2, ఏప్రిల్ 2018, సోమవారం

ఆ నలుగురు
---------------
ఈనాటి మనిషి
తన కోసం తాను బ్రతకడం లేదు
అసలు తన బ్రతుకు 
తన చేతిలో లేనే లేదు
పని పాట లేని
నలుగురు శాసిస్తున్నారు
పని కట్టుకొని
ఇరుగు పొరుగున వున్న నలుగురు
నిన్ను రెచ్చ గొడుతున్నారు
జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు
ఆశ్చర్యం ...
ఆ నలుగురి కోసం
వారిని మెప్పించడం కోసం
నిరంతరం నీ తపన
వారేమనుకుంటారోనని
అనుక్షణం నీలో సంఘర్షణ
అట్టహాసంగా వివాహాలు
వైభవంగా కర్మ కాండలు
ఆ నలుగురు
మెచ్చుకోవాలని రెచ్చగొట్టారని
ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు
ఈ నలుగురి కారణంగా
స్పర్ధలు కొని తెచ్చు కొంటున్నారు
నరక యాతనని
ముంగిలిలోకి ఆహ్వానిస్తున్నారు
ఆ నలుగురు అన్నారని
కోపోద్రేకం తనవారితో విరోధం
తగాదాలు పోలీసులు
న్యాయస్థానాలు ప్లీ డ ర్లు
చెప్పే వాడికేం .....
ఎగదోసే వాడికి ఇదో సరదా దురద
విన్న వాడే .
.వాడి చావు వాడు చస్తున్నాడు
చెప్పుడు మాటలు విని
చెడి పోతున్నాడు
ఈ నలుగురు
ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు
వీరి పాత్ర సమాజంలో అతి కీలకం
కల్లోలాలు సృష్టిస్తారు
కలహం దాకా నడిపిస్తారు
చాటుగా నవ్వుకుంటారు
ఆపై తప్పుకుంటారు
ఆ నలుగురు
మీ చుట్టూ ఉన్నారు
వుండే ఉంటారు
మిమ్మల్ని
అశాంతి గహ్వరాలలోకి
నడిపిస్తుంటారు
తస్మాత్ జాగ్రత్త .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి