27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక పాట గాలిలో ఎగురుతూ ఉంటుంది 
ఎన్నాళ్ళిలా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉండను 
నేలకి దిగి రావడానికి నా సాయం అడుగుతుంది 
ఆర్తితో గడ్డం పట్టుకొని ఎంతగానో బ్రతిమలాడుతుంది 

ఎంత జాలి వేస్తుందో 
కొన్ని పదాలతో రధాన్ని సిద్ధం చేసి అధిరోహించమంటాను 
కొన్ని రాగాలు లయబద్దం చేసి ఆడి పాడ మంటాను 
నాలోని సర్వ శక్తుల్ని ఒడ్డి ఒక పాటకు ప్రాణం పోస్తాను

ఆ పాట చేయి పట్టుకొని ప్రపంచమంతా చుట్టి వస్తాను
అలసిపోయినపుడు ఆ పాట పయ్యెద నీడలో సేద దిరుతాను 

పాట ఒక అద్భుత సౌందర్య రాసి 
నేను వ్రాసిన ప్రతి పాట నా ప్రేయసి //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి