17, జులై 2012, మంగళవారం

చిరునవ్వుకు చెయ్యండి సన్మానం

నేను కవిని కాదు 
రచయిత నసలే కాదు
అక్షరం గురించి అంతగా నాకు తెలియదు    
ఏ  గ్రంధాలు ప్రబంధాలు కావ్యాల పరిచయం లేదు
నాకు తెలిసిందల్లా ఆమె ....
ఆమని అందాలు మోమున చిందు లేయగా
నా జీవన ప్రాంగణం లోకి అరుదెంచిన ఆమె
 
ఆమె చుట్టూ మిరుమిట్లు గొలిపే సౌందర్యం
ఆమె కన్నుల్లో అలవికాని అనురాగం
ఆమె హృదయంలో  నిదుర లేచిన ఆరాధన
 
నా శోధన ఎప్పుడు మొదలయ్యింది
ఇదమిద్ధంగా నాకు గుర్తు లేదు
తోట వాకిట తుమ్మెద ఒకటి
నన్ను దాటుకొని వెళ్తూ కన్ను గీటడం చూసాను
పూల పెదాల పైన అది వ్రాసిన మధుర కవితలు చదివాను
ఏటి గట్టున ఓ రెండు  కంటి పాపలు
ఎదురుగా కూర్చుని నన్నే తాదాత్మ్యంగా గమనించడం చూసాను
అంతలోనే అటుగా వచ్చిన పిల్లగాలి
ఆమె చీర నెగురవేసిన వేళ  రెపరెపల పాట విన్నాను
 
అప్పుడు నేను అలవోకగా పాడుకున్న పాటలు
ఆమె చెక్కిలి మీద చెంప ల పైన చుబుకం మిద  నాసిక పైన
ఏవో మంజుల రాగాలు తొడుక్కొని
ఆమె చిరునవ్వుల  కాంతిలో విహరించడం గమనించాను
నేను వ్రాసిన గీతాలు
ఆమె మోములో నయనాలలో అణువణువులో
కాంతి రేఖలై కర్పూర దీపాలై ప్రకాశించడం కనుగొన్నాను 
 
పుప్పొడి రాలిన చప్పుడు  అతి జాగ్రత్త గా అవలోకిస్తున్న నాకు  
అప్పుడు  అవి కవితలుగా కావ్యాలుగా గీతాలుగా అనిపించలేదు
పున్నమి  వెన్నెలలో జలకాలాడుతున్న నా అంతరంగానికి
అందులో  ఏ గొప్పదనం ఏ మాధుర్యం గోచరించలేదు
 
అందుకే  సౌందర్యం లావణ్యం లాలిత్యం
అనురాగం ఆరాధన పుణికి పుచ్చుకున్న
ఆమె చిరునవ్వుకు చెయ్యండి సన్మానం 
 
ప్రణయ పరిమళాలు ఆ రహస్యాలు తెలుసుకున్న
రస పిపాసులైన మీ గుండె గూటిలో
దాగున్న తారుణ్య భావాలకు చెయ్యండి సత్కారం

3 వ్యాఖ్యలు:

 1. ఛాలా బాగుంది..
  "మీ గుండె గూటిలో
  దాగున్న తారుణ్య భావాలకు చెయ్యండి సత్కారం"
  అద్భుతంగా ఉంది. థాంక్స్ అండీ!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చక్కగా వుందండి,భావాల అలలు అలా ఉప్పొంగిస్తారు,మీరు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అంత ప్రేరణ నిచ్చిన ఆమెకు నమస్సులు.అలాంటి వారుంటే ప్రతి ఒక్కరు కారా మీ వంటి కవులు.జీవితాన్ని ఇంత సుందరం గా వర్ణించే మీ కవితలు వెన్నెల వాకిట సిరి మల్లెలు.

  ప్రత్యుత్తరంతొలగించు