8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఒంగోలు వృషభం

ఒంగోలు వృషభం

ఇది ఒంగోలు ఎద్దు
నింగి దీని సరిహద్దు

ఇది ఒంగోలు గిత్త
ఉదాత్తం దీని చరిత్ర

ఆ పరమశివుని నంది నడచి వస్తున్నదా ఏమి
మనసు పరవశమొంది నర్తిస్తున్నదా ఏమి

వెన్నెలంతా నీ మీదనే కురిసినట్టుంది
నిండు పున్నమి నీవై నడిచి నట్టుంది

తెలుగు జాతికే నువ్వు గర్వకారణం
జాతి నిన్ను మరిచి పోయింది ఎంత దారుణం

లేపాక్షి బసవన్నా లేచి రావయ్యా
ఈ లేగ అందాలు చూచి పోవయ్యా

ఎంత బాగున్నావే లేగ దూడా
వేయి కన్నులు చాలవులే నిన్ను చూడ

నిన్ను మరిచి పోయినాయి మా పల్లెలు
నింగి మరచి పోయినది వాన జల్లులు

పలకరిస్తే పాడియావులు
పారిపోవా ఎండమావులు

అంతరించి పోతున్నది నీ సంతతి
ఆలకించే వారెవరు ఆ సంగతి

మా గుండెల్లో దాగి వున్న జ్ఞాపకానివి
మా జిల్లా గత వైభవ చిహ్నానివి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి