24, అక్టోబర్ 2012, బుధవారం

సరస సంగీతం

తీగలా వచ్చి
పూవులా విచ్చి
వాగులా నడిచి
వానలో తడిసి
వయ్యారాలన్ని కుప్పలుగా పోశావు
సింగారాలన్ని సిగ్గులుగా దాచావు //
 
రాజులా వచ్చి
మోజులే తెచ్చి 
ముద్దులే ఇచ్చి
కౌగిలిలో గుచ్చి
వయ్యారాలన్ని  వరి మడిగా చేసావు 
ఒకటై పోదామని    వరమడిగేసావు //
 
నిన్న పూచిన మల్లెలన్ని
       పెదవిపై  దాచానన్నావు
నిన్నకురిసిన వెన్నెలంతా
        వృధా చేసానన్నావు
నిన్న రాతిరి వింతలన్నీ
        కధలు కధలుగా చెప్పావు
ఎంత జాతర చేసినావని
         ఊరంతా దండోరా వేశావు//
 
 
కళ్ళు రెండు మూసుకొంటే 
        కంటి పాపలో  కొచ్చావు 
ఒదిగి ఒదిగి నేనుంటే 
        నడుము వంపులో దాగావు 
కంటి పాపలో నేనుంటే 
         ఏల కసురు కుంటావు
నడుము వంపులో దాగుంటే
         ఏల వద్దు వద్దంటావు //
  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి