21, ఏప్రిల్ 2018, శనివారం

పదే పదే
నా మనసులో ఎవరిదో గుసగుస వినిపిస్తున్నది
విసవిస నడిచే
సుతి మెత్తని పాదాల సవ్వడి వినబడుతున్నది
ముసిముసి నవ్వులతో 
చెలరేగిన మిసిమి వయసు అల్లరి పెడుతున్నది
ఎదలోగిలిలో
సోయగాల గలగలలు సందడి చేస్తున్నాయి
సంగీత సరిగమలు, గజ్జెల రవళులు
గంధర్వ గానాలు గారడి చేస్తున్నాయి
ఏమిటి !!
నా ఎద ఎప్పుడు సంగీత వేదికగా మారినది
ఎవరు నా హృదయాన్ని
ఒక నిరుపమాన రమణీయ సభాస్థలిగా మలచినది
‘అందాల బొమ్మతో ఆటాడవా ..
పసందైన ఈ రేయి నీదోయి స్వామి ‘
ఒక అద్భుత సౌందర్యరాసి
నవరస భరితంగా నాట్యం చేస్తూ
నా ముందుకు నడచి వచ్చినది
‘’ఎంత హాయి ఈ రేయి
ఎంత మధుర మీ హాయి’’
పరవశ గానంతో , ప్రణవ నాదంతో
ఒక ప్రణయ గీతమై నా ఒడిలో చేరినది
నన్నల్లుకొని, హత్తుకొని, ముద్దులతో...
... ........................... .......
......... ........ ......... .......
ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నారా !
ఈ ......చుక్కల చక్కిలిగిలి ఏమిటంటున్నారా
నునుసిగ్గు
తన బుగ్గలపై చిందులు వేయగా
సిగ్గు బరువుకు
కంటిరెప్పలు అల్లన వాలిపోగా
ఆమె అన్నది....
భలే భలే వారండి మీరు
ఎవరైనా ఆ వివరాలు సవివరంగా చెప్పగలరా
అయ్యోరామ !..ఎలాగండి మీతో ,,
అర్ధం చేసుకో .....రూ ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి