21, ఏప్రిల్ 2018, శనివారం

నేను .....
ఈ లోకం నుంచి విడిపోయాను
అసలేం జరిగినదో నాకు తెలియకుండానే
ఒక అమృత కాసారంలో పడిపోయాను
నా అక్షరాలు
నిర్మించుకున్న రమ్య హర్మ్యంలో
అప్సరాంగనలు
విహరించే అంతఃపురంలో
ఆ మూల గదిలో చిక్కుబడి పోయాను
ఒక అతిలోక సౌందర్య దివ్యధామంలో
సుమబాలలు అరవిరిసిన ప్రమదావనంలో
అపురూపమైన అతిధిగా వుండి పోయాను ,
బాధలు భయాలనుంచి,
చింతలు చిడిముడులనుంచి
ఆకలి దప్పుల నుంచి
ఆవేదనలు ఆక్రందనల నుంచి
ఆశ్చర్యంగా విముక్తుడి నయ్యాను
ప్రబంధ పరమేశ్వరుని ఇంట జన్మించి
భావకవితా ప్రతిభా మూర్తి నయ్యాను
ఆమె అందచందాలు అద్భుతంగా కీర్తించి
నవ యువ ప్రణయ కవి చక్రవర్తి నయ్యాను
అలా .....
ఒక సుముహూర్తంలో
ఈ మామూలు జనసమూహం నుంచి
మాయా మర్మం, మాధ్వి రసం
వెల్లువెత్తుతున్న కవన ప్రవాహం నుంచి
అల్లంత దూరంగా జరిగి పోయి
హాయి వెల్లువలో పగలూ రేయి కరిగిపోయి
ఒక సౌందర్యాప్సరో భామిని సాంత్వనలో...
ఆమె వెచ్చని ఒడిలో ఒదిగి వున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి