30, అక్టోబర్ 2017, సోమవారం

ప్రతి గుండెలో ఒక గీతం ఉంటుంది , ప్రతి జీవితంలో జీవనరాగం ఉంటుంది, ప్రతి రేయి సంగీతం వింటుంది ,ప్రతి హాయి ఒళ్ళు విరుచుకొంటుంది - అనే భావనతో నేను రచించిన గీతమిది
నా గీతాల సంకలనానికి ముందు మాట వ్రాసిన డా సి నారాయణరెడ్డి గారు అంతగా పరిచయం లేని రోజుల్లో నన్ను చూడగానే ఈ పాటలోని ఒక చరణం తో నన్ను పలకరించారు , అది తలచుకొంటే నేటికి ఒక పులకింత నాలో ఒక గిలిగింత
ఆ తర్వాతి కాలంలో ఈ పాట ‘’ ఈ మాసపు పాట’’గా ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుండి ప్రసారమైంది --ఇప్పుడు ఆ పాట మీకోసం
గుండె గుండెలో ఒక గీతం
ఉండే ఉంటుంది
వెండి వీణలా జీవనరాగం
మీటుతు ఉంటుంది
మదిలో ఎదలో పదనిస రాగం
పాటై ఉంటుంది
మనసు సొగసు మల్లెల గుసగుస
వింటూ ఉంటుంది //
కంటి పాపలో నీలాకాశం
నెలవై ఉంటుంది
కంటి చూపులో వెన్నెల మాసం
కొలువై ఉంటుంది
పెదవి మీటితే ఒక మధుమాసం
వధువై వస్తుంది
పదము పాడితే ఒక దరహాసం
వరమే ఇస్తుంది //
సందె గాలిలో జావళి పాట
తోడుగ వస్తుంది
కాలి అందెలో జాబిలి గీతం
వేడుక చేస్తుంది
కుసుమశయ్యపై కుంకుమరాగం
కోవెల కడుతుంది
కుసుమించిన జీవనరాగం
కోయిల ఔతుంది //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి