27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎప్పుడు నా హృదయంలో 
ఒక ఓంకారం నినదిస్తూనే ఉంటుంది 
ఎల్లవేళలా నా మదిలో 
మధు ఝంకారం రవళి స్తూనే ఉంటుంది 

నిరంతరం హాయిగొలిపే 
మలయ సమీరం నన్నలరిస్తూనే ఉంటుంది 
హృదంతరంలో నిరంతరం 
మల్లెల పరిమళం విరజిమ్ముతూనే ఉంటుంది 

నా పాటలు నేర్చిన ఎలకోయిల 
తన గళమెత్తి గానం చేస్తూనే ఉంటుంది 
నన్నల్లుకున్న సిరి వెన్నెల 
నవరస భరితంగా నాట్యం చేస్తూనే ఉంటుంది 
విశాల నయనాల చిప్పిలిన 
కాంతి కిరణ మొకటి నను లాలిస్తూనే ఉంటుంది 

ఉప్పెనలా ఎగిసి పడిన 
ఉచ్చ్వాస మొకటి నన్నుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది 
గాలికి ఎగిరిన చేలాంచల మొకటి 
గోముగా నా మోమును స్పృశి స్తూనే ఉంటుంది 

లేత పెదవుల విరిసిన చిరు నవ్వొకటి 
నన్ను అనునిత్యం శాసిస్తూనే వుంటుంది 
కాలి అందియలు సందడించిన 
నిక్వాణ మొకటి నన్ను మురిపిస్తూనే ఉంటుంది 

ఆదమరచి ఆర్తితో అల్లుకున్న 
మధురాలింగన మొకటి సమ్మోహితం చేస్తూనే ఉంటుంది 
మధురరాగాలు అవధరించిన 
అధర ప్రాంగణ మొకటి నన్ను కరుణిస్తూనే ఉంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి