29, మే 2012, మంగళవారం

రాత్రి ఓ అభినేత్రి

రాత్రి
ఓ అభినేత్రి
నాకలలోకొచ్చి
ఓ అభియోగం  చేసింది
దురభి ప్రాయంతో
నామీద నీలాపనింద వేసింది
కొన్నిఅక్షరాలు కూర్చి
తన గురించి
ఓ కావ్యం వ్రాయమంది
కొత్త రాగాలు సృష్టించి
తన సౌందర్యం
రాగ బద్ధం చేయమంది

నేను నవ్వాను
నా ఎదలోని
మువ్వల సడి
వినమన్నాను
నా మనసులోని
మల్లెల పరిమళాలు
నా కనుసన్నలలోని
వెన్నెల పరవళ్ళు
ఆమె అసమాన
సౌందర్యంతో కలగలిపి
కుప్పలు తెప్పలుగా
నేను వ్రాసిన వేల కావ్యాల్ని
ఆమె మ్రోల రాసులుగా పోశాను

ఆపై
విప్పారుతున్న
ఆమె రెప్పల్లో
పుప్పొడి రాగాలు చూశాను

వెన్నెల ప్రవాహం ఒడ్డున

హంస గమనమ్ముతో
హరిణ నయనమ్ముతో
మందహాస మధురాధరమ్ముతో
నువ్వు కదలి పోతుంటే
జంటగా వస్తున్న నాకు
వెన్నెల ప్రవాహం ఒడ్డున
నడుస్తున్న భావన
సమ్మోహనంగా నా చుట్టూ
పరిమళాల వాన

అప్పుడప్పుడు
నీ అరమోడ్పునయనాలు
నావంక  నెలవంకలౌతు
నిలువెల్లా నీ  అందాలకు
నేనాశ్చర్యంతో తల మునకలౌతు
ఈ ప్రయాణం ....
ఒక జీవిత  కాలం కాకూడదా!
 నాలో  గాఢమైన  నిట్టూర్పు

హఠాత్తుగా ఆలింగనంలో ఒదిగి
సుకుమార హస్తాలు  నన్నల్లుకోగా
నీ నీలి నయనాలు ఆర్ద్రం కాగా
ఏమిటి ఏమిటి !!
నీ ఎర్రని పెదవులు విచ్చుకొని
వెలువడ నున్న తీర్పు
ఏమది ప్రియతమా ?

పెదవులపై ఒక గీతం

ఎవరయ్యా నువ్వు 
విరిశరములు నాపై
ఎందుకు సందిస్తావు
ఇరు మేనులు చెరి సగమని
బిగి కౌగిలి బందిస్తావు 
అది ఏమని నిలదీయగా 
చిరు నవ్వులు  చిందిస్తావు//
 
పెదవులపై  ఒక గీతం
         రచియిస్తావు
నిదుర రాని కలలోనికి 
         నడిచొస్తావు 
శివుని విల్లు అలవోకగ 
         విరిచేస్తావు
చిలిపి తలపు తెర దీయగ
 మది వీణను సవరిస్తావు //
 
నిలువెల్లా నెలవంకలు
         వెలిగిస్తావు
తనువంతా చిరు చెమటలు
          తరలిస్తావు
ఉపిరిలో  ఉప్పెనలే
         రగిలిస్తావు 
తగదయ్యా ఇది అంటే
        నవ్వేస్తావు //
 

17, మే 2012, గురువారం

నిన్న రాతిరి ఒక స్వప్నం

నిన్న రాతిరి ఒకస్వప్నం
నిన్ను కలుసుకొమ్మంది
నీ మదిలో మాటేదో
నన్ను తెలుసు కొమ్మంది
నువ్వు 'ఊ' అంటే
నీవెంటే ఉండి పొమ్మంది
నువ్వు ఔనంటే
నాబ్రతుకె కానుకిమ్మంది//

నీ పెదవి పైన   ఎవరి  పేరో రాసుంది
              చదువు కొమ్మంది
నీ చిరునవ్వులో ఏదో గమ్మత్తు ఉంది
              పొదువు కొమ్మంది
నీ పైట నీడలో నన్ను నడవమంది
నీ నడుము వొంపులో నాకు  విడిది అంది //

నీలి నయనాలలో ఆశ్చర్యమే
            పున్నమి వెన్నెల
మేని పరువాలలో అపురూపమే
             పుత్తడి బొమ్మలా
ఆ కడగంటి చూపులో ఎన్ని పడిగాపులో
ఆ వెచ్చని హాయిలో ఎన్ని మునిమాపులో //


ఏ వరమిస్తావో !

అక్షరాలతో  నీ అందాల్ని
ముచ్చటిస్తున్నాను
అపురూపమైన పద మాలలు
 అల్లుతున్నాను

నీ పెదాల లోయల్లోంచి
పసిడి దరహాస మెప్పుడు
చిప్పిలుతుందో నని 
గుప్పెడు భావాలు వెంటబెట్టుకొని
గుండె చిక్కబట్టుకొని 
గంపెడాసతో ఎదురు చూస్తున్నాను

నీ నును లేత పాదాలను
కాలి అందియల ఘలంఘలలు
నా వైపు నడిపించే
మధుర సన్నివేశం కోసం
వేఛి  వున్నాను

నులివెచ్చని నీ ఊపిరులు
నన్ను చుట్టు ముట్టి 
ఉప్పెనలై తుఫానులై
ఉక్కిరి బిక్కిరి చేసే తరుణం కోసం
తహ తహతో ఉన్నాను

ఎప్పుడు వస్తావో
నను కరుణిస్తావో  
మరి ఏ వరమిస్తావో !

14, మే 2012, సోమవారం

నీ సోయగం చుట్టూ

అనుక్షణం 
భ్రమరం 
సుమ ప్రదక్షిణం 
చేసినట్లు 
నేను 
నీ సోయగం చుట్టూ 
ఆర్తితో పరిభ్రమిస్తున్నాను 
 
ఆణువణువూ 
వేణువు ఊదినట్లు
అహరహము 
వీణ మీటినట్లు
నీ సౌందర్య రసాస్వాదనంలో 
రమ్య స్వప్నావిష్కరణంలో 
ప్రతి నిమిషం 
పరవశి స్తున్నాను
 
నీ దరహాసం
కరుణిస్తే
ఓ ప్రబంధానికి
శ్రీకారం చుడతాను
నీ కరకంకణ
నిక్వాణం వినిపిస్తే
ఓ కావ్యమై
పుడతాను

13, మే 2012, ఆదివారం

నువ్వొక పూల తోటవి

నువ్వొక పూల తోటవి
రకరకాల కుసుమాలని
నీ తనుద్యానవనంలో
పూయించ గలవు

నువ్వొక  చిలిపి తేటివి
నా అంగీకారం లేకుండానే 
నా అందాల మకరందాలు
ఆస్వాదించ గలవు

నువ్వొక కొండ వాగువి 
శతకోటి మెలికల నడకలతో 
ఎనలేని ఒంపులు ఒయ్యారాలతో 
యు వ హృదయాలను ఉర్రూతలూగించ గలవు

నువ్వొక వాన చినుకువి 
తొలి తొలి వలపుల పిలుపులతో 
తొలకరి ఉరుముల మెరుపులతో 
ఎంత వద్దు వద్దంటున్నా 
నన్ను ముద్ద ముద్దగా తడిపేయగలవు

ఎలా తెలుసు

ఎలా తెలుసు 
నా మనసుకు
నీ అందానికి ప్రతిస్పందించాలని
 
ఎలా తెలుసు 
నాకనులకు 
నీ అణువుల మిలమిలతో 
చూపుల దీపాలు  వెలిగించుకోవాలని  
 
ఎలాతెలుసు 
నా వీనులకు
నీ సుతిమెత్తని అడుగుల సవ్వడి 
అతిజాగరూకతగా వినాలని
 
ఎలా తెలుసు -ఎలా తెలుసు
నీ నిరీక్షణలో కాలానికి 
శృంఖలాలు బిగించుకొని 
నీ ఉహలలో కరిగి పోవాలని  
 
ఎలా తెలుసు- ఎలా తెలుసు
ఈ నిముసాలకు
నీ సన్నిధిలో రెక్కలు విచ్చుకొని
విహాయసంలోకి రివ్వున ఎగిరి పోవాలని

10, మే 2012, గురువారం

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'

అనుకున్నాను
అధర సౌందర్యం చూచి 
ఆడంబరం ఆహార్యం చూచి
నీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అని

హరివిల్లు రంగుల్ని
వలువలుగా చుట్టుకున్న నువ్వు
మరు నిముషంలో
మటుమాయం ఔతావని

అయితే అన్నన్నా  !!..
నీ భాగ్య మేమని వర్ణించను
ఎన్ని లావణ్యాల్ని స్పృశిస్తావో
ఎన్ని మాలిన్యాలు నిర్ములిస్తావో
ఎన్ని కాంతి కేరింతలని మోసుకోస్తావో
ఎంతహాయి వెల్లువని తరలించు కోస్తావో

అరిగి పోయి కరిగిపోయి తరిగిపోయి
నివురై ఆవిరై కనుమరుగై పోతావు

ఒక్క క్షణమైతే నేమి
వెన్నెల ముద్దగా వెలిగి
ఒక్క నిముసమైతే నేమి
వన్నెల వాకిళ్ళు కలయ తిరిగి
వేయి వసంతాల సోయగాన్ని
 సొంతం చేసికొన్న సౌగంధికావనమా !
నీ జీవన రాగానికి   జేజేలు
నీ అసమాన త్యాగానికి  జోహారు

శ్రీశ్రీ గారి 'కుక్క పిల్ల'

ఎట్టాగయితేనేం
మనిషిని ఆకట్టుకున్నావు 
మనసు గుట్టు తెలుసుకొని
మమతని ఆప్యాయతని అలవరచుకొని
నట్టింట్లో తిష్ఠ వేశావు

వాకిలిలో వున్నా వొళ్ళో చేరినా
వల్లమాలిన సౌజన్యం ఒలక బోస్తావు
తెలిసిన వాళ్లోస్తే తీయగా మూలిగి
అత్యంత అనురాగంతో
మును ముందుగా పలకరిస్తావు

నీలో అర్ధం కాని ఆత్మ వున్నది
ఏ ప్రాణికి అంతు చిక్కని ఆర్తి వున్నది
కనుకనే ఇంత సన్నిహితం కాగలిగావు
మానవాళిని సమ్మోహితం చేయగలిగావు

ఆ మహాకవి కవిత్వంలో
ద్వితీయ స్థానం నీది
ఏ ఇంటి కెళ్ళినా
ప్రధమ ప్రస్తావన నీది

ఎలాగయితేనేం 
ప్రేమాను రాగాలు ప్రదర్శించి
ప్రధమ శ్రేణిలో పాసయ్యావు
ఎనలేని విశ్వాసం కురిపించి
మనిషికే మార్గదర్శకం అయ్యావు

శ్రీ శ్రీ గారి 'అగ్గి పుల్ల '

నువ్వేదో ప్రభంజనం 
సృష్టిస్తావనుకున్నాను గాని
ఇంకా తడి ఆరని
పసుపు పారాణి పైన
నీ ప్రతాపం చూపిస్తావనుకోలేదు

నీ మేధా సంపత్తితో
ఈ జగతిని వెలిగిస్తావనుకున్నాను గాని
అతి గతి లేని అమాయకుల గుడిసెల్ని
పరశురామ ప్రీతి చేస్తా వనుకోలేదు

నీ ఆకారం చూసి
రాకెట్లా దూసుకు పోతావని
కమ్ము కొస్తున్న చీకట్లను
చెరిపేస్తావని భ్రమించాను
నల్లని పెదవులపై న పడి దొర్లే
సిగరెట్ ఎంగిలి కోసం
పరితపిస్తా వనుకోలేదు

బీడీ ముక్క మొహంలో
అద్దం చూచుకొంటూనో
బొగ్గుల కుంపటి ముంగిట్లోనో
తూలి  పడ్తూ ఉంటె
దుశ్శాసనుని రొమ్ము చీల్చేదెప్పుడు
దురాగతాల తలరాత మార్చే దెప్పుడు
నిన్ను ఆకాశానికెత్తిన
ఆ మహాకవి ఆకాంక్ష నెరవేర్చే దెప్పుడు

ఆ చిన్ని గుడారాన్ని  వీడి
గుడి గోపురాల వైపు నడిచిరా
వెలుగు జాడ లేని
చీకటి ప్రాకారాల వైపు కదలిరా \
అగ్నివై, ఆగ్రహోదగ్రవై
అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టగా
నీతి లేని, నియతి లేని
నియంతల భవంతుల్ని
నిలువునా దహించగా ............

మిత్రమా వెళ్లి పోయావా

అదేమిటి మిత్రమా !
అప్పుడే అదృశ్య మయ్యావ్ 
అంత తొందర ఏమొచ్చింది 
ఏ దివి నుండి  పిలుపొచ్చింది 
 
నిన్ననే కదా మనం 
మరణం గురించి మాటాడుకున్నాం 
మరణ చరణ కింకిణీరవం గురించి
మౌనంగా ముచ్చటించుకొన్నాం
ఇక్కడ మనిషిగా జన్మించడం గురించి
కడదాకా మనిషిగా మసలడం గురించి
మానవతా మందిరాల నిర్మాణం  గురించి
ఆ మనోజ్నసుందర పధాల గురించి
ఎంత సుదీర్ఘంగా చర్చించుకొన్నాం
 
విచ్చిన పని అయిపోగానే
పరిమళాలు విరజిమ్మిన కుసుమం
తోటను విడిచి వెళ్లినట్టు
వచ్చిన పని అయి పోగానే
గుండె గుండెలో నీ జ్ఞాపకాలు మిగిల్చి
ఎంత హాయిగా పయనమయ్యావ్
అంతలోనే ఒక మంచి పాటగా పుట్టాలని
అందరి  హృదయాలలో అడుగెట్టాలని
ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావ్
 
ఏనాటిదో కదా మన పరిచయం
ఎంత బాధాకరమైనదో నిర్యాణం
ఎవరికైనా తప్పదు, అది అనివార్యం
           (మిత్రుని ఆకస్మిక మరణానికి చలించి )

ఎన్నెన్ని ఎదురుతెన్నులో

నవ్వులు నేర్పమని పువ్వులు 
నడకలు నేర్పమని సెలయేళ్ళు 
నిన్ను ప్రాధేయ పడినాయని విన్నాను 
 
నయనాలలో కొలువుండాలని కలువలు
ముంగురులు ఊగించాలని మలయానిలములు 
ముచ్చట పడినాయని విన్నాను
 
నీలాంబరపు మెరుపులు నీ కనుపాపలలో 
ఆలింగ నాభిలాష క్రీగంటి చూపులలో 
కలవని తెలుసుకొన్నాను 
 
ఇంకా...
 
నీ పాదాల మెత్తని  స్పర్శ కోసం 
ఈ పచ్చిక మైదానం 
నీ సౌందర్య పరి మళాలలో
తడిసి తరించాలని ఈ పరిసరం 
నిన్ను తనివి తీరా 
తిలకించాలని ఈ నదీతీరం
ఎదురు చూపులు చూస్తున్నాయని
ఎదను తెరిచి వేచి ఉన్నాయని, విని
ఎంతగానో అచ్చెరువొందాను

9, మే 2012, బుధవారం

నువ్వు గుర్తొస్తే చాలు

నువ్వు గుర్తొస్తే చాలు
నర్తిస్తాయి నాలో
వన మయూరాలు..

నువ్వు నడిచొస్తే చాలు
నా లోగిలి నిండా
కోయిల 'కుహూ 'రవాలు ..

నువ్వు కరుణిస్తే చాలు
నా జీవితమంతా
నందనవనాలు బృందావనాలు ...

బిగి కౌగిలి బంధిస్తే చాలు
అణువణువునా
మల్లెలు మందారాలు

ఒక రేయి వెలిగిస్తే చాలు
మాతృత్వపు మమకారాలు
ఒకహాయి రగిలిస్తే చాలు  
అస్తిత్వపు శ్రీకారాలు
ఒకటొకటే ఎదురొస్తాయి
మనో జ్న  ప్రాకారాలు                                    
ఒడిలోనికి కదిలోస్తాయి
మంజుల ఓంకారాలు

8, మే 2012, మంగళవారం

సంగీతం

నీకు 
సంగీతం రాదన్నావుగా
మరి కన్నులలో ఏమిటా గీతం
కనుసన్నలలో ఏమిటా సంగీతం
 
నీకు
నృత్యం చేతకాదన్నావుగా
మరి కంటి పాపల కదలికలో
ఏమిటా నాట్య కేళి
అటు ఇటు ఊగే వాల్జడలో
ఆందమైన కధాకళి
 
నీకు
సాహిత్యం అసలు తెలియదన్నావుగా
అణువణువునా
దారి పొడవునా ఏమిటా రచన
అడుగడుగునా అగుపించే
అలరించే ఆ నటన
 
అందుకే నువ్వు
సంగిత సాహిత్య సరస్వతివి
నా హృదయాన
ప్రతి కవనాన నర్తించు
నిత్య చైతన్య జీవనఝరివి