27, అక్టోబర్ 2017, శుక్రవారం

అవి సినిమాలా 
---------------
అవి నృత్యాలా 
ఆ పిచ్చి గంతులు కుప్పిగంతులు 
గుంపులు గుంపులుగా ఇకిలింతలు సకిలింతలు 
మెలికలు తిరుగుతూ మూలుగులు రంకెలు కేకలు

అవి గీతాలా
కొన్ని ముక్కలు అతికించి
కొన్ని పరభాషా పదాలు ఇరికించి
వాటిని భాషరాని వారిచేత కొరికించి
కొన్ని మూలుగులు వినిపించి
అవి చూచి మేము ఆనందించాలా
అరకొరబట్టలు వేసుకొని ఆడపడుచులు తైతక్క లాడుతుంటే
అశ్లీలంగా చిందు లేస్తుంటే అవి మా కోరిక మేరకు అంటారా

ఘనత వహించిన సిని కవులరా దర్శక నిర్మాతలారా
ముందుగా వాటిని మీ కుటుంబ సభ్యులకు చూపించండి
వారికీ అరకొర దుస్తులేసి ఆ పిచ్చి పాటలు పాడించి
తైతక్క లాడించి నడి వీధిలో నడిపించండి

కోట్లు ఒక్కటే కాదు కావలసింది
మీ దుర్మార్గాన్ని దురాశని మామీద రుద్దకండి
ఆ దరిద్రాన్ని నిషిద్ధాన్ని జనం మీద విసరకండి

జాతి సంస్కృతి నాగరికత ధ్వంసమై పోతున్నది
మానవత మంట గలిసి పోతున్నది
ఎవరు మిమ్మల్ని బొట్టుపెట్టి అడగడం లేదు
ఆ కట్టుబొట్టు మార్చి చీకొట్టేలా కాకుండా
అందరిని ఆకట్టుకొనేలా చలన చిత్రాలు తీయండి

మీ కళ్ళకు కట్టిన గంతలు తొలిగించి
గుడ్డ పీలికలు పిచ్చి గంతులు మూలుగులు
మీ ఆకలి కేకలు తగ్గించుకొని
అద్భుతమైన సంస్కృతి వైపు
అడుగులు వేయండి
మనజాతి పరువును కాపాడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి