13, జులై 2012, శుక్రవారం

ముద్ద మందారం

గుండెలోన దూరి గువ్వల్లే ఒదిగావు
మత్తిలిన కళ్ళతో  ఒత్తిగిలి పడుకున్నావు
నల్లని ముంగురులు అల్లన నిమరగా
అలవోకగా కనురెప్ప లెత్తి అల్లరి చూపులు రువ్వావు
ఏదో చెప్పాలని కదిలీ కదలని పెదవులు
'అర్ధం కాలేదా '
చిలిపిగా నును లేత నవ్వులు

ఎన్నాళ్ళయిందో ఈ దృశ్యం చూచి
ఎంత కాలమయిందో రహస్యాలు దాచి
మెత్తని అణువుల హాయి కొత్తగా వుంది
చిలిపి చిలిపి తలపులతో రేయి మత్తుగా వుంది

ముంగురులు సవరిస్తున్న అంగుళులు   
అంగుళుల నలరిస్తున్న ముంగురులు
ముద్దు మోమును కప్పుకున్న తీరు
మునిమాపు వేళ మురిపాల సెలయేరు

ఎందుకా చిలిపి నవ్వు
ఇంతకీ ఎవరు నువ్వు
నన్నుడికిస్తూ ఊరిస్తూ వారిస్తూ 
నా చెంపపై కురులను ఆడిస్తూ
ఏనాటి చెలిమి ఇది
ఎంత గొప్ప కలిమి ఇది
మేఘాల తెర తొలిగి నిండు చందురిని వెలుగు

పెదవి కెదురైన పెదవి
ఎన్ని కావ్యాలు రచించిందో 
ఎదలోన ఒదిగొదిగి ఎన్ని గీతాలు పాడిందో
సుందర సురుచిర పధాల వెంట ఎంత హాయి సంచరించిందో
ఒక్కపరి ఉక్కిరి బిక్కిరై గుండెల్లో దూరి
ఎన్ని సంచలనాలు ఎన్ని సంభ్రమాలు
ఇంత గొప్ప అనుభూతిని  ఇన్నాళ్ళు ఎంతగా కోల్పోయానో
ఇక్కడ కురుల మధ్య చిక్కుకున్న చక్కని లావణ్యాన్ని నును లేత చెంపల్ని 
సున్నితంగా సుతారంగా నాశికతో పలకరిస్తుంటే ఎంత హాయి

'ఏమిటి మాటాడవు 
మాటకన్నా మౌనం గొప్పదనా
ఎందు కీ కన్నీళ్ళు,  కన్నుల్లో స్వచ్చ మైన నీలాలు
ఎంతసేపని అలా చూస్తావు
చిలిపి ప్రశ్న
కాలం పరుగెత్తుతోంది
కాలాన్ని జయించాలి
నిదుర  మరచి తదేకంగా యుగాలు గడపాలి

 'అంటే నిర్నిద్రనా '

' కదా మరి'

' ఎంత కాలానికి దొరికావు, ఆణిముత్యానివి '

'ముత్యాన్నా'

'ముద్దమందారానివి కూడా ' 

2 కామెంట్‌లు:

  1. పెదవి కెదురైన పెదవి
    ఎన్ని కావ్యాలు రచించిందో
    ఎదలోన ఒదిగొదిగి ఎన్ని గీతాలు పాడిందో
    సుందర సురుచిర పధాల వెంట ఎంత హాయి సంచరించిందో
    చదువుతుంటే మనసంత ఎంత హాయి.కవితా గమనం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి