారు ధన్యులు..ఇంకా అవి అందించేవారు మహానుభావులు..!!
  చాల బగుంది బాలకృష్ణరెడ్డి గారూ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పాట సాహిత్యానికి మీ వర్ణన మరింత వన్నె తెచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచి విభాగం లోకి ప్రవేశించారు.మీ వర్ణన అద్భుతం గా వుంది.ఇంకా మీనుంచి ఈ విభాగం లో మరిన్ని మంచి పాటలకై ఎదురుచూస్తుంటాం

  ప్రత్యుత్తరంతొలగించు