30, అక్టోబర్ 2017, సోమవారం

నా కావ్యం “ఆలాపనలు సల్లాపములు”లో కావ్యకన్నియ తన నోట ఈ (నా)పాట పల్లవి ఆలపిస్తుంది. అది విన్న నా మిత్రుడు డా.. గంజాం శ్రీనివాసమూర్తి ఇంతకూ ఆ పాట కధా కమామిషు ఏమిటి అన్నాడు .ఓంకారం ఎక్కడ పలికిందంటారు అని గూడా ..ఏనాటిదో ఆ పాట మీ ముందుంచాను ఇంతకీ పాట మొత్తం విన్నారుగా మూర్తిగారూ ! మీరే చెప్పండి ఆ చినుకు పలికిన ఓంకారం ఎక్కడో ఏమిటో .......మిత్రులారా మీరు కూడా ---.
ఒక చినుకు పలికింది ఓంకారం
ఒక చినుకు అలదింది సిందూరం
ఒక చినుకు చుట్టింది శ్రీకారం 
ఒక చినుకు మీటింది సింగారం //
పెదవిపైన పడిన వాన గానమాయెను
అది గుండెపైన జారగనే జాతరాయెను
నడుము పైన పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గానమై
కనుల ముందు బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి పరుగిడగా వనము నవ్వెను
తనువంతా తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే గాలివాన ఆగిపోయెను
ఆదమరచి మనసు వీణ మూగవోయెను //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి