26, ఫిబ్రవరి 2012, ఆదివారం

రైతు గీతం

ఏ పల్లెను చూచినా ఏమున్నది గర్వ కారణం
ఏ గుండె తలుపు తట్టినా ఎడారి రోదనం
ఎదుగు బొదుగు లేక ఎండిన జన జీవనం
ఏరువాక కానరాక రైతు బ్రతుకు దారుణం //

ఏవి తల్లీ నిరుడు పండిన పాడి పంటలు
ఏవి తండ్రీ నిన్న నిండిన పసిడి గాదెలు
ఎవరు రాసిగా పోసినారో నీ నొసట బాధలు
ఏ చరిత పుటలలో దాచినారో ఆనాటి మధుర గాధలు //

వానకారు ఒట్టిపోగా ఏతమైనావు
ఎండమావులు ఎదురు రాగా రాత అన్నావు
అప్పులెన్నిచేసినవో ఆస్తి అంతా వేలమాయే
ఆరుగాలం పడిన కష్టం హారతి కర్పూర మాయే //

ఎవరు రారు ఎవరు రారు నీకోసం ఎవరు రారు
ఎవరు రారని ఊరకుంటే ఏరువాకలు కదిలి రావు
ఏకమై రైతులంతా ఒక లోకమై కదలి రండి
అన్యాయం అక్రమం ఎక్కడున్నా ప్రతిఘటించండి
అందరిని అలరించే నాటికాలం పాతలోకం ఇలకి దించండి
కొందరినే వరించిన భోగ భాగ్యం సౌభాగ్యం అందరికి పంచండి //

 వెన్నెముక నీవు - అందుకేనేమో వెనుకబడి వున్నావు
దుక్కిదున్నిన నాగలివి నీవు- దిక్కు తోచక దిగాలుగా ఉన్నావు//

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి