30, అక్టోబర్ 2017, సోమవారం

ఎటు పోతోంది ఈ దేశం
రాజకీయం వృత్తి కాదు
ఉద్యోగం కాదు వ్యాపారం అసలే కాదు
ప్రజాసేవకై రాజ్యాంగం రచించిన ఒక మార్గం 
నిజమైన నాయకుడికి ప్రజాసేవే పరమార్ధం
నల్లదనం వెదజల్లి
కల్లబొల్లి మాటలల్లి
ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి
ప్రతి వాడి కాళ్ళకు మొక్కి
జనానికి మాయమాటలు చెప్పి
అందలం ఎక్కిన వాడికి
అందలం ఎక్కగానే అదికారం చేజిక్కగానే
పదవి రోగం పట్టుకున్న వాడికి
రాచరికపు హోదాలు బాజబజంత్రిలు భుజకీర్తులు
పత్రికలలో పళ్ళికిలించిన ఫోటోలు పనికిమాలిన వార్తలు
సన్మానాలు సత్కారాలు బ్రహ్మరదాలు వేలు లక్షల జీతాలు
పొలీసు పహారాలు బుగ్గకార్లు చుట్టు ఉన్నతాధికార్లు
ప్రజాధనం నజరానాలు రాచరికపు హోదాలు
నిజానికి నిన్న దాకా అమాయకుడు ,,,
కానీ ఠీకాని లేని అర్భకుడు వీడు
అన్యాయం అక్రమం అధర్మం దుర్మార్గం
దౌర్జన్యం ఒళ్ళంతా పులుముకొని
ప్రజాసేవ అంటూ నేడు అవతారమెత్తిన నాయకుడు
అక్షరజ్ఞానం లేని నిశానిలు
అసెంబ్లీలో కూర్చుంటున్నారు
నువ్వంటే నువ్వు వెధవాయివని
ఒకరినొకరు ఏకిపారేసుకొంటు న్నారు
తమ తమ అక్రమార్జనలు
ఏనాటివో ఏకరవు పెడ్తున్నారు
అశ్లీలభాషణలు ఎక్కుపెద్తున్నారు
అసభ్యంగా దూషించు కొంటున్నారు
ఇవి శాసన సభలా దూషణ సభలా
ఒకరినొకరు తిట్టుకోడానికి కలహాభోజనానికి
ఏర్పరచిన కాలక్షేపానికి వేదికలా
సిగ్గు విడిచి ఇంత రభసలా
దానికి ఇబ్బడిముబ్బడిగా
ఇంత ప్రజాధనం దుర్వినియోగం కావాలా
అసహ్యం వేస్తోంది
ఆగ్రహం పెల్లుబుకుతోంది
ఆవేశం ఉప్పొంగుతోంది
ఎవరిదీ ఈ దోషం
ఎంతకాలం ఈ మోసం
-------------నా కావ్యం '' నువ్వు మనిషివా !!'' నుండి నిన్నటి మొన్నటి శాసనసభ సమావేశాలు చూసి ఒళ్ళు మండి -----

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి