28, ఏప్రిల్ 2012, శనివారం

ఒక విన్యాసం

ఉదయాన్నే
ఆమె ఎదురౌతుంది

ఒక మందారం
ఆమె పెదవి పైన                      
నవ వధువౌతుంది   

ఒక విన్యాసం
ఆమె కనులలో 
రసధుని ఔతుంది

తప్పనిసరిగా
ప్రతి రేయి నాకు  
నిదుర కరువౌతుంది

వసివాడని ఆచిరునవ్వుని
ఆమె లేత అధరం
నిరంతరం మోస్తూనే ఉంటుంది

అరుదైన ఆ పరిమళం
ప్రతి క్షణం నన్ను 
అమరుణ్ణి  చేస్తూనే ఉంటుంది

ఆ చిత్తరువుని ఒడిసి పట్టుకొని
నామనసు పిచ్చిగా యధేచ్చగా
ఎన్నో కావ్యాలు రాస్తూనే ఉంటుంది

ఆ స్నిగ్ధ దరహాసాన్నిదాచుకొని
అనునిత్యం నా హృదయం
నవమోహనంగా నర్తిస్తూనే వుంటుంది

1 వ్యాఖ్య:

  1. ఆమె రోజూ ఎదురవ్వాలని, మీరు ఇలాగే రోజు కవితలు రాసి మమ్మల్ని ఆనందింపచెయ్యలని మా ఆశ.

    ప్రత్యుత్తరంతొలగించు