24, అక్టోబర్ 2012, బుధవారం

పొరపాటున

పొరపాటున
తోటలోకి వెళ్ళానా
ఒక పూవు  అడిగింది
తనలా కుసుమించమని

పొదమాటున
పైట సరిచేసుకున్నానా
తేటి అడిగింది
తన పాటకు నాట్యం చేయమని

కొమ్మ నవ్వింది
కొంగు సరి చేసుకొని
రెమ్మ నవ్వింది
కళ్ళు  అరమూసుకొని
మొగ్గ అడిగింది
సిగ్గు శృతిచేసుకొని
పచ్చని అందానికి
ప్రాయం వచ్చెనని
ఆ ముచ్చటలన్నీ
ఇంకెప్పుడని

చీర నడిచింది
చుట్టు కొంటు వయ్యారాన్ని
కొంగు తడిమింది
కొత్త కొత్త అందాన్నీ
నడుము అలిగింది 
నడక యింక చేత కాదని
వయసు కసిరింది
అల్లరింక తన వల్ల కాదని

మనసు నవ్వింది
మార్గం ఉన్నదని
మౌనంగా చెవిలో చెప్పింది
మధుమాసం వస్తుందని
అందాకా  కోరికలకు
కళ్ళెం వేయమని

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి