30, అక్టోబర్ 2017, సోమవారం

నా జీవితమే కవిత్వం - నేనే ఒక మహా కావ్యం
------------------------------------------------------------
నేను కవిని
కాని కవిత లల్లను, ఏ కావ్యాలు రాయను
కాని నేను కవినే, జీవితాన్ని కవిత్వంగా రాస్తుంటాను
ప్రతి నిముసాన్ని అందంగా చెక్కుతుంటాను,
ప్రతి ఆనందాన్ని కావ్యంగా మలుస్తుంటాను
ప్రతి ఉదయం నాకు పరవశ గీతం .
ఎదురైన ప్రతి మనిషి అందులో అందమైన చరణం
ప్రతి గీతం నవరస భరితం. నాకు జీవితమే కవిత్వం.
నా జీవనమే అద్భుతమైన గ్రంధం
నిన్న నాకు గతం. ఈ రోజు నిజం,
రేపు ఏమో ఏమౌతుందో తెలియని అయోమయం
అందుకే జీవితాన్ని సుందర ప్రబంధంగా వ్రాస్తుంటాను.
ప్రతి రోజు పేజిని మధు మాధుర్యంతో నింపుతుంటాను
ప్రతి దినాన్ని పరిమళ భరితంగా.
మకరంద మాధురీ సహితంగా, రసరమ్యంగా రవళిస్తుంటాను
కవిత్వం రాయక పోతేనేం,
కావ్యాలు వెలువరించక పోతేనేం - నేను కవినే
జనరంజకంగా జీవన కావ్యం రాస్తున్నాను గదా,
ఎన్నో హృదయాల్ని రంజింప జేస్తున్నాను గదా
అనునిత్యం ఎందఱో నన్ను చదువుతుంటారు
నా జీవితాన్ని ఒక గీతంగా పాడుతుంటారు
నా ప్రతి కవితని ఎదురైన వారికీ అద్భుతంగా వినిపిస్తుంటారు
ఎంత గొప్ప కవిత్వమో అని అందరు ప్రశంసిస్తుంటారు
నా దైనందిన జీవనం గంధర్వ గానమని పరవశిస్తుంటారు
నా జీవితం నిండా ఆమని నడచి వచ్చిన ఆనవాళ్ళు ,
దారి పొడవునా అరవిరిసిన నవ వికసిత కుసుమాలు
నా జీవన కావ్యమంతా కోమల సుమ దళాల పరిమళాలు ,
ఎలకోయిల కుహురవాలు, చల్లని వెన్నెల విహారాలు
మృదు మందహాసాలు, నులి వెచ్చని గాఢ పరిష్వంగాలు
నా జీవన ప్రాంగణం లో ముళ్లుండవు, రాళ్లుండవు,
కన్నీళ్ళు ఉండవు, కంటకాలుండవు
కారు చీకటి దారులుండవు,
కాలకూట విషాలు విషాదాలు అసలే ఉండవు
అంతటా పచ్చని మైదానాలే, పంట పొలాలే,
హాయి గొలుపు సమీరాలే, హరి విల్లుల ద్వారాలే
సుందర నందన వనాలే, సిరి మల్లెల అల్లరులే చిరు నవ్వుల సందడులే
నా రచనలన్నీ అమలిన భావాలే అమృతారావాలే
నా కలం పలికించినవి భావ గీతాలే, మధుర మనోహర మంజుల రాగాలే
చెరిగి పోని శిలాక్షరాలతో నా జీవన కావ్యం రచిస్తున్నాను
ఎన్ని వందల గీతాలు రాసానో లెక్కలేదు.
ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం ఒక కావ్యం గా
ఎన్ని కవితలు రచించానో గుర్తు లేదు .
ఎన్ని కావ్యాలు రానున్నవో చెప్పలేను
నేను కవిని. నేను వ్రాసేది జీవితం
నా జీవితమే కవిత్వం నేనే ఒక మహా కావ్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి